167వ నంబర్ జాతీయ రహదారిపై మలుపు వద్ద లేని సూచిక బోర్డు
ఉమ్మడి జిల్లాలో రహదారులు నెత్తు‘రోడు’తున్నాయి. ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట రోడ్డు ప్రమాదం జరుగుతూనే ఉంది. కనీసం ఒకరిద్దరు చనిపోతూనే ఉన్నారు. ఇంకొందరు గాయాలపాలవుతున్నారు. ప్రమాదం జరిగినప్పుడల్లా డ్రైవర్ అజాగ్రత్త.. అతివేగమే ప్రమాదానికి కారణాలని చెప్పుకొస్తున్న
అధికారులకు తమ తప్పు మాత్రం కనిపించడం లేదు.
సాక్షి, మహబూబ్‌నగర్: ఉమ్మడి జిల్లాలోని రహదారులను అద్దంగా తీర్చిదిద్దే పనిలో ఉన్న అధికార యంత్రాంగం ప్రమాదకర మలుపులు.. కల్వర్టుల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకుండా మొద్దు నిద్రపోతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్యాకేజీ పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లతోనూ ఆ రహదారులను మరమ్మతు చేయించుకోవడంలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. కనీసం జాతీయ రహదారుల నిర్వహణ సైతం అస్తవ్యస్తంగా తయారైంది. ఫలితంగా తరచూ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 2,600 కి.మీ. ఆర్‌అండ్‌బీ, సుమారు ఏడు వేల కి.మీ. పంచాయతిరాజ్ రోడ్లు ఉన్నాయి. తమ శాఖ ఆధ్వర్యంలో చేపట్టే రోడ్ల నిర్మాణంలో నాణ్యత అంశాల పరిశీలన, పర్యవేక్షణతో పాటు ఏయే ప్రాంతాల్లో మలుపులు ఉన్నాయి? ఎక్కడెక్కడ కల్వర్టులు ఉన్నాయి? వాటి వద్ద హెచ్చరిక బోర్డుల ఏర్పాటు, కల్వర్టుల మరమ్మతు చేపట్టాల్సిన బాధ్యత ఈ రెండు శాఖలదే. అయితే వందలాది మలుపుల వద్ద ఎలాంటి హెచ్చరిక బోర్డులు, కల్వర్టుల వద్ద రక్షణ చర్యలు లేవంటే పరిస్థితి ఏమిటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. గతంలో ఎన్నో సందర్భాల్లో ఈ మలుపుల వద్ద రోడ్డు ప్రమాదాలు జరిగి.. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకెంతో మంది క్షతగాత్రులయ్యారు. అయినా ఇంతవరకు ఆయా ప్రాంతాల్లో ఎలాంటి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం గమనార్హం.
613 కి.మీ. ఎన్‌హెచ్‌లు
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలో 613 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉన్నాయి. మొత్తం 110 గ్రామాల మీదుగా రహదారుల నిర్మాణం జరిగింది. తరచూ ప్రమాదాలు జరిగే 68 ప్రాంతాలను అధి కారులు గుర్తించారు. కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ నుంచి నల్లగొండ జిల్లా కోదాడ వరకు అప్‌గ్రేడ్ అయిన 167 జాతీయ రహదారి పనులు నత్తకు నడకనేర్పుతున్నాయి. రాయచూర్ నుంచి మహబూబ్‌నగర్ వరకు పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతుండగా.. జడ్చర్ల నుంచి కల్వకుర్తి వరకు పనులు పూర్తి దశలో ఉన్నా.. హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ విషయమై డీఈ వెంకటేశ్వర్లును వివరణ కోరగా 167 జాతీయ రహదారి పనుల్లో భాగంగా జడ్చర్ల–కల్వకుర్తి వరకు మొదటి బిట్ పనులు కొనసాగుతున్నాయన్నారు. పనుల గడువు ఈ ఏడాది డిసెంబర్ వరకు ఉందన్నారు. ఆలోపే పనుల పూర్తితో పాటు ప్రమాదకర మలుపుల వద్ద హెచ్చరిక బోర్డులు.. రోడ్డుకు రేడియం ఏర్పాటు చేయిస్తామన్నారు.
అటకెక్కిన ‘ట్రామాకేర్’
ప్రధాన రహదారులపై ప్రమాదాలు జరిగితే కొనఊపిరితో ఉన్న క్షతగాత్రులను ఆయా ప్రాంతాల్లో ఉండే ప్రధాన ఆస్పత్రులకు తరలిస్తున్నారు. అయితే.. చాలా వరకు ప్రమాదాలు జరిగిన ప్రాంతాల సమీపంలో పెద్ద ఆస్పత్రులు లేకపోవడం.. ఉన్న ఆస్పత్రుల్లో వైద్యసిబ్బంది.. రోగులను కాపాడేంత స్థాయిలో వైద్య పరికరాలు, ఇతర సదుపాయాలు లేవు. దీంతో ఆయా క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించినా ప్రాథమిక చికిత్స అందించి ఇతర ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆస్పత్రికి చేరుకునేలోపే గాయపడినవారు చనిపోవడం జరుగుతోంది. ఈ సమస్యను గుర్తించిన ప్రభుత్వం రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సేవలందించేలా ఉమ్మడి జిల్లా పరిధిలోని జడ్చర్ల, కొత్తకోట వంటి ప్రమాదాలు జరిగే ప్రధాన ప్రాంతాల్లో ట్రామాకేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందుకు అవసరమైన ప్రతిపాదనల్ని అధికారులు నివేదించారు.
తర్వాత ఆ సెంటర్ల ప్రతిపాదనలు అటకెక్కాయి. మరోవైపు సుదూర ప్రాంతాలకు వెళ్లే వాహనదారులు అలసిపోతే వారు సేద తీరేందుకు జాతీయ రహదారులపై ఏర్పాటు చేయాల్సిన రెస్ట్ సెంటర్ల నిర్వహణపైనా అసంతృప్తి వ్యక్తమవుతోంది. కొన్నిచోట్ల టాయిలెట్ల నిర్వహణ బాగా లేకపోవడంతో వాహనదారులు అక్కడక సేద తీరేందుకు ఇష్టపడడం లేదు. వీరిలో కొందరు రహదారుల వెంట ఉన్న హోటళ్లు.. దాబాల వద్ద ఆగి విశ్రాంతి తీసుకుంటున్నారు. చాలా మంది ఆగకుండా వెళ్లి ప్రమాదాలకు గురవుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రహదారులపై రోడ్డు ప్రమాదాలు జరగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment