vijaya dasami
-
ఆయుధ పూజ చేసిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
అరుణాచల్ ప్రదేశ్: విజయదశమి పర్వదినం సందర్భంగా అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆయుధ పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఇక్కడికి నాలుగు సంవత్సరాల క్రితం వచ్చానని, అప్పుడు జవానులతో కలిసి విజయదశమి జరుపుకోవాలని అనుకున్నానని, దేశ భద్రతకు బాధ్యత వహిస్తున్న సైనికులను చూసి గర్వపడుతున్నానని అన్నారు. తవాంగ్ చేరుకునే మందు రక్షణ మంత్రి అస్సాంలోని తేజ్‌పూర్ సందర్శించారు. అక్కడి నాలుగు కార్ప్స్ హెడ్‌క్వార్టర్స్‌సైనికులతో సంభాషించారు. ఇక్కడ అన్ని స్థాయిల సైనికులు ఒకే కుటుంబ సభ్యులుగా కలిసి భోజనం చేయడాన్ని రాజ్‌నాథ్ ప్రశంసించారు. వివిధ రాష్ట్రాలు, మతాలు, నేపథ్యాల నుండి వచ్చిన సైనికులు ఒకే బ్యారక్స్, యూనిట్లలో కలిసి పని చేయడం భారత సైన్యానికున్న ఐక్యతను తెలియజేస్తుందన్నారు. ఇది కూడా చదవండి: రావణుని వైభోగం ఎంత? అవశేషాలు ఎక్కడున్నాయి? विजयादशमी के पावन अवसर पर तवाँग में ‘शस्त्र पूजा’। https://t.co/JIYcBbd1no — Rajnath Singh (@rajnathsingh) October 24, 2023 -
ఆర్ఎస్ఎస్ విజయదశమి వేడుకలు
ఈరోజు (మంగళవారం) విజయదశమి సందర్భంగా మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) దసరా ర్యాలీ నిర్వహించింది. సంఘ్ సభ్యులు నాగ్‌పూర్‌లో ‘పథ సంచాలన్’ (రూట్ మార్చ్) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, గాయకుడు శంకర్ మహదేవన్ పాల్గొన్నారు. #WATCH | Maharashtra | RSS chief Mohan Bhagwat paid tribute to the founder of the organisation K. B. Hedgewar in Nagpur, at the RSS Vijayadashami Utsav event. Singer-composer Shankar Mahadevan who is the chief guest of the function is also with him. pic.twitter.com/joytMQ3aN6 — ANI (@ANI) October 24, 2023 సంఘ్ ప్రధాన కార్యాలయంలో భగవత్ గాయకుడు మహదేవన్‌కు స్వాగతం పలికారు. ఆర్ఎస్ఎస్ నిర్వహించిన ఈ దసరా వేడుకల కార్యక్రమానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా హాజరయ్యారు. ఇరువురు నేతలు ఆర్ఎస్ఎస్ సంప్రదాయ వేషధారణలో హాజరయ్యారు. విజయదశమి సందర్భంగా ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు కేబీ హెగ్రేవాల్‌కు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ నివాళులర్పించారు. -
Dussehra: దసరా రోజున ఏం చేయాలి?!
ఒకప్పుడు లోకాలను పట్టి పీడిస్తున్న భండాసురుడనే రాక్షసుడినీ, వాడి ముప్ఫైమంది సంతతినీ, వారి సైన్యాన్నీ ఆదిశక్తి అవలీలగా వధించింది. అలాగే మాయావులైన చండాసురుడు, ముండాసురుడు, మహిషాసురుడు అనే లోకకంటకులైన రాక్షసులతో రోజుకో రూపంలో పోరాడి సంహరించి, చతుర్దశ భువనాలకూ శాంతిని ప్రసాదించింది ఆది పరాశక్తి. అందుకు ప్రతీకగా జరుపుకుంటున్నవే దేవీ నవరాత్రులు... విజయ దశమి వేడుకలు. ఇవి గాక విజయదశమి జరుపుకోవడానికి మరికొన్ని కారణాలున్నాయి. దేవదానవులు క్షీరసాగర మథనం చేసి అమృతాన్ని సంపాదించినది కూడా విజయ దశమి రోజునే. దసరా రోజునే శ్రీరామచంద్రుడు... దేవిని ధ్యానించి రావణ సంహారం చేయగా దేవతలు పరమానందభరితులై దేవీపూజ చేశారు. నాటినుండి ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలు నవమి వరకు దేవీనవరాత్రులను, పదవరోజున విజయదశమినీ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అజ్ఞాతవాస పరిసమాప్తి కాగానే విజయుడు (అర్జునుడు) ఉత్తర గోగ్రహణం చేసి విజయం సాధించిన రోజని మరో గా«థ ఉంది. ఐకమత్యమే ఆయుధ బలం ఎంతటి దైవమైనా రాక్షసులను సంహరించాలంటే ఒక్కరి వల్లే కాదు. ఎందుకంటే రాక్షసులు కూడ బల పరాక్రమాలు కలవారే, తపశ్శక్తి సంపన్నులే! కాని వారి లక్షణాలు మాత్రం సరైనవి కావు. అమాయకులను పీడించడమే వారి పని. ఆయా రాక్షసులకు స్త్రీలంటే చిన్నచూపు. తమ జోలికి వారు రాలేరని, తమనేమీ చేయలేరన్న చులకన భావం. అందుకే పురుషుల చేతిలో ఓడిపోరాదన్న వరాలను పొందారు. అటువంటి లక్షణాలున్న వారిని అణిచి వేయకబోతే అందరి మనుగడకు ముప్పు వాటిల్లుతుంది. ఆ ప్రమాదాన్ని నివారించడానికి దేవి ముందుకు వచ్చింది. అందరి మొరలూ ఆలకించే అమ్మ మన మనస్సులోని తలంపులు స్వచ్ఛంగా ఉన్నప్పుడు అమ్మ ప్రసన్నవదనంతోనూ, కలుషితంగా ఉన్నప్పుడు భయంకరాకారంలోనూ కనిపిస్తుంది. ఇంట్లో బిడ్డలు కూడా ఏదైనా తప్పు చేసేటప్పుడు అమ్మ వచ్చి దండిస్తుందేమోననే భయంతో ఉంటారు. ఆ సమయంలో అమ్మ మామూలుగా చూసినా, కోపంగా ఉన్నట్లే అనిపిస్తుంది. నిశ్చల చిత్తంతో అమ్మను పూజిస్తే అభీష్టాలు నెరవేరుతాయి. దుర్గాదేవి ప్రకృతి స్వరూపిణి కాబట్టి ఆమెను ఆరాధించడమంటే ప్రకృతిని ఆరాధించడమే. ప్రకృతి స్వరూపిణి అయిన అమ్మను పూజిస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ జరుగుతుంది. లౌకిక బంధాల నుంచి విముక్తి లభిస్తుంది. వ్యాధి పీడితులకు ఆరోగ్యం చేకూరుతుంది. చిత్తస్థై్థర్యం, శత్రు విజయం చేకూరతాయి. చెడుపై మంచి సాధించిన విజయం దానవత్వంపై దైవం సాధించిన విజయానికి చిహ్నంగా మనం ఈ పండుగను జరుపుకుంటున్నాం. ఇప్పుడు మనం పోరాడి తీరవలసిన శత్రువులు మనలో ఉండే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే అరిషడ్వర్గాలే. ఆ శత్రువులపై మనమే పోరాటం చేయాలి. విజయం సాధించాలి. మామూలుగా దసరా... దసరా రోజులలో వివిధ దేవుళ్ళ వేషధారణ చేసి ఇంటింటికి తిరిగి గృహస్తులు ఇచ్చినది పుచ్చుకోవడం కొందరు వృత్తిగా ఆచరిస్తారు. వీటిని దసరా వేషాలు లేదా పగటి వేషాలు అంటారు. సంవత్సర కాలంలో సేవలందించిన వారు గృహస్తును మామూళ్ళు అడగటం... వారు కొంత ఇచ్చుకోవడమూ అలవాటే. దీనిని దసరా మామూలు అంటారు. విజయాలకు పునాది విజయదశమి అంటే సకల విజయాలనూ కలగ చేసే దశమి. తిథి, వార, నక్షత్ర గణన లేకుండా విజయదశమి రోజున చేపట్టిన సకల కార్యాలు విజయం పొందుతాయని నమ్మిక. ఇదే విషయం ‘చతుర్వర్గ చింతామణి’ అనే ఉద్గ్రంథం విపులీకరించింది. ఈ రోజున ఆరంభించే ఏ శుభకార్యమైనా, రకరకాల వృత్తులు, వ్యాపారాలు అయినా అఖండ విజయం సాధిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ పర్వదినాన్ని ముహూర్తంగా ఎంచుకుని మంచి పనులు ప్రారంభించడం వల్ల నిరాటంకంగా జరుగుతాయని నమ్మకం. ఈ విజయ దశమి అందరికీ సుఖ సంతోషాలను, విజయాలను ప్రసాదించాలని అమ్మను కోరుకుందాం. దసరా రోజున ఏం చేయాలి? దసరా పర్వదినాలలో సింహవాహిని అయిన అమ్మవారిని షోడశోపచారాలతో అర్చించడం వల్ల సంవత్సరమంతా పూజించిన ఫలం దక్కుతుంది. తొమ్మిది రోజులు పూజించలేనివారు మూడు రోజులు, మూడురోజులు కూడా కుదరని వారు కనీసం చివరి రోజయిన విజయ దశమినాడు ఒక్కరోజయినా సరే ఆ దివ్య మంగళస్వరూపాన్ని దర్శనం చేసుకుని తీరాలి. అలా