రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం  | Two Died In Road Accident Allagadda | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం 

Published Thu, Jun 13 2019 7:16 AM | Last Updated on Thu, Jun 13 2019 7:17 AM

Two Died In Road Accident Allagadda - Sakshi

వారంతా వివిధ గ్రామాల నుంచి ఎవరి పనిమీద వారు పట్టణానికి వచ్చి వారి గమ్యస్థానాలకు చేరుకునేందుకు నంద్యాల వైపు వెళ్తున్న ఆటో ఎక్కారు. బయలుదేరిన ఐదు నిమిషాలకే వెనుక నుంచి లారీ రూపంలో మృత్యువు యమపాశం విసిరింది. ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ముగ్గురు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు.. తీవ్ర విషాదం నింపిన ఈ ఘటన ఆళ్లగడ్డ మండలం పేరాయిపల్లె మెట్ట సమీపంలో బుధవారం చోటుచేసుకుంది.  

సాక్షి,ఆళ్లగడ్డ(కర్నూలు): మండల పరిధిలోని పేరాయిపల్లె మెట్ట సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందగా, మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. అందులో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. పోలీసులు, మృతుల బంధువులు తెలిపిన వివరాలు.. దొర్నిపాడు మండలం చాగరాజువేముల గ్రామానికి చెందిన చాకలి శివుడు, భార్య లక్ష్మిదేవి పట్టణానికి చేరుకొని, ఎర్రగుంట్ల గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కారు.

బత్తలూరు గ్రామానికి చెందిన విలియం మనవరాలికి ఆరోగ్యం బాగా లేకపోవడంతో కోడలితో కలిసి పట్టణంలోని వైద్యశాలకు వచ్చి అక్కడ చికిత్స చేయించుకుని, తిరిగి గ్రామానికి వెళ్లేందుకు ఇదే ఆటో ఎక్కారు. వీరితో పాటు మరో ఆరుగురు కూడా నంద్యాల వైపు వెళ్లేందుకు ఆటోలో ఎక్కి కూర్చోవడంతో ఆటో నంద్యాల వైపు బయలు దేరింది. పేరాయిపల్లె›మెట్ట సమీపంలోకి రాగానే ఆటోలో ఉన్న ప్యాసింజర్‌ సంచి కిందపడుతోందని చెప్పడంతో డ్రైవర్‌ సడన్‌గా రోడ్డు సైడుకు తిప్పి నిలిపాడు. వెనుకనే వస్తున్న లారీ క్షణాల్లో ఆటోను ఢీకొంది.

ప్రమాదంలో చాగరాజువేముల గ్రామానికి చెందిన చాకలి లక్ష్మీదేవి (50), బత్తలూరు గ్రామానికి చెందిన విలియం (61) అక్కడికక్కడే మృతిచెందగా, లక్ష్మీదేవి భర్త చాకలి శివయ్యతో పాటు నల్లగట్లకు చెందిన బాలిక మాధవి, బత్తలూరు గ్రామానికి చెందిన సులోచన, గాజులపల్లి గ్రామానికి చెందిన రసూల్‌బీలు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, „ýక్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించి ప్రథమచికిత్స అనంతరం నంద్యాల వైద్యశాలకు తీసుకెళ్లారు. రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement