సోషల్ మీడియా రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. ఓవర్ యాక్షన్ చేస్తే అది మన మెడకే చుట్టుకుంటుంది. ఛానల్ ఉంది కదా అనో, చేతిలో కెమెరా ఉంది కదా అనో విచక్షణ మరిచి ప్రవర్తించకూడదు. ఇది తెలియక చాలామంది యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్‌ప్లూయెన్సర్లు ఫేక్‌వార్తలు, సమాచారంతో గప్పాలు కొడుతుంటారు. తాజాగా పబ్లిసిటీ కోసం నిషిద్ధ ప్రాంతంలోకి ఉద్దేశపూర్వకంగా ఎంటరైన ఒక యూట్యూబర్‌కి దిమ్మతిరిగే షాక్ తగిలింది.
విషయం ఏమిటంటే..
బెంగళూరులోని యలహంకకు చెందిన వికాస్ గౌడ (23) అడ్డంగా బుక్కయ్యాడు. ఏప్రిల్ 7వ తేదీన మధ్యాహ్నం 12 గంటల సమయంలో చెన్నైకి వెళ్లే ఎయిరిండియా విమానం టిక్కెట్ బుక్ చేసుకున్నాడు. భద్రతా తనిఖీల అనంతరం విమానాశ్రయంలోకి ప్రవేశించాడు. ఇక్కడి దాకా బాగానే వుంది. విమానం ఎక్కకుండా, విమానాశ్రయ ఆవరణలోనే తిరుగుతూ వీడియో కంటెంట్‌ను రికార్డ్ చేశాడు. ఇక్కడితో సరిపెట్టినా బావుండేది.
ఎయిర్‌పోర్ట్‌లో రోజంతా బస చేసా.. అయినా తనని ఎవరూ పట్టించుకోలేదంటూ ప్రగల్భాలు పలుకుతూ ఏప్రిల్ 12న ఒక వీడియో తన యూట్యూబ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేశాడు. విమానాశ్రయంలో మొత్తం తిరిగినా తనను ఎవరూ పట్టుకోలేదంటూ, ఎయిర్‌పోర్ట్ భద్రత గురించి నెగెటివ్ కామెంట్ చేశాడు. అంతా అయ్యాక డ్యామేజ్ కంట్రోల్‌లో పడ్డాడు. ఆ ఎయిర్‌పోర్ట్ వీడియోను తన ఛానెల్ నుండి తీసివేశాడు. కానీ అది కాస్తా చేరాల్సిన వారి దృష్టికి అప్పటికే చేరిపోయింది.
కట్ చేస్తే.. విషయం తెలుసుకున్న ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ వింగ్ సీఐఎస్ఎఫ్ వికాస్‌పై ఫిర్యాదు చేసింది. దీంతో అతణ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఐపీసీ సెక్షన్లు 505, 448 కింద కేసు కూడా నమోదు చేశారు. తన ఫ్లైట్ మిస్సయ్యానని పేర్కొంటూ, సుమారు ఆరు గంటలపాటు విమానాశ్రయంలో తిరిగాడని, కానీ అతను చెప్పినట్టుగా 24 గంటలు కాదని తన విచారణలో తేలిందని భద్రతా అధికారులు వెల్లడించారు. అతని మొబైల్ ఫోన్‌నుస్వాధీనం చేసుకున్నారు. ఎట్టకేలకు తను చేసింది తప్పేనని అంగీకరించాడు. ప్రచారంకోసం అలా చేశానంటూ లెంపలేసుకున్నాడు. మొత్తం మీద గౌడకు బెయిల్ మంజూరు కావడంతో బతుకు జీవుడా అంటూ బయటపడ్డాడు.
Comments
Please login to add a commentAdd a comment