
మార్చి 7, 1987లో టెస్టుల్లో పదివేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్(Sunil Gavaskar). తద్వారా ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఆ తర్వాత ఇప్పటి వరకు పద్నాలుగు మంది ఈ ఫీట్ నమోదు చేసినా.. ఈ జాబితాలోకి ఎక్కిన మొదటి ఆటగాడిగా గావస్కర్ పేరు మాత్రం చెక్కుచెదరకుండా అలాగే ఉండిపోతుంది.
అయితే, ఇంతటి ఘనమైన రికార్డు సాధించడానికి పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్(Imran Khan) మాటలే కారణం అంటున్నాడు సునిల్ గావస్కర్. టెన్ స్పోర్ట్స్ షోలో భాగంగా పాక్ మాజీ సారథి వసీం అక్రం(Wasim Akram) అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఈ విషయాన్ని తెలిపాడు. ‘‘పదివేల పరుగులు సాధించడం అత్యద్భుతమైన అనుభూతి.
వెయ్యి పరుగులు చేసినా
క్రికెటర్‌గా కెరీర్ మొదలుపెట్టినప్పుడు నేను ఇక్కడిదాకా చేరుకుంటానని అస్సలు ఊహించలేదు. వెయ్యి పరుగులు చేసినా ఇంతే సంతోషంగా ఉండేవాడినేమో!.. నిజానికి ఈ మైల్‌స్టోన్ చేరుకోవాలనే లక్ష్యం నాకైతే లేదు. ఏదేమైనా.. టెంజింగ్ నార్గే, ఎడ్మండ్ హిల్లరీ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి వ్యక్తులుగా ఎలా చరిత్రలో నిలిచిపోతారో.. నేనూ ఈ మైలురాయికి చేరుకున్న మొదటి ఆటగాడిగా అలాగే గుర్తుండిపోతాను.
నిజానికి నేను ఈ ఘనత సాధించడానికి ఏకైక కారణం ఇమ్రాన్ ఖాన్. అప్పుడు మేము ఇంగ్లండ్‌లో ఉన్నాం. మ్యాచ్ అయిపోయిన తర్వాత ఇద్దరం కలిసి ఓ ఇటాలియన్ రెస్టారెంట్లో భోజనానికి వెళ్లాము. 1986లో ఇది జరిగింది. ఆరోజు.. నేను ఇమ్రాన్‌తో ఇదే నా చివరి సిరీస్ అని చెప్పాను. ఆ తర్వాతరిటైరైపోతానని అన్నాను.
అలా అస్సలు చేయొద్దు
అందుకు అతడు.. ‘లేదు.. లేదు.. అలా అస్సలు చేయొద్దు’ అన్నాడు. అందుకు నేను.. ‘ఎందుకు? ఇది నా ఇష్టం కదా’ అన్నాను. దీంతో ఇమ్రాన్ కలుగుచేసుకుంటూ.. ‘త్వరలోనే పాకిస్తాన్ జట్టు భారత్‌కు రాబోతోంది. అక్కడ మేము మీ జట్టును ఓడిస్తాం. నువ్వున్న భారత జట్టును ఓడిస్తేనే అసలు మజా. నువ్వు లేకుండా టీమిండియాను ఓడించడం నాకైతే నచ్చదు’ అన్నాడు.
అవునా.. పాక్ టీమ్ ఇండియాకు వస్తుందా? నిజమా అని అడిగాను. అవును.. ఐసీసీ సమావేశం తర్వాత వచ్చే వారం ప్రకటన వస్తుంది చూడు అన్నాడు. ఒకవేళ ఆ అనౌన్స్‌మెంట్ వస్తే ఓకే. నేను ఆటలో కొనసాగుతా. లేదంటే రిటైర్ అవుతా అన్నాను. ఇక పాకిస్తాన్‌తో సిరీస్‌కు ముందు మరో రెండో మూడో మ్యాచ్‌లు జరిగాయి. అప్పటికి నేను బహుశా 9200- 9300 పరుగుల వద్ద ఉన్నాననుకుంటా.
ఇమ్రాన్ ఖాన్ వల్లే నా పేరు చరిత్రలో నిలిచిపోయింది
ఏదేమైనా ఇమ్రాన్ ఖాన్ వల్లే నాకు ఈ అరుదైన రికార్డు దక్కింది’’ అని గావస్కర్ చెప్పుకొచ్చాడు. కాగా 1971 నుంచి 1987 వరకు టీమిండియాకు ప్రాతినిథ్యం వహించిన సన్నీ 125 టెస్టులు, 108 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 34 శతకాలు, నాలుగు డబుల్ సెంచరీల సాయంతో 10122 రన్స్ చేసిన గావస్కర్.. వన్డేల్లో ఒక సెంచరీ సాయంతో 3092 పరుగులు సాధించాడు. 75 ఏళ్ల ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ప్రస్తుతం కామెంటేటర్‌గా కొనసాగుతున్నాడు.
చదవండి: ఆస్ట్రేలియానూ వదలకండి: అఫ్గనిస్తాన్ జట్టుపై పాక్ మాజీ క్రికెటర్ ప్రశంసలు
Comments
Please login to add a commentAdd a comment