అమ్మను దర్శించుకుని పూజ చేయడం వల్ల పాపాలన్నీ పటాపంచలవడంతోపాటు శత్రుజయం కలుగుతుంది. సకల శుభాలూ చేకూరతాయి. ఆయుధ పూజ, వాహన పూజ చేయడం, వృత్తిదారులు తమ పనిముట్లను పూజించడం వంటివి మహర్నవమితోపాటు ఈ రోజున కూడా కొందరు చేస్తారు. విజయదశమినాడు శమీవృక్షాన్ని (జమ్మిచెట్టును) దర్శించుకుని, ‘‘శమీ శమయితే పాపం శమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారీ, రామస్య ప్రియదర్శనం’’ అని స్తుతించాలి. ఆ శ్లోకంతోపాటు మన కోరికలేమైనా ఉంటే వాటిని చీటీ మీద రాసి జమ్మి కొమ్మకు కట్టాలి. జమ్మిచెట్టును పూజించి, ప్రదక్షిణ నమస్కారాలు అయిన తర్వాత జమ్మి ఆకును పెద్దలకు ఇచ్చి వారి ఆశీస్సులను అందుకోవాలి. ఆడపడచులను ఆదరించడం, తల్లిదండ్రులను గౌరవించడం, శక్తిమేరకు దానధర్మాలు చేయడం ఈ పండుగ విధులలో ఇతర ప్రధానమైన అంశాలు. సమష్టి బలం ఆ తల్లి ఈశ్వరుడి నుంచి త్రిశూలాన్ని, కుమారస్వామి నుంచి శక్తి ఆయుధాన్ని, వినాయకుడి నుంచి విఘ్న నివారణ ఆయుధాన్ని, విష్ణువు నుంచి చక్రాయుధాన్ని, ఇంద్రుని నుంచి వజ్రాయుధాన్ని, విశ్వకర్మనుంచి డాలుని, అగ్నిదేవుని నుంచి ఆగ్నేయాస్త్రాన్ని, యుముని నుండి పాశాన్ని, వరుణుని నుంచి వారుణాస్త్రాన్ని, కుబేరుని నుంచి ధనరాశులతో నిండిన కుండను, దానితోబాటు వారందరి బలాన్ని కూడగట్టుకుని యుద్ధం చేసి విజయం సాధించింది. దీనిని బట్టి మనం తెలుసుకోవలసినదేమంటే ఒక్కరుగా చేయలేని పనిని ఐకమత్యంగా చేయవచ్చని. విజయదశమి పండుగ మనకు సమైక్యతతో ఉండవలసిన ఆవశ్యకతను, స్త్రీ శక్తి ప్రాధాన్యతనూ తెలియచేస్తోంది. – డి.వి.ఆర్. భాస్కర్ -
ఇమ్రాన్‌కు ఆరెస్సెస్ చీఫ్ కౌంటర్
నాగపూర్ : ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్ ప్రధాని ఆరెస్సెస్‌కు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలకు సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ మంగళవారం గట్టి కౌంటర్ ఇచ్చారు. విజయదశమిని పురస్కరించుకుని ప్రసంగించిన మోహన్ భగవత్ ఆరెస్సెస్ ప్రత్యర్ధులను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. తమ విషప్రచారాలు ఫలించని స్థితిలో పలువురు విమర్శకులు ఆరెస్సెస్‌పై విరుచుకుపడతారని మండిపడ్డారు. నిరాధార ఆరోపణలతో సంఘ్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మోహన్ భగవత్ విమర్శించారు. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా ఇప్పుడు ఈ మంత్రం నేర్చుకున్నారని ధ్వజమెత్తారు. తమపై సాగుతున్న దుష్ర్పచారానికి ఆరెస్సెస్ భయపడదని, వెనుకడుగు వేయదని ఇమ్రాన్ ఖాన్ గుర్తెరగాలన్నారు. ప్రతిఒక్కరితో సామరస్యంగా పనిచేయడాన్నే ఆరెస్సెస్ విశ్వసిస్తుందని చెప్పుకొచ్చారు. సంస్థ ప్రతిష్టను దెబ్బతీసేందుకు జరుగుతున్న ప్రయత్నాల పట్ల సంఘ్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని పిలుపు ఇచ్చారు. కాగా ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆరెస్సెస్‌ను లక్ష్యంగా చేసుకుని ఇమ్రాన్ ఖాన్ ఇంటా బయటా పలు వేదికలపై నిప్పులు చెరుగుతున్న సంగతి తెలిసిందే. ఐరాస వేదికగా ఇమ్రాన్ మాట్లాడుతూ హిట్లర్ వంటి నియంత్రల భావజాలంతో ఏర్పడిన ఆరెస్సెస్ కనుసన్నల్లో భారత ప్రధాని మోదీ పనిచేస్తారని వ్యాఖ్యానించారు. -
వీరభద్రుని గద్దెకు పోటెత్తిన భక్తులు
సాక్షి, తూర్పు గోదావరి : విజయదశమి రోజున ఆలయాలు కొత్త శోభను సంతరించుకున్నాయి. భక్తుల రద్దీతో ప్రముఖ దేవాలయాలు కిక్కిరిసిపోతున్నాయి. జిల్లాలోని గోకవరంలో వీరభద్రుని గద్దెకు పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామునుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు తరలివస్తున్నారు. స్వామి, అమ్మవార్లకు పెద్దఎత్తున అభిషేకాలు జరిపిస్తున్నారు. దేవీచౌక్ ఆలయంలో మహిళలు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. -
అశోక విజయదశమి
సుదీర్ఘ భారతదేశ చరిత్రకే మణిమకుటం అశోక చక్రవర్తి. చండ అశోకునిగా పాలన ప్రారంభించి, ప్రపంచ చరిత్రలో ఘోరమైన యుద్ధంగా పేరొందిన కళింగయుద్ధంలో విజయం సాధించాడు. కానీ ఆ యుద్ధంలో పారిన రక్తపాతాన్ని చూసి చలించిపోయాడు. అప్పటికే అతని భార్య విదిశాదేవి వల్ల బౌద్ధం గురించి విన్న అశోకుని హృదయంలో ఏదో మూల కారుణ్యదీపం వెలిగింది. అదే అతని మనస్సులో మానవీయాంకురాన్ని మొలకెత్తించింది. మనస్సును బౌద్ధం ఆవరించింది. ఈ మార్పుకి అతని భార్య విదిశాదేవి, కుమార్తె సంఘమిత్ర, కుమారుడు మహేంద్రుడే కారణం. తనలోని మొండితనం, తనలోని దుడుకుతనం తనకు బాగా తెలుసు. అందుకే తనకు తానే కళ్లెం వేసుకోవాలనుకున్నాడు. ఆనాటి బౌద్ధగురువు మొగ్గలిపుత్త తిస్స దగ్గరకు వెళ్లి తానూ బౌద్ధ దీక్ష తీసుకుంటానని చెప్పాడు. అప్పటికి కళింగ యుద్ధం ముగిసి ఏడాది కావస్తోంది. విజయోత్సవాలు ఘనంగా జరపాలని సన్నాహాలు జరుగుతున్నాయి. ఆయుధాల పూజకు దేశం అంతటా సిద్ధమైంది. ఆరోజు ఆశ్వయుజ శుద్ధ అష్టమి. బౌద్ధులకు ఉపవాసదినం. అశోకుడు బిడ్డలతో ఆ రోజు బౌద్ధ దీక్ష తీసుకున్నాడు. ఆ మరుసటి రోజున తన కారాగారాల్లో ఉన్న యుద్ధ ఖైదీలందర్నీ విడుదల చేశాడు. ఉరిశిక్ష రద్దు చేశాడు. ప్రపంచ చరిత్రను తిరగరాశాడు. ప్రతి యుద్ధ ఖైదీకీ రెండున్నర ఎకరాల భూమిని హక్కుపత్రాలతో అందించాడు. నవమి తర్వాతిరోజు దశమి. ఆ రోజుని శాంతి దశమిగా ప్రకటించాడు. ఆయుధాల్ని కట్టకట్టి మూలన పెట్టండి. కత్తికి బదులు కరుణ పతాకం ఎత్తండి. అని ప్రకటించాడు. దేశమంతా ధమ్మ విజయోత్సవాలు కజరిగాయి. ‘‘ఇక ఈ నాటినుండి, నేనుగాని, నా వారసులు గానీ యుద్ధాలు చేయరు. కరుణ, శాంతి, మానవీయతలే మా మార్గం’’ అని ప్రకటించాడు అశోకుడు. ఆ సంవత్సరం అంటే క్రీ.శ. 262నుండి మౌర్యవంశంలో ఆఖరి రాజైన దశరథుని వరకు భారతదేశమంతటా విజయ దశమినాడు అహింసోత్సవాలు జరిగాయి. ఆ తర్వాత బౌద్ధపతనంతో అవీ కనుమరుగయ్యాయి. మరలా ఆ ఉత్సవాన్ని 1956 (అక్టోబర్ 14)విజయదశమి రోజున డా. బి.ఆర్. అంబేడ్కర్ నాగపూర్‌లో ప్రారంభించాడు. ఆ రోజున ఆరు లక్షల మందితో తానూ బౌద్ధదీక్ష తీసుకున్నాడు. అలా తిరిగి భారత గడ్డపై అశోక విజయ దశమి పునః ప్రారంభమైంది. శాంతికి సంకేతంగా, సంక్షేమానికి చిరునామాగా, మానవీయతకు మహా సందేశంగా పరిమళించిన ఈ అశోక విజయ దశమి శాంతికి బలిమి. కరుణకు కలిమి. – డా. బొర్రా గోవర్ధన్ -
స్త్రీ శక్తికి సిసలైన నిదర్శనందేవీ నవరాత్రులు
