సాక్షి ముంబై: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తెలుగువాళ్లు ఆదివారం దసరా జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. కొందరు సోమవారం విజయదశమి జరుపుకుంటున్నా.. ఎక్కువ మంది మాత్రం ఆదివారమే పండగను జరుపుకుంటున్నారు. దీంతో గత కొన్ని రోజులుగా పూజలు అందుకుంటున్న దేవిమాత విగ్రహాలను ఆదివారం నిమజ్జనం చేయనున్నారు. ఇందుకోసం నిమజ్జన ఘాట్ల వద్ద అన్ని ఏర్పాట్లు చేసినట్లు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు తెలిపారు. ఘాట్లకు వెళ్లే మార్గాలతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అనుచిత ఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. చాలా మంది తెలుగువాళ్లు శనివారమే సద్దుల బతుకమ్మ వేడుకలను జరుపుకున్నారు.
కుర్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
కుర్లాలోని సంబాజీ చౌక్ వద్ద శ్రీ మార్కండేయ పద్మశాలి సమాజం ఆధ్వర్యంలో శనివారం బతుకమ్మ పండగను ఘనంగా నిర్వహించారు. దాదాపు 150 మంది మహిళలు వేడుకల్లో పాల్గొనడం విశేషం. సర్వాంగ సుందరంగా బతుకమ్మలను పేర్చిన వారికి సమాజం తరపున బహుమతులు అందజేశారు. ఈ సంవత్సరం అతి పెద్ద బతుకమ్మను అలంకరించి తీసుకొచ్చిన చిలువేరి అర్చన ప్రథమ బహుమతి సాధించింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన కంటె అశోక్ బహుమతిని ఆమెకు అందజేశారు. రెండో బహుమతి మంతెన స్వాతి, పాము సునితకు మహిళా అధ్యక్షురాలు మద్ది లావణ్య అందజేశారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ... బతుకమ్మ పండుగను, మన సంస్కృతిని కాపాడాలన్నారు. ఇందుకోసం ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న వారికి ఎప్పుడూ సహకరిస్తానన్నారు. సంస్థ అధ్యక్షుడు సంగిశెట్టి అశోక్, ప్రధాన కార్యదర్శి చిలివేరి మురళీధర్, సహాయక కార్యదర్శి చిలివేరి అశోక్ తదితరులు పాల్గొన్నారు.
నేడు బతుకమ్మ వేడుకలు
సాక్షి, ముంబై: ఠాణేలో ‘తెలుగు సేవామండలి’ ఆధ్వర్యంలో ఆదివారం దసరా ఉత్సవాలతోపాటు బతుకమ్మ పండుగను నిర్వహించనున్నారు. లోకమాన్యనగర్ పాడా నంబరు రెండులోని మున్సిపల్ పాఠశాలలో సాయంత్రం నాలుగు గంటల నుంచి ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. స్థానిక తెలుగు ప్రజలందరు తమ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడకోవడంతోపాటు ఆంధ్రులందరినీ ఒక్కచోటికి తేవాలనే సదుద్దేశంతో ఈ మండలిని ఏర్పాటు చేసినట్టు ఆ సంస్థ పదాధికారులుతెలిపారు. బతుకమ్మ పండుగను ఠాణేలో మొదటిసారి నిర్వహిస్తున్న ఘనత తమదేనని మండలి సభ్యులు తెలిపారు. గతంలో బతుకమ్మ పండగ లో పాల్గొనేందుకు అనేక మంది ముంబైలోని గోరెగావ్, వర్లి, భివండీలోని వివిధ ప్రాంతాలకు వెళ్లేవారు. ఈ సంవత్సరం నుంచి ఠాణేలోనే ఈ బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభించడంతో సమీపప్రాంతాల్లోని తెలుగువారంతా ఇక్కడికే రానున్నారు.
ఈ సందర్భంగా వివిధ సాంస్కృతి కార్యక్రమాలను ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. ప్రపంచ రికార్డు సృష్టించిన తెలుగు వ్యక్తి కిషన్ జగ్లర్ షో, తెలంగాణ, బతుకమ్మ, పల్లెపాట తదితర వినోద కార్యక్రమాలు ఉంటాయి. స్థానిక తెలుగు ప్రజలందరు పాల్గొని ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని తెలుగు సేవామండలి నాయకులు శీలం భూమయ్య, ఎరవేణి గురు, పారిపెల్లి శంకర్, గుండారపు పుల్లయ్య, మెంగు రమేష్, శంకర్ గంగాధరిలు ఓ ప్రకటనలో తెలిపారు.
దసరాకు అంతా సిద్ధం
Published Sat, Oct 12 2013 11:50 PM | Last Updated on Fri, Sep 1 2017 11:36 PM
Advertisement