
సుదీర్ఘ భారతదేశ చరిత్రకే మణిమకుటం అశోక చక్రవర్తి. చండ అశోకునిగా పాలన ప్రారంభించి, ప్రపంచ చరిత్రలో ఘోరమైన యుద్ధంగా పేరొందిన కళింగయుద్ధంలో విజయం సాధించాడు. కానీ ఆ యుద్ధంలో పారిన రక్తపాతాన్ని చూసి చలించిపోయాడు. అప్పటికే అతని భార్య విదిశాదేవి వల్ల బౌద్ధం గురించి విన్న అశోకుని హృదయంలో ఏదో మూల కారుణ్యదీపం వెలిగింది. అదే అతని మనస్సులో మానవీయాంకురాన్ని మొలకెత్తించింది. మనస్సును బౌద్ధం ఆవరించింది. ఈ మార్పుకి అతని భార్య విదిశాదేవి, కుమార్తె సంఘమిత్ర, కుమారుడు మహేంద్రుడే కారణం. తనలోని మొండితనం, తనలోని దుడుకుతనం తనకు బాగా తెలుసు.
అందుకే తనకు తానే కళ్లెం వేసుకోవాలనుకున్నాడు. ఆనాటి బౌద్ధగురువు మొగ్గలిపుత్త తిస్స దగ్గరకు వెళ్లి తానూ బౌద్ధ దీక్ష తీసుకుంటానని చెప్పాడు. అప్పటికి కళింగ యుద్ధం ముగిసి ఏడాది కావస్తోంది. విజయోత్సవాలు ఘనంగా జరపాలని సన్నాహాలు జరుగుతున్నాయి. ఆయుధాల పూజకు దేశం అంతటా సిద్ధమైంది. ఆరోజు ఆశ్వయుజ శుద్ధ అష్టమి. బౌద్ధులకు ఉపవాసదినం. అశోకుడు బిడ్డలతో ఆ రోజు బౌద్ధ దీక్ష తీసుకున్నాడు. ఆ మరుసటి రోజున తన కారాగారాల్లో ఉన్న యుద్ధ ఖైదీలందర్నీ విడుదల చేశాడు. ఉరిశిక్ష రద్దు చేశాడు. ప్రపంచ చరిత్రను తిరగరాశాడు. ప్రతి యుద్ధ ఖైదీకీ రెండున్నర ఎకరాల భూమిని హక్కుపత్రాలతో అందించాడు. నవమి తర్వాతిరోజు దశమి. ఆ రోజుని శాంతి దశమిగా ప్రకటించాడు. ఆయుధాల్ని కట్టకట్టి మూలన పెట్టండి. కత్తికి బదులు కరుణ పతాకం ఎత్తండి. అని ప్రకటించాడు. దేశమంతా ధమ్మ విజయోత్సవాలు కజరిగాయి.
‘‘ఇక ఈ నాటినుండి, నేనుగాని, నా వారసులు గానీ యుద్ధాలు చేయరు. కరుణ, శాంతి, మానవీయతలే మా మార్గం’’ అని ప్రకటించాడు అశోకుడు. ఆ సంవత్సరం అంటే క్రీ.శ. 262నుండి మౌర్యవంశంలో ఆఖరి రాజైన దశరథుని వరకు భారతదేశమంతటా విజయ దశమినాడు అహింసోత్సవాలు జరిగాయి. ఆ తర్వాత బౌద్ధపతనంతో అవీ కనుమరుగయ్యాయి. మరలా ఆ ఉత్సవాన్ని 1956 (అక్టోబర్ 14)విజయదశమి రోజున డా. బి.ఆర్. అంబేడ్కర్ నాగపూర్‌లో ప్రారంభించాడు. ఆ రోజున ఆరు లక్షల మందితో తానూ బౌద్ధదీక్ష తీసుకున్నాడు. అలా తిరిగి భారత గడ్డపై అశోక విజయ దశమి పునః ప్రారంభమైంది. శాంతికి సంకేతంగా, సంక్షేమానికి చిరునామాగా, మానవీయతకు మహా సందేశంగా పరిమళించిన ఈ అశోక విజయ దశమి శాంతికి బలిమి. కరుణకు కలిమి.
– డా. బొర్రా గోవర్ధన్