సృష్టి స్థితి లయ కారులని బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు పేరు. ఈ ముగ్గురూ ఆ మూడు పనులనూ చేస్తూ ఉన్నా, ఇలా చేయవలసిందంటూ ఆయా పనుల్ని వాళ్లకి అప్పజెప్పింది ఎవరు? అని ప్రశ్నించుకుంటే ఆదిశక్తే అనే సమాధానం వస్తుంది. గడియారంలో చిన్నముల్లూ పెద్దముల్లూ సెకన్ల ముల్లూ ఉన్నా, వీటిని నడిపే యంత్రం లేనిదే ఇవి ఎలా కేవలం బొమ్మ ముల్లులే అవుతాయో, అలా కాకుండా ఈ మూటికీ శక్తినిచ్చి నడిపిస్తూ కాలాన్ని గుర్తింపజేసేది అక్కడ ఎలా యంత్రమో, అదేతీరుగా ఈ త్రిమూర్తుల్నీ తమ తమ పనుల్ని నెరవేర్చేలా చేస్తూ యుగాలని నడిపిస్తున్న శక్తి ఆదిశక్తి మాత్రమే. స్త్రీకి ఇంత గొప్పదనాన్నిచ్చింది భారతదేశం మాత్రమే. ఈ బ్రహ్మవిష్ణుమహేశ్వరులు మాత్రమే సృష్టిస్థితిలయాలని చేసేస్తున్నారా అంటే ఆ ముగ్గురికీ కూడా మళ్లీ విలువ, అస్తిత్వం ఆధిక్యమనేవి తమ తమ భార్యల వల్లనే. బ్రహ్మకి ఓ ఆకారం అంటూ లేకపోయినా ఆయన గుర్తింపు కేవలం ఆయన నోట దాగిన ఆ సరస్వతి కారణంగానే. ఆకారం ఎలా ఉన్నా, ఏ లౌకికమైన పట్టాలూ లేకున్నా చదువు ద్వారానే వ్యక్తికి విలువ కదా! పండితుడైనవానికి ఈ దేశం ఆ దేశం ఈ భాషా ఆ భాషా అనే పరిమితి ఉండదు కదా!! అదేతీరుగా శ్రీహరికి గుర్తింపూ విలువా లక్ష్మీదేవి వల్లనే. శ్రీవేంకటేశ్వరుడు కన్పించేది కూడా ఎనలేని విలువైన ఐశ్వర్యం వెనుకనే. ఆయన్ని భక్తజనం కొలిచేది కూడా ఐశ్వర్యం అంటే అది పదవికి సంబంధించి జీవితానికి సంబంధించి లేదా ధనానికి సంబంధించిన వాటికోసం మాత్రమే. ఇక శంకరునికున్న ఏ మాత్రపు గుర్తింపు అయినా పార్వతి కారణంగానే. శక్తి లేని శివుడు నిరర్థకుడు. ఏ ప్రయోజనాన్నీ చేకూర్చలేడట. అందుకే అర్ధనారీశ్వర రూపంలో ఆయన ఉన్నాడు. కేవలం తమ తమ భార్యల ద్వారా గుర్తింపు ఈ త్రిమూర్తులకీ ఉండడమే కాదు– తమ తమ భర్తలకు కష్టం వచ్చినప్పుడు రక్షించి ఒడ్డెక్కించింది కూడా తమ తమ భార్యలే. నోటిలో నాలుక మీద ఉంటూ బ్రహ్మ నుండి ఎప్పుడూ ఎడబాయనిది సరస్వతి అవుతుంటే, వక్షస్థలాన్ని దిగకుండా తానున్న చోటుని ఆనమాలుగా అయ్యేలా చేసుకుని శ్రీ లక్ష్మి ఉంటుందనేందుకు వత్సం– గుర్తుగా ఏర్పడిన ఓ మచ్చ /ఆనమాలు ఉండేది లక్ష్మి అవుతుంటే, ఇక శరీరాన్నే నిండుగా చెరిసగంగా చేసుకుని ఎడమవైపున ఉంటున్నది పార్వతి. ఈ త్రి శక్తి దేవతల సమష్టి పండగే విజయ దశమి. కాబట్టి స్త్రీలో వాక్ శక్తీ– ఐశ్వర్య శక్తీ– సాహస శక్తీ అనే మూడూ ఉంటాయనీ, వీటిని అభివృద్ధి చేసుకోగలగడమే నిజమైన స్త్రీ శక్తిని చాటడం ఔతుందనీ– స్త్రీ తన పాండిత్యాన్ని నేడు చూపగలుగుతోందంటే, ధర్మబద్ధంగా ధనాన్ని సంపాదించగలుగుతోందంటే, తన పరాక్రమాన్ని కూడా అవసరమైన పక్షంలో ప్రదర్శించగలుగుతోందంటే అదంతా ఆ అమ్మ తనకి గూఢంగా నిక్షిప్తం చేసిన ఆ శక్తి కారణంగానే అని గ్రహించుకోవాలి ప్రతి స్త్రీ. లేదా ఆమెని మార్గదర్శకురాలిగానైనా భావించుకోవాలి. పండుగ ఇన్ని రోజులపాటా? స్త్రీకున్న గొప్పదనాన్ని లోకానికి చాటాలని భావించిన మహర్షులు అమ్మవారి పండుగ రోజుల్ని 9 కాదు 39 రోజులపాటు చేయాలని చెప్పారు. అలా సంవత్సరం తలుపు తెరుచుకుందో లేదో ఆ రోజునే వచ్చే ఉగాది నుండి శ్రీరామ నవమి వరకూ అమ్మవారి పేరిట ఆ వసంత రుతువులో జరిగే 9 రోజుల ఉత్సవాలనీ వసంత నవరాత్రోత్సవాలని అంటారు. ఇవి 9. ఇక శరత్కాలం ప్రారంభమయే ఆశ్వయుజ మాసం మొత్తం నెలంతా ఈ త్రి శక్తి దేవతల పండుగరోజులే. ఇవి 30. ఆ తొమ్మిదికీ ఈ ముప్ఫైరోజుల్నీ కలిపితే అమ్మవారికి జరిగే ఉత్సవాల రోజులు 39 అన్నమాట. ఒక స్త్రీకి ఇంతటి గౌరవాన్నీ–ఇన్ని రోజులపాటు ఉత్సవాల్నీ చేయాలని చెప్పిన దేశం– ప్రపంచ దేశాల్లో భారతదేశం మాత్రమే. అందుకే భారతదేశం స్త్రీని దేవత అంది– స్త్రీని ఓ దేవతగా చేసింది. ప్రతి ఒక్క స్త్రీనీ ఆ అమ్మ స్వరూపంగా భావిస్తూ సంబోధనలో కూడా అమ్మా అనవలసిందని చెప్పింది. మన పిలుపుల్లో అమ్మా! బంగారు తల్లీ! బుజ్జీ, కన్నతల్లీ! చిట్టితల్లీ, వరాలతల్లీ అనేవి ఇందుకే కనిపిస్తాయి. 9 రాత్రుల పండుగ ఏమిటి? విజయదశమిని స్త్రీలకి సంబంధించిన పండుగ అని అనుకున్నాం కదా! లోకంలో ప్రతి స్త్రీ కూడా తొమ్మిది నెలల పాటు రాత్రిలా గడిపి పదవ నెలలో పండంటి బిడ్డని కని ఈ రాత్రితో పోల్చబడిన కష్టమంతటినీ ఆ బిడ్డణ్ణి చూస్తూనే మర్చిపోతుంది. దేవత అయిన అమ్మ కూడా పైన అనుకున్న రాక్షసులే కాక ఇతరులు కూడా తన సంతానాన్ని చంపెయ్యబోతుంటే అనుక్షణం రెండుకళ్లతోనూ పరిశీలిస్తూ మొత్తం రాక్షసుల్ని ఈ 9 రాత్రుల్లో వధించగలిగింది. రాక్షసులకి బలం నిలిచి ఉండేది రాత్రివేళల్లోనే కాబట్టి అమ్మకి కూడా రాత్రిపూటే యుద్ధం అనివార్యమౌతుండేది. అలా వధించి వధించి 10వనాటి ఉదయానికి సర్వ రాక్షస వధా ముగిసిపోయి ఆమె విజయాన్ని సాధించిన కారణంగా ఇది విజయ దశమి ఔతోంది. ఇక్కడ మరో రహస్యమూ ఉంది. సాధారణంగా దేవతలు అని మనకి వినపడగానే అలా శపించేసి చంపేస్తారని అనుకుంటాం! ఈ నవరాత్ర విజయం అలాంటిది కానే కాదు. అమ్మ తన తోటి దేవతలందరి దగ్గరా ఆయుధాల్ని (తమ తమ దేవతా శక్తుల్ని నిక్షిప్తం చేసి ఉంచిన ఆయుధాల్ని) తీసుకుని వాటితోనే వధించింది– వధించగలిగిందంటే ఏ వ్యక్తీ కూడా ఒంటరిగా తనకు తానుగా అందరి మీద విజయానికి ప్రయత్నించడం సరికాదనీ– ఎంతటి వారైనా తోటివారి సహాయాన్ని స్వీకరించాలనీ అది తక్కువదనం కానేకాబోదనీ తెలియజేస్తోందన్న మాట అమ్మ. అనుగ్రహ రహస్యం అదే! ఈరోజు మంచిదేనా? లేకపోతే ఏ రోజైతే బాగుంటుందని మనం అడుగుతుంటాం ఇంటి పురోహితుల్ని. అమ్మ తనని మూడురూపాలుగా చేసుకుని ఆ మూడు శక్తి దేవతల అనుగ్రహానికీ ఏ రోజులు మంచివో తానే తెలియజేస్తోంది. అశ్వని నక్షత్రం పూర్ణిమనాడుండే ఆశ్వయుజ మాసం సరస్వతి– లక్ష్మి– పార్వతి అనే ముగ్గురు దేవతలనీ ప్రసన్నం చేసుకోవడానికి అనుకూలం. ఈ నెలలో కూడా మొదటి రోజునుండి ఆరవ రోజున మూలా నక్షత్రం ఉంటుంది కాలచ్రంలో. ఆ రోజున సరస్వతిని ఆరాధించడం అత్యుత్తమమని ఆ తల్లి చెప్తుంది. దీంతో త్రిమూర్తుల్లో మొదటివాడైన బ్రహ్మ భార్యకి పూజ అయిపోయింది. ఇక త్రిమూర్తుల్లో మూడవ వాడైన శంకరుని భార్య పార్వతీదేవిని ఆరాధించడానికి పదవరోజు అంటే విజయ దశమి అనుకూలమని చెప్తుంది కాలచక్రం. దాంతో శంకర పత్నికి పూజ ముగిసింది. ఇక త్రిమూర్తుల్లో రెండవవాడైన శ్రీహరిభార్య లక్ష్మి మాత్రం మిగిలింది. ఈమెని ఆశ్వయుజమాసం చివరిరోజైన అమావాస్యనాడు పూజించాలి. ఆ అమావాస్యరోజునే దీపావళి అమావాస్య అంటారు. ఇలా ముగ్గురు దేవతలకీ మూడు విభిన్నమైన రోజుల్లో ముగ్గురి పేరా ఒకేనెలలో పూజని చేస్తూ ముగ్గురి అనుగ్రహాన్నీ ఒకేసారి పొందగలగడం ఎంత అదృష్టం! చివరగా ఓ మాట! పాడ్యమి నుండి విజయ దశమి వరకూ అంటే పదిరోజుల్లోనూ మొత్తం మీద 108 మార్లు లలితా సహస్రనామ స్తోత్రాన్ని అలా పారాయణ చేస్తూ ప్రతిరోజూ ఒక్కమారు చొప్పున ఈ సహస్రనామాలతో అలా పూజ చేస్తే ఈ విజయ దశమి మన పాలిట నిజమైన విజయాన్నిచ్చే దశమి ఔతుంది. ఇప్పటికే కొద్దిరోజులు గడిచాయి కాబట్టి తక్కువలో తక్కువగా కనీసం 27 మార్లు లలితా సహస్రనామ పారాయణ చేసినా... ఫలప్రదమే. – ఎం.సుబ్బలక్ష్మి -
గార్లలో దశమి రోజు జాతీయ జెండా
