నాగపూర్ : ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్ ప్రధాని ఆరెస్సెస్‌కు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలకు సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ మంగళవారం గట్టి కౌంటర్ ఇచ్చారు. విజయదశమిని పురస్కరించుకుని ప్రసంగించిన మోహన్ భగవత్ ఆరెస్సెస్ ప్రత్యర్ధులను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. తమ విషప్రచారాలు ఫలించని స్థితిలో పలువురు విమర్శకులు ఆరెస్సెస్‌పై విరుచుకుపడతారని మండిపడ్డారు. నిరాధార ఆరోపణలతో సంఘ్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మోహన్ భగవత్ విమర్శించారు. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా ఇప్పుడు ఈ మంత్రం నేర్చుకున్నారని ధ్వజమెత్తారు. తమపై సాగుతున్న దుష్ర్పచారానికి ఆరెస్సెస్ భయపడదని, వెనుకడుగు వేయదని ఇమ్రాన్ ఖాన్ గుర్తెరగాలన్నారు.
ప్రతిఒక్కరితో సామరస్యంగా పనిచేయడాన్నే ఆరెస్సెస్ విశ్వసిస్తుందని చెప్పుకొచ్చారు. సంస్థ ప్రతిష్టను దెబ్బతీసేందుకు జరుగుతున్న ప్రయత్నాల పట్ల సంఘ్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని పిలుపు ఇచ్చారు. కాగా ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆరెస్సెస్‌ను లక్ష్యంగా చేసుకుని ఇమ్రాన్ ఖాన్ ఇంటా బయటా పలు వేదికలపై నిప్పులు చెరుగుతున్న సంగతి తెలిసిందే. ఐరాస వేదికగా ఇమ్రాన్ మాట్లాడుతూ హిట్లర్ వంటి నియంత్రల భావజాలంతో ఏర్పడిన ఆరెస్సెస్ కనుసన్నల్లో భారత ప్రధాని మోదీ పనిచేస్తారని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment