= ఎయిర్‌పోర్ట్ మార్గం మరింత సుగమం
= హెబ్బాళ నుంచి విమానాశ్రయానికి ఎలివేటెడ్ హైవే, ఫ్లైవోవర్లు
= రూ.680 కోట్లతో నిర్మాణం
= 15 రోజుల్లో పనులు పూర్తి
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : నగరంలోని హెబ్బాళ నుంచి కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు రూ.680 కోట్ల వ్యయంతో నిర్మించిన ఎలివేటెడ్ హైవే, ఫ్లైవోవర్ల నిర్మాణం దాదాపుగా పూర్తయింది. ఈ నెలాఖరుకు వీటిని ప్రారంభించనున్నారు. జాతీయ రహదారుల ప్రాధికార అత్యంత వేగంగా పనులను పూర్తి చేస్తోంది. 2010లో ఈ పనులు చేపట్టారు. చిక్కజాల, హుణసేమారనహళ్లి వద్ద ఎలివేటెడ్ హైవే పనులు పూర్తయ్యాయి. విద్యా నగర, బాగలూరు క్రాస్‌ల వద్ద మరో 15 రోజుల్లో పనులు పూర్తవుతాయి. ఈ మార్గంలో కొన్ని చోట్ల ప్రస్తుతం ప్రయోగాత్మకంగా వాహన సంచారాన్ని అనుమతించారు.
నగరంలోకి మరో ఎలివేటెడ్ హైవే
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గురువారం ఈ పనులను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి ఆస్కార్ ఫెర్నాండెజ్‌తో మాట్లాడి ఈ నెలాఖరులో ప్రారంభోత్సవానికి తేదీని నిర్ణయిస్తామన్నారు. హెబ్బాళ, జక్కూరుల వద్ద రెండు పక్కలా సర్వీసు రోడ్డు కోసం జాగా వదలడానికి వైమానిక దళం సమ్మతించ లేదని తెలిపారు. దీనిపై రక్షణ శాఖ మంత్రి ఏకే. ఆంటోనీతో మాట్లాడి స్థలానికి అంగీకారం పొందుతామన్నారు. అలాగే బ్యాటరాయనపుర నియోజక వర్గంలో ఓ ఆలయం దారికి అడ్డంగా ఉందని, దీనిపై ఆలయ పాలక మండలితో మాట్లాడాల్సిందిగా ఆ నియోజక వర్గం ఎమ్మెల్యే అయిన మంత్రి కృష్ణ బైరేగౌడకు సూచించామని వెల్లడించారు. కాగా హెబ్బాళ నుంచి నగరంలోకి వచ్చే మార్గంలో లీమెరిడియన్ హోటల్ వరకు ఎలివేటెడ్ హైవేను నిర్మించే ప్రతిపాదన ప్రభుత్వం ముందుందని చెప్పారు. హెబ్బాళ ఫ్లైవోవర్ వ్దద మరో లైన్ నిర్మించడానికి కేంద్రానికి ప్రతిపాదనలు పంపాల్సిందిగా జాతీయ రహదారుల ప్రాధికారకు సూచించామని తెలిపారు. బాగలూరు క్రాస్ వద్ద నిర్మిస్తున్న ఎలివేటెడ్ హైవే పక్కన, ఇతర సర్వీసు రోడ్లలో తమ వద్ద టోల్ వసూలు చేయకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారని ఆయన వెల్లడించారు. దీనిపై ఆస్కార్ ఫెర్నాండెజ్‌తో మాట్లాడి స్థానికులకు ఊరట కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
రూ.570 కోట్లతో రోడ్ల అభివృద్ధి : సీఎం
నగరంలో రోడ్ల అభివృద్ధికి రూ.570 కోట్లను ఖర్చు చేయనున్నామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. మే లోగా పనులను పూర్తి చేస్తామన్నారు. క్యాంపు కార్యాలయం కృష్ణాలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నగరంలో రోడ్ల నాణ్యతపై విమర్శలు వస్తున్నమాట వాస్తవమన్నారు. ఇకమీదట దీనిపై మరింత శ్రద్ధ వహిస్తామన్నారు.