గార్ల(డోర్నకల్): మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలో విజయదశమి రోజు శనివారం జాతీయ జెండాను ఆవిష్కరించను న్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా గార్ల మండల కేంద్రంలో నిజాం నవాబు కాలం నుంచి జెండా ఆవిష్కరణ ఆనవాయితీగా వస్తోంది. అప్పట్లో స్థానిక మసీదు సెంటర్లో నిజాం అధికారిక జెండాను ఆవిష్కరించేవారు. నిజాం పాలన ముగిసిన తర్వాత 1952లో సదరు గద్దెపై కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించారు. అయితే దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కమ్యూనిస్టులు కోర్టుకు వెళ్లారు. ఈ క్రమంలో కోర్టు సదరు గద్దెపై దేశభక్తికి చిహ్నంగా జాతీయ జెండాను ఎగురవేయాలని సూచించింది. దీంతో 1958లో తొలిసారి అప్పటి మున్సిపల్ చైర్మన్ మాటేడి కిషన్‌రావు జాతీయ జెండాను ఎగుర వేశారు. నాటి నుంచి నేటి వరకు గార్ల మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్, మొదటి పౌరుడు అదే ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. -
దసరాకు సర్వం సన్నద్ధం
ఆదిలాబాద్ కల్చరల్ : దసరా వేడుకలకు జిల్లా ముస్తాబైంది. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. హిందూ ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో మైదానాలను ముస్తాబు చేశారు. చెడుపై మంచి జయించిన రోజును విజయదశమి పర్వదినంగా ప్రజలు భావిస్తారు. నూతన వస్త్రాలంకరణతో భక్తి ప్రపత్తులతో వేడుకలు జరుపుకుంటారు. ఆదిలాబాద్ మండలం మావల గ్రామ పంచాయతీ పరిధి రాంలీలా మైదానంలో హిందూ సమాజ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం 4గంటలకు రావణాసురుడిని దహనం చేయనున్నారు. అంతకుముందు కన్యకాపరమేశ్వరి మందిరంలో భారతమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి శోభాయాత్ర ప్రారంభిస్తారు. భైంసాలోని సాయిబాబా మందిరంలో మైసమ్మగుట్ట వద్ద దసరా వేడుకలకు ఏర్పాట్లు చేశారు. ఆసిఫాబాద్‌లోని అభయాంజనేయ స్వామి ఆలయ సమీపంలో దసరా వేడుకలు నిర్వహిస్తారు. ప్రత్యేకంగా నరకాసురుడి వధ చేపట్టనున్నారు. మంచిర్యాలలోని గోదావరి తీరాన గౌతమేశ్వరి ఆలయ పరిధిలో జమ్మిచెట్టు వద్ద ప్రత్యేక పూజలు చేస్తారు. ఆలయం నుంచి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకెళ్లి జమ్మి చెట్టు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిర్మల్‌లోని మంగల్‌పేట్‌లో మహాలక్ష్మీ ఆలయంలో రావణాసురుడిని దహనం చేస్తారు. బెల్లంపల్లిలోని సింగరేణి తిలక్ స్టేడియంలో రావణాసురుడి వధకు ముమ్మర ఏర్పాట్లు చేశారు. కాగజ్‌నగర్‌లో పెనుల్ పహాడ్ మైదానంలో రావణుడి దహనం చేయనున్నారు. ఆయుధ పూజ విజయదశమి వేడుకల్లో భాగంగా జమ్మిచెట్టు, ఆయుధాలను పూజిస్తారు. జమ్మి చెట్టు కొమ్మలను తీసుకొచ్చి ఆలయాలు, ముఖ్య కూడళ్లలో ఉంచుతారు. పూజల అనంతరం ఆకులను తీసుకుని బంధుమిత్రులు, పెద్దలకు అందించి దీవెనలు తీసుకోవడం ఆనవాయితీ. ఎదుటి వారికి ఇచ్చి ఆలింగనం చేసుకుంటారు. తెలంగాణలో ఇంటిల్లిపాదీ ఆనందంగా జరుపుకునే అతి పెద్ద పండుగ దసరా. కొత్త బట్టలు ధరించి దేవాలయాలకు వెళ్లడం, కుటుంబ సభ్యులంతా కలిసి పిండి పంటలు భుజించడం చేస్తారు. ఇదే రోజున రోజు పాలపిట్టను చూస్తే శుభసూచకంగా భావిస్తారు. శుభప్రదంగా.. దసరా రోజు ఏ వస్తువులు కొనుగోలు చేసినా శుభప్రదంగా భావిస్తారు. కొత్త అల్లుళ్లకు సైతం దసరా రోజు వాహనాలు కొనివ్వడం కూడా సంప్రదాయంగా వస్తోంది. వ్యాపారాలు, దుకాణాలు నూతనంగా ప్రారంభిస్తారు. ఈ రోజు ప్రారంభించిన దుకాణాలు, కొనుగోలు చేసిన వస్తువులకు ఎటువంటి అరిష్టాలు జరగకుండా ఉంటాయని నమ్మకం. పాత యంత్రాలు, వాహనాలు సైతం శుభ్రం చేసి ప్రత్యేక పూజలు చేస్తారు. ఇదీ సంప్రదాయంగా వస్తోంది. పెద్దల దీవెన.. దసరా ఉత్సవాన్ని పురస్కరించుకుని రావణ సంహరణ జరిగిన అనంతరం ప్రజలు తమ తల్లిదండ్రులు, అక్కాచెల్లెళ్ల దీవెనలు, పెద్దల ఆశీర్వాదాన్ని తీసుకుంటారు. తోటి స్నేహితులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆనందోత్సాహాలతో సంబరాలు చేసుకుంటారు. చిన్నాపెద్ద తేడా లేకుండా కొత్త దుస్తులను ధరించి ఆనందోత్సాహాలతో పండుగను జరుపుకుని పిండి వంటకాల విందు ఆరగిస్తారు. ముస్తాబైన రాంలీలా మైదానం.. ఆదిలాబాద్‌లోని మావల గ్రామ పంచాయతీ పరిధి దస్నాపూర్ రాంలీలా మైదానంలో దసరా పండగకు మైదానాన్ని గురువారం ముస్తాబు చేశారు. పంచాయతీ సర్పంచ్ ఉష్కం రఘుపతి పనులను పరిశీపలించారు. కన్యక పరమేశ్వరి ఆలయంలో భరతమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి శోభాయాత్ర ప్రారంభించారు. అక్కడ నుంచి రాంలీలా మైదానానికి శోభాయాత్ర చేరుతుంది. ముఖ్య అతిథులుగా మంత్రి జోగు రామన్న, జిల్లా ఎస్పీ గజరావు భూపాల్, జిల్లా కలెక్టర్ ఎం.జగన్మోహన్, న్యాయమూర్తులు పాల్గొంటారు. -
ఒంగోలులో దసరా నుంచి సిటీ బస్సులు
ఒంగోలు సెంట్రల్: ఒంగోలు నగరంలో విజయ దశమి నుంచి సిటీ బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు రాష్ట్ర రోడ్డు రవాణ శాఖ మంత్రి శిద్దారాఘవరావు తెలిపారు. నగరంలోని తన నివాసంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణికులకు మెరుగైన సేవలందించేందుకు 500 నూతన బస్సులను అన్ని డిపోల్లో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఒంగోలు నుంచి చెన్నై, చీరాల నుంచి బెంగళూరుకు రెండు సూపర్‌లగ్జరీ బస్ సర్వీసులను మంగళవారం ప్రారంభిస్తున్నామన్నారు. అదే విధంగా దర్శి నుంచి 5 పల్లెవెలుగు సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. దర్శి నుంచి దొనకొండకు వయా వెంకటాపురం, పొదిలి నుంచి దర్శికి వయా వేముల, కురిచేడు నుంచి దర్శికి వయా పొట్లపాడు, ఒంగోలు నుంచి పిడతలపూడికి వయా చీమకుర్తి, పొందూరు నుంచి టంగుటూరుకు వయా మల్లవరం, తూర్పునాయుడుపాలేలకు సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ప్రతి డిపోకు పది పల్లెవెలుగు బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ‘ఎన్టీఆర్ సుజల’ ప్రారంభానికి చర్యలు ఎన్టీఆర్ సుజల పథకాన్ని అక్టోబర్ 2 నుంచి ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర రవాణ శాఖ మంత్రి శిద్దా రాఘవరావు తెలిపారు. నగరంలోని తన నివాసంలో ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీర్లతో సోమవారం మంత్రి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మొదటి దశలో మండలానికి ఒక గ్రామంలో ఎన్టీఆర్ సుజల పథకాన్ని ప్రారంభించడానికి ఇంజినీరింగ్ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా వెయ్యి లీటర్ల మంచి నీటిని అందించేందుకు మిషనరీ, నిర్మాణ వ్యయం రూ.3 లక్షలు అవుతుందన్నారు. రెండో దశలో అన్ని గ్రామాల్లో తాగునీటి రక్షిత పథకాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్టీఆర్ సుజల పథకం ఏ గ్రామాల్లో ఏర్పాటు చేయాలో స్థానిక శాసనసభ్యుల సహకారం తీసుకోవాలన్నారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ సూపరింటెండెంట్ ఇంజినీర్ వీవీఎస్మూర్తి, పొదిలి ఆర్‌డబ్ల్యూస్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. -
