అల్‌ఖైదా అడుగులు
అల్‌ఖైదా అడుగులు
Published Tue, Nov 29 2016 2:32 AM | Last Updated on Fri, Aug 17 2018 7:36 PM
ఇటీవల కాలంలో వెలుగు చూస్తున్న పరిణామాలు రాష్ట్ర భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. చాప కింద నీరులా అల్‌ఖైదా బేస్ మూమెంట్ పేరుతో చేపట్టిన కార్యకలాపాలు వెలుగులోకి రావడం ఉత్కంఠ రేపుతోంది. మధురై కేంద్రంగా సాగుతున్న ఈ గుట్టును ఎన్‌ఐఏ గుర్తించింది. ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి చడీ చప్పుడు గాకుండా నాలుగు చోట్ల తనిఖీ చేసి నలుగురిని అదుపులోకి తీసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. మరో ఇద్దరు అజ్ఞాతంలోకి వెళ్లడంతో వారి కోసం వేట ముమ్మరంగా సాగుతోంది.
సాక్షి, చెన్నై : రాష్ట్రం ప్రశాంతతకు నిలయం. శాంతి భద్రతల పనితీరు భేష్ అన్నట్టు పాలకులు గొప్పలు చెప్పుకుంటున్నా, చోటు చేసుకుం టున్న నేరాలు, వెలుగుచూస్తున్న పరిణామా లు అందుకు భిన్నంగా ఉన్నాయని చెప్పవచ్చు. రాజధాని నగరం చెన్నై, ఆధ్యాత్మిక నగరం మదురై, పారిశ్రామిక నగరం కోయంబత్తూరు మీద తీవ్ర వాదులు గురి పెట్టినట్టుగా గతంలో కేంద్ర నిఘా వర్గాల నుంచి వచ్చిన సమాచారంతో అప్రమత్తంగానే వ్యవహరిస్తున్నారు. అయితే, చాప కింద నీరులా తీవ్రవాద కలాపాలు ఆయా నగరాల్లో సాగుతున్నాయని చెప్పవచ్చు. ఇందుకు తగ్గట్టుగా సంఘటనలు వెలుగులోకి వస్తున్నారుు. బెంగళూరు బాంబు పేలుళ్ల కేసు కోయంబత్తూరు, తిరునల్వేలి నగరాల చుట్టూ తిరగడం ఇందుకు ఓ ఉదాహరణ. అజ్ఞాత తీవ్రవాదులు రాజమార్గంలో చెన్నైకు వచ్చి వెళ్తున్నా, ఆంధ్ర రాష్ట్రం చిత్తూరు జిల్లా పుత్తూరులో పట్టుబడే వరకు విషయం బయటకు రాలేదు.
ఇక, కేరళలో ఐఎస్‌ఐఎస్ తీవ్రవాదుల మద్దతు దారులు పట్టుబడడం, వారు ఇచ్చిన సమాచారంతో మరికొందరు రాష్ట్రంలోని కొన్ని నగరాల్లో చిక్కడం గమనించాల్సిన విషయం. ఇక, ఆ సంస్థ శిక్షణ నిమిత్తం వెళ్తూ పట్టుబడ్డ వారిలో రాష్ట్రానికి చెందిన యువత ఉండడం బట్టి చూస్తే, తీవ్రవాదుల కార్యకలాపాలకు యువత ఆకర్షింపబడుతోందా? అన్న ప్రశ్న ఏర్పడుతోంది. ఇక, నిషేధిత సిమి, అల్‌ఖైదా, ఐఎస్‌ఐఎస్ సానుభూతిపరులు రాష్ట్రంలో తిష్టవేసి, యువతను దారి మళ్లించే ప్రయత్నంలో ఉన్నారన్న ఆందోళన కలుగుతోంది. తాజాగా, అల్‌ఖైదా తీవ్రవాదులు పట్టుబడటంతో రాష్ట్రం అసాంఘిక శక్తులకు అడ్డాగా మారుతోందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
ఎన్‌ఐఏ: రాష్ట్రంలో తాము అప్రమత్తంగానే ఉన్నామని పోలీసు యంత్రాంగం చెప్పుకుంటున్నా, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్‌ఐఏ) గుర్తించి, రంగంలోకి దిగేవరకూ ఇక్కడ అల్‌ఖైదా మద్దతు సానుభూతి సంస్థ చాప కింద నీరులా కార్యకలాపాలు కొనసాగిస్తుండడం వెలుగులోకి రావడం బట్టి చూస్తే, మన యంత్రాంగం పనితీరును ప్రశ్నించక మానదు. ఆధ్యాత్మిక నగరం మదురై మీద గురి పెట్టి బెదిరింపులు ఇటీవల కాలంగా పెరిగినా, స్పందన కరువే. తాజాగా, ఎన్‌ఐఏ రంగంలోకి దిగడంతో మదురైలో కలకలం రేగింది.
అదుపులో ముగ్గురు: ఢిల్లీ నుంచి వచ్చిన అధికారుల బృందం ఉదయాన్నే మదురై పోలీసు యంత్రాంగంతో కలిసి నాలుగు చోట్ల దాడులకు దిగింది. ఒక చోట ఇద్దరు, మరో చోట ఒకరు పట్టుబడ్డారు. మరో ఇద్దరు అజ్ఞాతంలోకి వెళ్లారు. పట్టుబడిన వారు అల్‌ఖైదా బేస్ మూమెంట్ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేసుకుని గుట్టు చప్పుడు కాకుండా యువతను తమ వైపుకు తిప్పుకునే పనిలో పడడం దీన్ని ఎన్‌ఐఏ గుర్తించి రంగంలోకి దిగడం ఆహ్వానించదగ్గ విషయమే. అదుపులోకి తీసుకున్న వారిలో కరీం, అయుబ్, అబ్బాస్‌లు ఉన్నారు. హకీం, దావూద్ సులేమాన్‌లు అజ్ఞాతంలోకి వెళ్లడంతో వారి కోసం వేట సాగుతోంది. మైసూర్ బాంబు పేలుళ్ల కేసు విచారణలో భాగంగా ఈ సంస్థ కార్యకలాపాలు వెలుగులోకి వచ్చినట్టు సమాచారం. అరుుతే, అదుపులోకి తీసుకున్న విషయాన్ని రాష్ట్ర పోలీసు యంత్రాంగం స్పష్టం చేసినా, పూర్తి వివరాలను ప్రకటించలేదు. అదుపులోకి తీసుకున్న వాళ్లను రహస్య ప్రదేశంలో ఉంచి విచారిస్తున్నారు.
వీరి వద్ద నుంచి ఆయుధాలు, సాంకేతిక సంబంధిత పరికరాలు, ల్యాప్ టాప్‌లను ప్రత్యేక బృందాలు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఈ సంస్థకు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి. వీరి వలలో పడ్డ యువత వివరాలను, ఏదేని రాష్ట్రంలో కుట్రలకు వ్యూహరచన చేశారా..? అన్న కోణంలో దర్యాప్తు వేగం పెరిగింది. మరొకరి అరెస్టు: పట్టుబడిన ముగ్గురు ఇచ్చిన సమాచారంతో చెన్నై పోలీసులు అప్రమత్తమయ్యారు. తిరువాన్మియూర్‌లోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్న దావూద్ సులేమాన్‌ను సోమవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో అదుపులోకి తీసుకున్నారు. దావూద్ సులేమాన్ చెన్నైలోని ఓ ఐటీ సంస్థలో పనిచేస్తున్నట్టు తెలిసింది.
Advertisement
Advertisement