నెత్తురోడిన రహదారులు
రాష్ట్రంలో మంగళవారం జరిగిన మూడు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 12మంది మృత్యువాతపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో లారీని కారు ఢీకొనడంతో ఐదుగురు మృతిచెందగా వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో జరిగిన ప్రమాదాల్లో 7గురు దుర్మరణం పాలయ్యారు.
సాక్షి, రాజమండ్రి : విజయదశమినాడు గ్రామ దేవతకు పూజలుచేసి, విజయవాడలో దుర్గమ్మను దర్శించుకునేందుకు బయలుదేరిన భక్తులు మార్గమధ్యంలో ఘోర ప్రమాదానికి గురయ్యారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి శివారు బొమ్మూరు వద్ద జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు డ్రైవర్ సహా ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. విశాఖ జిల్లా పెదగంట్యాడ మండలం కొత్తకర్ణానివారిపాలెం నుంచి విజయవాడకు దుర్గమ్మను దర్శించుకునేందుకు కారులో 9మంది బయలుదేరారు.
తెల్లవారుజామున 3.35 గంటల సమయంలో ఆగి ఉన్న లారీని వీరి కారు ఢీకొనడంతో విశాఖ జిల్లా సింహాచలం శ్రీనివాసనగర్‌కు చెందిన కారు డ్రైవర్ ధమర్‌సింగ్ శంకరరావు (28), కొత్తకర్ణానివారిపాలేనికి చెందిన గొన్నాశివకుమార్ (28), గద్దే శ్రీనివాసరావు(26) , విరోధి అప్పలశ్రీను(28), యర్రా రమేష్ (26) అక్కడికక్కడే మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న ఇద్దరిని కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
కారును సిమెంట్ ట్యాంకర్ ఢీకొని...
చేవెళ్ల : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల పరిధిలోని కందవాడ బస్‌స్టేజీ సమీపంలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. హైదరాబాద్ వెళ్తున్న కారును ఎదురుగా వస్తున్న సిమెంట్ ట్యాంకర్ ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో పెద్దేముల్ మండలం ఇందూరు గ్రామానికి చెందిన పి. చెన్నారెడ్డి(45), ఆయన భార్య పవిత్ర(40), తల్లి శకుంతల(63), కుమారుడు సాయినాథ్‌రెడ్డి(5) అక్కడికక్కడే మరణించారు. నగరంలోని ఆస్పత్రికి వెళ్తుండగా దుర్ఘటన చోటుచేసుకుందని బంధువులు తెలిపారు. మృతదేహాలను వెలికితీసి చేవెళ్లలోని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ట్యాంకర్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు.
వరంగల్‌లో మరో ముగ్గురు...
శాయంపేట : కారు, ఆర్టీసీ బస్సు పరస్పరం ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వరంగల్ జిల్లా తహారాపూర్(మాందారిపేట) వద్ద సోమవారం ఈ సంఘటన జరిగింది. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి హవేలీకి చెందిన 16 మంది మిత్రులు మూడు కార్లలో వరంగల్ జిల్లా గోవిందరావుపేట మండలం లక్నవరం సరస్సును చూసేందుకు బయలుదేరారు. తహారాపూర్ సమీపంలో ఒక కారును ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. దీంతో కారు నడుపుతున్న అనుమాండ్ల భరత్(26) అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో ఇద్దరు మరణించారు.