వైరస్
తొలి సినిమా ‘హృదయ కాలేయం’తో ఓ విభిన్నమైన ఇమేజ్ సొంతం చేసుకున్న హీరో సంపూర్ణేష్‌బాబు www.virus.com పేరుతో ఓ సినిమా చేస్తున్నారు. సీహెచ్ శివరామకృష్ణ దర్శకత్వంలో సలీం, ఏజే రాంబాబు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. పూర్తి స్థాయి వినోదాత్మకంగా రూపొందనున్న ఈ చిత్రం షూటింగ్‌ని విజయదశమికి మొదలు పెడతామని, డిసెంబర్లో సినిమా విడుదల చేస్తామని నిర్మాతలు: తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: వీజే. -
వేర్వేరు ప్రమాదాల్లో నలుగురి మృతి
శ్రీకాకుళం క్రైం, న్యూస్‌లైన్: జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. శ్రీకాకుళం రూరల్ మండలంలోని డెంటల్ కళాశాల సమీపంలో జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని ప్రసాద్ అనే వ్యక్తి మృతి చెందాడని పోలీసులు తెలిపారు. శ్రీకాకుళం పట్టణం ఏపీహెచ్‌బీ కాలనీకి చెందిన ప్రసాద్, వజ్రాపు వెంకట శ్రీధర్ ద్విచక్రవాహనంపై డెంటల్ కాలేజీ నుంచి వస్తున్నారు. ద్విచక్రవాహనాన్ని గుర్తు తెలియని వాహనం డీకొనడంతో ప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్ర గాయాల పాలైన శ్రీధర్ పూర్తి వివరాలు వెల్లడించే పరిస్థితిలో లేకపోవడంతో మృతుడి సమాచారం తెలియలేదు. ఔట్‌పోస్టు పోలీసులు వివరాలను సేకరించారు. ఆటో ఢీకొని ఒకరు... వజ్రపుకొత్తూరు : ఆటో బోల్తాపడడంతో మండలం తర్లాగడివూరు గ్రామానికి చెందిన కోనేరు శ్యామ్ (25) మృతి చెందాడు. వజ్రపుకొత్తూరు ఎస్ఐ ఎస్.తాతారావు, శ్యామ్ కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయదశమి సందర్భంగా సోమవారం శ్యామ్ మిత్రులతో కలిసి ఆటోలకు పూజలు చేశారు. తర్వాత చినవంకులూరు గ్రామానికి వెళ్లి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న ఆటో వంకులూరు రోడ్డుపక్కన బోల్తాపడింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్యామ్‌ను 108 అంబులెన్స్‌లో పలాస ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తాతారావు తెలిపారు. సైక్లిస్టును తప్పించబోయి ఒకరు... పూండి : వజ్రపుకొత్తూరు మండలం పూండిలో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో గోవిందపురం గ్రామానికి చెందిన పుచ్చ వెంకటరావు తీవ్ర గాయాలపాలై మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటరావు పూండి బస్టాండ్ రోడ్డులో ఫాస్ట్‌ఫుడ్ దుకాణం నిర్వహిస్తున్నాడు. సోమవారం సాయంత్రం స్థానిక పెట్రోల్ బంక్‌లో తన బైక్‌కు పెట్రోల్ పోసుకుని రోడ్డు దాటుతుండగా అడ్డంగా వచ్చిన సైక్లిస్టును తప్పించబోగా ఈ ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన అతనిని విశాఖపట్నం తరళిలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. మృతునికి భార్య దాలమ్మ , ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు వజ్రపుకొత్తూరు హెడ్ కానిస్టేబుల్ ప్రకాశరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృత దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ద్విచక్రవాహనం ఢీకొనడంతో... సోంపేట : రాణిగాం గ్రామం వద్ద జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రాణిగాం గ్రామానికి చెందిన ఎన్.గున్నయ్య (40) సైకిల్‌పై వెళుతుండగా పలాస మండలం బంటుకొత్తూరు గ్రామానికి చెందిన వ్యక్తులు ద్విచక్రవాహనం ఢీకొన్నారు. గున్నయ్యను హరిపురం ఆస్పత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడికి భార్య లక్ష్మి ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు పలాస రూరల్ : పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న నెమలినారాయణపురం జాతీయ రహదారిపై మంగళవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన రామకృష్ణ తీవ్ర గాయాలపాలయ్యాడు. ప్రమాదానికి కారణం తెలియాల్సి ఉంది. ఆటో డ్రైవింగ్ నేర్చుకుంటుండగా ప్రమాదం జరిగిందని కొందరు, రెండు వాహనాలు ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని మరికొందరు చెబుతున్నారు. బాధితుడిని కాశీబుగ్గ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ద్విచక్రవాహనం ఢీకొనడంతో ఇద్దరికి.. నరసన్నపేట రూరల్ : జాతీయ రహదారిపై శ్రీరాంపురం వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. రోడ్డు దాటుతున్న మహిళ ముద్దపు సూరోడును కొటబొమ్మాళి నుంచి శ్రీకాకుళం వెళ్తున్న మోటార్ సైకిల్ ఢీకొంది. ఈ ఘటనలో మహిళతో పాటు ద్విచక్రవాహనం నడుపుతున్న సకలాబత్తుల శ్రీధర్ గాయపడ్డారు. క్షతగాత్రులను ఎన్‌హెచ్ అంబులెన్స్‌లో నరసన్నపేట ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. -
నెత్తురోడిన రహదారులు
రాష్ట్రంలో మంగళవారం జరిగిన మూడు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 12మంది మృత్యువాతపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో లారీని కారు ఢీకొనడంతో ఐదుగురు మృతిచెందగా వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో జరిగిన ప్రమాదాల్లో 7గురు దుర్మరణం పాలయ్యారు. సాక్షి, రాజమండ్రి : విజయదశమినాడు గ్రామ దేవతకు పూజలుచేసి, విజయవాడలో దుర్గమ్మను దర్శించుకునేందుకు బయలుదేరిన భక్తులు మార్గమధ్యంలో ఘోర ప్రమాదానికి గురయ్యారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి శివారు బొమ్మూరు వద్ద జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు డ్రైవర్ సహా ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. విశాఖ జిల్లా పెదగంట్యాడ మండలం కొత్తకర్ణానివారిపాలెం నుంచి విజయవాడకు దుర్గమ్మను దర్శించుకునేందుకు కారులో 9మంది బయలుదేరారు. తెల్లవారుజామున 3.35 గంటల సమయంలో ఆగి ఉన్న లారీని వీరి కారు ఢీకొనడంతో విశాఖ జిల్లా సింహాచలం శ్రీనివాసనగర్‌కు చెందిన కారు డ్రైవర్ ధమర్‌సింగ్ శంకరరావు (28), కొత్తకర్ణానివారిపాలేనికి చెందిన గొన్నాశివకుమార్ (28), గద్దే శ్రీనివాసరావు(26) , విరోధి అప్పలశ్రీను(28), యర్రా రమేష్ (26) అక్కడికక్కడే మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న ఇద్దరిని కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కారును సిమెంట్ ట్యాంకర్ ఢీకొని... చేవెళ్ల : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల పరిధిలోని కందవాడ బస్‌స్టేజీ సమీపంలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. హైదరాబాద్ వెళ్తున్న కారును ఎదురుగా వస్తున్న సిమెంట్ ట్యాంకర్ ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో పెద్దేముల్ మండలం ఇందూరు గ్రామానికి చెందిన పి. చెన్నారెడ్డి(45), ఆయన భార్య పవిత్ర(40), తల్లి శకుంతల(63), కుమారుడు సాయినాథ్‌రెడ్డి(5) అక్కడికక్కడే మరణించారు. నగరంలోని ఆస్పత్రికి వెళ్తుండగా దుర్ఘటన చోటుచేసుకుందని బంధువులు తెలిపారు. మృతదేహాలను వెలికితీసి చేవెళ్లలోని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ట్యాంకర్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. వరంగల్‌లో మరో ముగ్గురు... శాయంపేట : కారు, ఆర్టీసీ బస్సు పరస్పరం ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వరంగల్ జిల్లా తహారాపూర్(మాందారిపేట) వద్ద సోమవారం ఈ సంఘటన జరిగింది. