శ్రీకాకుళం క్రైం, న్యూస్‌లైన్: జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. శ్రీకాకుళం రూరల్ మండలంలోని డెంటల్ కళాశాల సమీపంలో జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని ప్రసాద్ అనే వ్యక్తి మృతి చెందాడని పోలీసులు తెలిపారు. శ్రీకాకుళం పట్టణం ఏపీహెచ్‌బీ కాలనీకి చెందిన ప్రసాద్, వజ్రాపు వెంకట శ్రీధర్ ద్విచక్రవాహనంపై డెంటల్ కాలేజీ నుంచి వస్తున్నారు. ద్విచక్రవాహనాన్ని గుర్తు తెలియని వాహనం డీకొనడంతో ప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్ర గాయాల పాలైన శ్రీధర్ పూర్తి వివరాలు వెల్లడించే పరిస్థితిలో లేకపోవడంతో మృతుడి సమాచారం తెలియలేదు. ఔట్‌పోస్టు పోలీసులు వివరాలను సేకరించారు.
ఆటో ఢీకొని ఒకరు...
వజ్రపుకొత్తూరు : ఆటో బోల్తాపడడంతో మండలం తర్లాగడివూరు గ్రామానికి చెందిన కోనేరు శ్యామ్ (25) మృతి చెందాడు. వజ్రపుకొత్తూరు ఎస్‌ఐ ఎస్.తాతారావు, శ్యామ్ కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయదశమి సందర్భంగా సోమవారం శ్యామ్ మిత్రులతో కలిసి ఆటోలకు పూజలు చేశారు. తర్వాత చినవంకులూరు గ్రామానికి వెళ్లి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న ఆటో వంకులూరు రోడ్డుపక్కన బోల్తాపడింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్యామ్‌ను 108 అంబులెన్స్‌లో పలాస ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తాతారావు తెలిపారు.
సైక్లిస్టును తప్పించబోయి ఒకరు...
పూండి : వజ్రపుకొత్తూరు మండలం పూండిలో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో గోవిందపురం గ్రామానికి చెందిన పుచ్చ వెంకటరావు తీవ్ర గాయాలపాలై మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటరావు పూండి బస్టాండ్ రోడ్డులో ఫాస్ట్‌ఫుడ్ దుకాణం నిర్వహిస్తున్నాడు. సోమవారం సాయంత్రం స్థానిక పెట్రోల్ బంక్‌లో తన బైక్‌కు పెట్రోల్ పోసుకుని రోడ్డు దాటుతుండగా అడ్డంగా వచ్చిన సైక్లిస్టును తప్పించబోగా ఈ ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన అతనిని విశాఖపట్నం తరళిలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. మృతునికి భార్య దాలమ్మ , ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు వజ్రపుకొత్తూరు హెడ్ కానిస్టేబుల్ ప్రకాశరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృత దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ద్విచక్రవాహనం ఢీకొనడంతో...
సోంపేట : రాణిగాం గ్రామం వద్ద జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రాణిగాం గ్రామానికి చెందిన ఎన్.గున్నయ్య (40) సైకిల్‌పై వెళుతుండగా పలాస మండలం బంటుకొత్తూరు గ్రామానికి చెందిన వ్యక్తులు ద్విచక్రవాహనం ఢీకొన్నారు. గున్నయ్యను హరిపురం ఆస్పత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడికి భార్య లక్ష్మి ఉన్నారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు
పలాస రూరల్ : పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న నెమలినారాయణపురం జాతీయ రహదారిపై మంగళవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన రామకృష్ణ తీవ్ర గాయాలపాలయ్యాడు. ప్రమాదానికి కారణం తెలియాల్సి ఉంది. ఆటో డ్రైవింగ్ నేర్చుకుంటుండగా ప్రమాదం జరిగిందని కొందరు, రెండు వాహనాలు ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని మరికొందరు చెబుతున్నారు. బాధితుడిని కాశీబుగ్గ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
ద్విచక్రవాహనం ఢీకొనడంతో ఇద్దరికి..
నరసన్నపేట రూరల్ : జాతీయ రహదారిపై శ్రీరాంపురం వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. రోడ్డు దాటుతున్న మహిళ ముద్దపు సూరోడును కొటబొమ్మాళి నుంచి శ్రీకాకుళం వెళ్తున్న మోటార్ సైకిల్ ఢీకొంది. ఈ ఘటనలో మహిళతో పాటు ద్విచక్రవాహనం నడుపుతున్న సకలాబత్తుల శ్రీధర్ గాయపడ్డారు. క్షతగాత్రులను ఎన్‌హెచ్ అంబులెన్స్‌లో నరసన్నపేట ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
వేర్వేరు ప్రమాదాల్లో నలుగురి మృతి
Published Wed, Oct 16 2013 6:44 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
Advertisement