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి హవేలీకి చెందిన 16 మంది మిత్రులు మూడు కార్లలో వరంగల్ జిల్లా గోవిందరావుపేట మండలం లక్నవరం సరస్సును చూసేందుకు బయలుదేరారు. తహారాపూర్ సమీపంలో ఒక కారును ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. దీంతో కారు నడుపుతున్న అనుమాండ్ల భరత్(26) అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో ఇద్దరు మరణించారు. -
ఘనంగా విజయదశమి వేడుకలు
కర్నూలు(కల్చరల్), న్యూస్‌లైన్: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం జిల్లా అంతటా భక్తజన తరంగం ఉప్పొంగింది. దుర్గమ్మ పూజలో తరించేందుకు ఉదయం నుంచే భక్తులు ఆలయాల వద్ద బారులు తీరారు. ఇక గుమ్మాలకు మావిడాకులతో తోరణాలు కట్టి, చెండుపూల మాలలతో అలంకరించారు. వ్యాపార సంస్థల్లో ఆయుధ పూజ నిర్వహించి సంవత్సరమంతా తమను విజయపథంలో నడిపించమని దుర్గామాతను వేడుకున్నారు. ఇళ్లలోనూ వాహనాలకు పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండగను పురస్కరించుకొని పిండి వంటకాలు చేసుకొని బంధుమిత్రులతో కలిసి పంక్తి భోజనాలు చేశారు. నూతన వస్త్రాలు ధరించి ఒకరికొకరు దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. సాయంత్రం కుటుంబ సమేతంగా దంపతులు ఆలయాలను సందర్శించారు. ఊరి శివారులోని జమ్మిచెట్ల వద్దకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. జమ్మి పత్రాలను తీసుకొచ్చి పెద్దలకు అందజేసి ఆశీస్సులు పొందారు. ఇక జిల్లాలోని శ్రీశైలం, మహానంది, అహోబిలం, మంత్రాలయం ఆలయాల్లో ఉదయం నుంచి విజయదశమి ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. పంచామృతాభిషేకం, అష్టోత్తర శతనామావళి కుంకుమార్చనలతో ఆలయాలలో విజయదశమి శోభ ద్విగుణీకృతమైంది. సాయంత్రం మహానందిలో పార్వతీ పరమేశ్వరుల ఊరేగింపులో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీశైలంలో భ్రమరాంబికా దేవిని నూతన అలంకరణలతో అత్యంత ఆకర్షణీయంగా ఊరేగించగా పెద్ద ఎత్తున జనం పాల్గొన్నారు. మంత్రాలయం మూల బృందావనం నుంచి రాఘవేంద్రస్వామిని పురవీధుల్లో ఊరేగించగా దర్శించుకున్న భక్తులు తరించారు. అహోబిళంలో ప్రహ్లాదవరదుడికి జనం బ్రహ్మరథం పట్టారు. ఆదోని, ఎమ్మిగనూరు, నంద్యాల, నందికొట్కూరు, ఆత్మకూరు, బనగానపల్లె తదితర ప్రాంతాల్లో సాయంత్రం వేళ అన్ని ఆలయాలు భక్తజనుల సందర్శనతో, ప్రత్యేక పూజలతో కిటకిటలాడాయి. -
ద‘శమి’ పూజ
శ్రీశైలం, న్యూస్‌లైన్: శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా ఆదివారం విజయదశమి పర్వదినాన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామివార్ల ఆలయప్రాంగ ణంలో వైభవంగా శమీ పూజలు నిర్వహించారు. అలంకార మండపంలో అమ్మవారిని సిద్ధిదాయినిగా అలంకరించి, స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను నందివాహనంపై అధిష్టించి విశేష వాహన పూజలు నిర్వహించారు. ఆదివారం నవమి ఘడియలు ముగిసిన వెంటనే విజయద శమి ప్రారంభం కావడంతో దసరా పండుగను దేవస్థానం ఆదివారమే నిర్వహించింది. కాగా ప్రభుత్వ సెలవు దినం సోమవారం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు అధిక సంఖ్యలో శ్రీశైలం చేరుకున్నారు. ఆలయప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతూ కనిపించింది. ఉత్సవంలో భాగంగా నందివాహనాధీశులైన స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను ఊరేగిస్తూ ఆలయప్రాంగణంలోని శమి(జమ్మి) వృక్షం వద్దకు చేర్చారు. జమ్మిచెట్టుకు వేదపండితులు, అర్చకులు శమిపూజలు చేశారు. కార్యక్రమంలో ఈఓ చంద్రశేఖర ఆజాద్, ఆలయ ఏఈఓ రాజశేఖర్, కేశవులు, హార్టికల్చరిస్ట్ ఏడీ ఈశ్వరరెడ్డి, పర్యవేక్షకులు మల్లికార్జునరెడ్డి, నాగభూషణం, హరిదాస్, శ్రీశైలప్రభ ఎడిటర్ డాక్టర్ అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
నేడే దసరా
విజయదశమి ఉత్సవాలకు జిల్లా సిద్ధమైంది. దశమితోపాటు శ్రవణ నక్షత్రం కలిసిరావడంతో ఆదివారమే జిల్లా వ్యాప్తంగా పండుగ జరుపుకుంటున్నారు. ప్రభుత్వం, ఇతర సంస్థలు సోమవారం విజయదశమి సెలవు ప్రకటించినా... ఆదివారమే మంచి ముహూర్తం ఉందని పండితులు ప్రకటించడంతో వేడుకలకు ప్రజలు సిద్ధమయ్యారు. వేదాలకు, మేధావులకు నిలయమైన మంథనిలో ఆదివారం ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు లక్ష్మీనారాయణస్వామి ఆలయ పూజారి తిరునగరం రమేశ్ ఆచార్యులు తెలిపారు. ఖమ్మం జిల్లా భద్రాచలం మినహా అన్ని ప్రాంతాల్లో ఆదివారమే దసరా పండుగ జరుపుకుంటున్నారు. కరీంనగర్ కల్చరల్/మంథని, న్యూస్‌లైన్ : దసరా అంటేనే ఆయుధ పూజకు ప్రత్యే కం. ఆయుధపూజ, శమీపూజపై అనేక కథనాలు ఉన్నాయి. పాండవులు వనవాసం పూర్తి చేసుకుని హస్తినకు చేరుకున్న రోజు ఆశ్వీయుజ శుద్ధ దశమి. పాండవులు తిరిగి రాజ్యానికి చేరుకోగానే ప్రజలు దశమిని ఘనంగా నిర్వహించుకుంటారు. ఇది విజయదశమిగా మారిందని పురాణోక్తి. విజయదశమి వేడుకల్లో భాగంగా శమీ వృక్షాన్ని పూజించడం సంప్రదాయం. ఆది పరాశక్తికి తొమ్మిది రోజుల పూజల అనంతరం దశమి నాడు విశేష పూజలు చేస్తారు. మరో కథనం ప్రకారం... అజ్ఞాతవాసానికి వెళ్లేప్పుడు పాండవులు తమను ఎవరూ గుర్తుపట్టకుండా ఆయుధాలు శమీ చెట్టుపై ఉంచి వెళ్తారు. అజ్ఞాతవాసంలో విరాట్ రాజు కొలువులో ఉంటారు. వారు ఎక్కడ ఉన్నారో కనిపెట్టడానికి కౌరవులు అన్ని రాజ్యాల మీద యుద్ధం ప్రకటిస్తూ విరాట్ రాజు మీద కూడా యుద్ధం ప్రకటిస్తారు. ఆ సమయంలో పాండవుల అజ్ఞాతవాసం ముగుస్తుంది. దీంతో వారు శమీ చెట్టు మీద దాచిన ఆయుధాలకు పూజ చేసి తీసుకుని రాజు కుమారుడి వెంట యుద్ధానికి బయల్దేరుతారు. అప్పటినుంచి ఆయుధపూజ చేయడం ఆనవాయితీగా వస్తోంది. విజయదశమి రోజు శమీ వృక్షాన్ని పూజి స్తారు. శమీ చెట్టు కొమ్మలు తీసుకొచ్చి దేవాలయాలు, ముఖ్య కూడళ్లలో ఉంచి పూజలు నిర్వహిస్తారు. వాటి ఆకులు తీసుకుని బంధుమిత్రులకు, పెద్దలకు అందించి దీవెనలు తీసుకోవడం ఆనవాయితీ. ఈ రోజు పాలపిట్టను చూస్తే శుభసూచకంగా భావిస్తారు. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో పాలపిట్టను చూసేందుకు ఊరి శివారుకు వెళ్తుంటారు. వేడుకలకు సిద్ధం దసరా ఉత్సవాలకు నగరంలోని చైతన్యపురిలో గల శ్రీ మహాశక్తి ఆలయం ప్రత్యేక అలంకరణాలు, రంగురంగుల విద్యుద్దీపాలతో ముస్తాబైంది. ముగ్గురమ్మల మూలపుటమ్మ శ్రీమహాదుర్గగా, శ్రీ మహాలక్ష్మిగా, శ్రీమహాసరస్వతిగా ఒకే ప్రాంగణంలో కొలువుదీరగా దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఉదయం 7.30 కి శ్రీరాజరాజేశ్వరీపూజ, శమీపూజ సాయంత్రం 4 గంటల నుంచి దసరా ఉత్సవాలు జరుగుతాయి. గిద్దె పెరుమాండ్ల ఆలయంలో... నగరంలోని శ్రీ గిద్దెపెరుమాండ్ల స్వామి ఆల యానికి 300 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ ఆలయంలోనే దసరా ఉత్సవాలు నిర్వహించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఆదివారం ఉదయం 5 నుంచి వాహన పూజలు, 9 గంటలకు గణపతి పూజ, శమీ పూజలతో ఉత్సవాలు మొదలవుతాయి. సాయంత్రం 3 గంటల నుంచి జాతర, రాత్రి 8 గంటలకు రామలీల కార్యక్రమాలు నిర్వహిస్తారు. రాజన్న సన్నిధిలో.. వేములవాడ : హరిహరులు కొలువై ఉన్న శైవక్షేత్రం వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి సన్నిధిలో ఆదివారం విజయదశమి వేడుకలు జరగనున్నాయి. శమీ పూజ సమయానికి శ్రవణ నక్షత్రం ప్రారంభమవుతుండడంతో తిథి, నక్షత్ర గణాంకాల అనుకూలత కారణంగా ఆది వారమే దసరా ఉత్సవాలకు నిర్ణయించామని స్థానాచార్యులు గోపన్నగారి శంకరయ్య వెల్లడిం చారు. శ్రీరాజరాజేశ్వరీ దేవికి శ్రీసూక్త, దుర్గాసూక్త అభిషేకం నిర్వహించనున్నారు. ఉదయం 9.15 నుంచి ఆయుధపూజ, 3.15 నుంచి ధ్వజారోహణ, మహాలక్ష్మీ అవతార అలంకరణ, గజ వాహన అపారాజిత పూజ నిర్వహించనున్నా రు. అనంతరం శ్రీరాజరాజేశ్వర స్వామి, శ్రీరాజ రాజేశ్వరీ దేవి శమీయాత్ర ప్రారంభమవుతుం ది. రాత్రి 9 గంటలకు ఏకాంత సేవ ఉంటుంది. కొండగట్టులో... మల్యాల : కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో ఆదివారం విజయదశమి వేడుకలు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. తొమ్మిది రోజులుగా ఆలయంలోని మూలవిరాట్టు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తుండగా దుర్గామాత విగ్రహాన్ని ఈ సందర్భంగా నిమజ్జనం చేయనున్నారు. వేడుకలు ఏర్పాట్లు పూర్తయ్యాయి. -
ఊరంతా పండగ
కర్నూలు(కల్చరల్), న్యూస్‌లైన్: సకల విజయ వరప్రదాయిని దుర్గామాతను వివిధ అవతారాల్లో ప్రత్యేక అలంకరణలు చేపట్టిన భక్తులు విశేష పూజలు నిర్వహిస్తున్నారు. ఇక విజయదశమిని పురస్కరించుకుని ఆదివారం జిల్లాలోని అన్ని ఆలయాల్లో దుర్గమ్మను భక్తిశ్రద్ధలతో పూజించేందుకు సిద్ధమయ్యారు. ఆదివారం మధ్యాహ్నం 1.30 నుంచి 2.20 గంటల్లోపు నవమి నిష్ర్కమించి విజయదశమి ఆరంభమవుతున్న శుభ సందర్భాన చేపట్టే కార్యక్రమాలు విజయవంతమవుతాయని ప్రముఖ పండితులు తెలకపల్లి రఘురామశర్మ తెలిపారు. విజయదశమి రోజున జిల్లాలోని శ్రీశైలం, అహోబిలం, మంత్రాలయం, మహానంది తదితర ఆలయాల్లో విశిష్ట పూజలు జరగనున్నాయి. శ్రీశైలంలో విజయదశమి సందర్భంగా భ్రమరాంబికాదేవిని అత్యంత ఆకర్షణీయంగా అలంకరించి పురవీధుల్లో ఊరేగించనున్నారు. అహోబిళ పుణ్యక్షేత్రంలో ప్రహ్లాద వరదుడికి ఆనందోత్సాహాల నడుమ ఊరేగింపు నిర్వహించనున్నారు. మంత్రాలయంలో రాఘవేంద్రస్వామికి రథోత్సవం నిర్వహిస్తారు. మహానందిలో శివపార్వతులను ప్రత్యేకంగా అలంకరించనున్నారు. జిల్లాలోని ఆలయాల్లో విజయదశమిని పురస్కరించుకుని చండీ హోమం, సప్తశతీ పారాయణం, పూర్ణాహుతి, కుంకుమార్చనలు చేయనున్నారు. సాయంత్రం రథోత్సవం నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లాలో పుంజుకున్న దసరా సందడి గత రెండు నెలలుగా జిల్లా అంతటా సమైక్యాంధ్ర ఉద్యమం ఉద్ధృతంగా జరుగుతున్న నేపథ్యంలో బంద్‌లు, ధర్నాలు, రాస్తారోకోలతో దసరాకు సంబంధించిన వ్యాపారం స్తంభించింది. అయితే శనివారం ఆర్టీసీ బస్సులు డిపోలు వదిలి ఊర్లకు తరలివెళ్లడంతో సందడి పుంజుకుంది. వస్త్ర దుకాణాలలో కొనుగోళ్లు ఊపందుకున్నాయి. వ్యాపార కేంద్రాలైన కర్నూలు, నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు తదితర ప్రాంతాల్లో దసరా హుషారు కనిపించింది. జనం శనివారం రోజున విజయదశమి పూజా సామగ్రి, పిండి వంటకాలకు సంబంధించిన సరుకులను కొనుగోలు చేయడంతో ఆయా ప్రాంతాల్లో రద్దీ నెలకొంది. జమ్మి చెట్టుకు అలంకరణలు: విజయదశమి సందర్భంగా జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో శివారుల్లోని జమ్మిచెట్లను ప్రత్యేకంగా అలంకరించారు. సాయంత్రం 6 గంటల నుంచి వేలాదిగా తరలివచ్చే జనం జమ్మివృక్షం చుట్టూ ప్రదక్షిణ చేసి జమ్మి పత్రాలను తీసుకెళ్లి పెద్దలకు సమర్పించి నమస్కరించే సాంప్రదాయం దసరా పండగలో విశేషం. -
దసరాకు సర్వం సన్నద్ధం
ఆదిలాబాద్ కల్చరల్, న్యూస్‌లైన్ : ఆదిలాబాద్ మండలం మావల గ్రామ పంచాయతీ పరిధిలోని రాంలీలా మైదానంలో హిందూ సమాజ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో రావణాసుడిని దహనం చేయనున్నారు. అంతకుముందు కన్యక పరమేశ్వరీ మందిరంలో భారత మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి, శోభాయాత్ర ప్రారంభిస్తారు. భైంసాలోని సాయిబాబా మందిరంలో మైసమ్మగుట్ట వద్ద దసరా వేడుకలు జరుపుకోనున్నారు. ఆసిఫాబాద్‌లోని అభయాంజనేయస్వామి ఆలయ సమీపంలో దసరా వేడుకలు జరగనున్నాయి. ప్రత్యేకించి 31 అడుగులతో నరకాసురుడి వధ చేపట్టనున్నారు. మంచిర్యాలలోని గోదావరి తీరాన గౌతమేశ్వరి ఆలయం పరిధిలో గల జమ్మి చెట్టు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అంతకుముందు ఆలయం నుంచి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకెళ్లి జమ్మి చెట్టు వద్ద విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేస్తారు. నిర్మల్‌లోని మంగల్‌పేట్‌లో గల మహాలక్ష్మి ఆలయంలో రావణాసురుడిని దహనం చేస్తారు. బెల్లంపల్లిలోని సింగరేణి తిలక్ స్టేడియంలో రావణాసురుడి వధకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాగజ్‌నగర్‌లో పెనుల్ పహాడ్ మైదానంలో రావణుడి దహనం చేయనున్నారు. ఆయుధ పూజ విజయదశమి వేడుకల్లో భాగంగా జమ్మిచెట్టు, ఆయుధాలను పూజిస్తారు. జమ్మిచెట్టు కొమ్మలను తీసుకుని వచ్చి దేవాలయాలు, ముఖ్య కూడళ్లలో ఉంచుతారు. పూజల అనంతరం ఆకులను తీసుకుని బంధుమిత్రులకు, పెద్దలకు అందించి దీవెనలు తీసుకోవడం అనావాయితీ. ఎదుటి వారికి ఇచ్చి ఆలింగనం చేసుకుంటారు. తెలంగాణలో ఇంటిల్లిపాదీ ఆనందంగా జరుపుకునే అతి పెద్ద పండుగ దసరా. కొత్త బట్టలు ధరించి దేవాలయాలకు వెళ్లడం, కుంటుంబ సభ్యులంతా కలిసి పిండి వంటలు భుజించడం చేస్తారు. ఇదే రోజున రోజు పాలపిట్టను చూస్తే శుభసూచకంగా భావిస్తారు. శుభప్రదంగా.. దసరా రోజు ఏ వస్తువులు కొనుగోలు చేసినా శుభప్రదంగా భావిస్తారు. కొత్త అల్లుళ్లకు సైతం దసరా రోజున వాహనాలు కొనివ్వడం కూడా సంప్రదాయంగా వస్తోంది. వ్యాపారాలు, దుకాణాలు నూతనంగా ప్రారంభిస్తారు. ఈ రోజు ప్రారంభించిన దుకాణాలు, కొనుగోలు చేసిన వస్తువులకు ఎటువంటి అరిష్టాలు జరగకుండా ఉంటాయని నమ్మకం. పాత యంత్రాలు, వాహనాలు సైతం శుభ్రం చేసి ప్రత్యేక పూజలు చేస్తారు. ఇదీ సంప్రదాయంగా వస్తోంది. పెద్దల దీవెన దసరా ఉత్సవాన్ని పురస్కరించుకొని రావణ సంహరణ జరిగిన అనంతరం ప్రజలు తమ తల్లిదండ్రులు, అక్కాచెల్లెల దీవెనలు, పెద్దల ఆశీర్వాదాన్ని తీసుకుంటారు. తోటి స్నేహితులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకుంటారు. చిన్నాపెద్ద తేడా లేకుండా కొత్త దుస్తులను ధరించి ఆనందోత్సాహాలతో పండుగను జరుపుకుని పిండి వంటకాలు చేసి విందు ఆరగిస్తారు. ముస్తాబైన రాంలీలా మైదానం జిల్లా కేంద్రంలోని మావల గ్రామ పంచాయతీ పరిధి దస్నాపూర్ రాంలీలా మైదానంలో దసరా పండగకు మైదనాన్ని శనివారం ముస్తాబు చేశారు. పంచాయతీ కార్మికులతో మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ ఉష్కం రఘపతి పనులను పరిశీలించారు. కన్యక పరమేశ్వరీ ఆలయం భరత మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి శోభాయాత్ర ప్రారంభించారు. అక్కడ నుంచి రాంలీలా మైదానానికి శోభాయాత్రగా వెళ్తారు. ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్యే జోగురామన్న, జిల్లా సెషన్స్ జడ్జి బి.గోపాల కృష్ణమూర్తి, జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠత్రిపాఠీలు, ఆర్ఎస్ఎస్ ప్రవక్త గణతే హరిప్రకాశ్‌రావు పాల్గొంటార ు. నేడు దశమి బెల్లంపల్లి, న్యూస్‌లైన్ : ఈ సంవత్సరం విజయదశమి వే డుకలను ఏ రోజు జరుపుకోవాలనే అంశంపై ప్రజల్లో అ నుమానాలు తలెత్తాయి. పండుగ ఆదివారమా? సోమవార మా? అన్న సందేహాలు తలెత్తాయి. ఇలాంటి పరిస్థితి ఇదివరలో ఎన్నడూ తలెత్తలేదు. శాస్త్రం ప్రకారం మాత్రం ఆదివారం రోజునే విజయదశమి జరుపుకోవడం శ్రేష్టమని బెల్లంపల్లికి చెందిన ప్రముఖ వేద పండితుడు శ్రీనివాస్‌శర్మ పేర్కొన్నారు. ఆయన చెప్పిన ప్రకారం... విజయదశమిని జరుపుకోవాలంటే తప్పనిసరిగా శ్రవణ న క్షత్రం ఉండాలనేది శాస్త్రం చెబుతోంది. ఆది వారం ఉద యం 8 గంటల నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు శ్రవణ నక్షత్రం ఉంటోంది. ఆ తర్వాత మధ్యాహ్నం 1 గంట నుంచి మరుసటి రోజు 11 గంటల వరకు దశమి ఉంటోంది. ఆ ముహూర్తంలోనే జంబికి వెళ్లడానికి వీలు కలుగుతుంది. సోమవారం అలాంటి పరిస్థితులు లేవు. ఆ రోజు ఉదయం 11 గంటల వరకు మాత్రమే దశమి ఉం టుంది. శ్రవణ నక్షత్రం పూర్తిగా లేకపోవడంతో దసరాను జరుపుకోవడం శాస్త్ర రీత్యా సరికాదు. శ్రవణ నక్షత్రం లేని రోజున జంబికి వెళ్లడం కుదరదు. ఆ ప్రకారంగా సోమవా రం విజయదశమి జరుపుకోవడం ఏ విధంగానూ ఆమోదయోగ్యం కాదు. దివ్యమైన ముహూర్తం ఉన్న ఆదివారం రోజునే దసరా వేడుకలు జరుపుకోవడం మంచిదని శ్రీని వాస్శర్మ స్పష్టం చేశారు. జిల్లా అంతటా ఆదివారమే దసరా జరుపుకునేందుకు ప్రజలు సంసిద్ధమవుతున్నారు. అయితే ముథోల్, ఉట్నూర్, ఖానాపూర్ నియోజకవర్గాల్లోని కొన్ని మండలాల ప్రజలు ఆదివారం, మరికొన్ని మండలాల ప్రజలు సోమవారం వేడుకలు జరుపుకోబోతున్నారు. -
దసరాకు అంతా సిద్ధం
సాక్షి ముంబై: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తెలుగువాళ్లు ఆదివారం దసరా జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. కొందరు సోమవారం విజయదశమి జరుపుకుంటున్నా.. ఎక్కువ మంది మాత్రం ఆదివారమే పండగను జరుపుకుంటున్నారు. దీంతో గత కొన్ని రోజులుగా పూజలు అందుకుంటున్న దేవిమాత విగ్రహాలను ఆదివారం నిమజ్జనం చేయనున్నారు. ఇందుకోసం నిమజ్జన ఘాట్ల వద్ద అన్ని ఏర్పాట్లు చేసినట్లు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు తెలిపారు. ఘాట్లకు వెళ్లే మార్గాలతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అనుచిత ఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. చాలా మంది తెలుగువాళ్లు శనివారమే సద్దుల బతుకమ్మ వేడుకలను జరుపుకున్నారు. కుర్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు కుర్లాలోని సంబాజీ చౌక్ వద్ద శ్రీ మార్కండేయ పద్మశాలి సమాజం ఆధ్వర్యంలో శనివారం బతుకమ్మ పండగను ఘనంగా నిర్వహించారు. దాదాపు 150 మంది మహిళలు వేడుకల్లో పాల్గొనడం విశేషం. సర్వాంగ సుందరంగా బతుకమ్మలను పేర్చిన వారికి సమాజం తరపున బహుమతులు అందజేశారు. ఈ సంవత్సరం అతి పెద్ద బతుకమ్మను అలంకరించి తీసుకొచ్చిన చిలువేరి అర్చన ప్రథమ బహుమతి సాధించింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన కంటె అశోక్ బహుమతిని ఆమెకు అందజేశారు. రెండో బహుమతి మంతెన స్వాతి, పాము సునితకు మహిళా అధ్యక్షురాలు మద్ది లావణ్య అందజేశారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ... బతుకమ్మ పండుగను, మన సంస్కృతిని కాపాడాలన్నారు. ఇందుకోసం ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న వారికి ఎప్పుడూ సహకరిస్తానన్నారు. సంస్థ అధ్యక్షుడు సంగిశెట్టి అశోక్, ప్రధాన కార్యదర్శి చిలివేరి మురళీధర్, సహాయక కార్యదర్శి చిలివేరి అశోక్ తదితరులు పాల్గొన్నారు. నేడు బతుకమ్మ వేడుకలు సాక్షి, ముంబై: ఠాణేలో ‘తెలుగు సేవామండలి’ ఆధ్వర్యంలో ఆదివారం దసరా ఉత్సవాలతోపాటు బతుకమ్మ పండుగను నిర్వహించనున్నారు. లోకమాన్యనగర్ పాడా నంబరు రెండులోని మున్సిపల్ పాఠశాలలో సాయంత్రం నాలుగు గంటల నుంచి ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. స్థానిక తెలుగు ప్రజలందరు తమ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడకోవడంతోపాటు ఆంధ్రులందరినీ ఒక్కచోటికి తేవాలనే సదుద్దేశంతో ఈ మండలిని ఏర్పాటు చేసినట్టు ఆ సంస్థ పదాధికారులుతెలిపారు. బతుకమ్మ పండుగను ఠాణేలో మొదటిసారి నిర్వహిస్తున్న ఘనత తమదేనని మండలి సభ్యులు తెలిపారు. గతంలో బతుకమ్మ పండగ లో పాల్గొనేందుకు అనేక మంది ముంబైలోని గోరెగావ్, వర్లి, భివండీలోని వివిధ ప్రాంతాలకు వెళ్లేవారు. ఈ సంవత్సరం నుంచి ఠాణేలోనే ఈ బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభించడంతో సమీపప్రాంతాల్లోని తెలుగువారంతా ఇక్కడికే రానున్నారు. ఈ సందర్భంగా వివిధ సాంస్కృతి కార్యక్రమాలను ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. ప్రపంచ రికార్డు సృష్టించిన తెలుగు వ్యక్తి కిషన్ జగ్లర్ షో, తెలంగాణ, బతుకమ్మ, పల్లెపాట తదితర వినోద కార్యక్రమాలు ఉంటాయి. స్థానిక తెలుగు ప్రజలందరు పాల్గొని ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని తెలుగు సేవామండలి నాయకులు శీలం భూమయ్య, ఎరవేణి గురు, పారిపెల్లి శంకర్, గుండారపు పుల్లయ్య, మెంగు రమేష్, శంకర్ గంగాధరిలు ఓ ప్రకటనలో తెలిపారు.