ఆదిలాబాద్ కల్చరల్ : దసరా వేడుకలకు జిల్లా ముస్తాబైంది. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. హిందూ ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో మైదానాలను ముస్తాబు చేశారు. చెడుపై మంచి జయించిన రోజును విజయదశమి పర్వదినంగా ప్రజలు భావిస్తారు. నూతన వస్త్రాలంకరణతో భక్తి ప్రపత్తులతో వేడుకలు జరుపుకుంటారు. ఆదిలాబాద్ మండలం మావల గ్రామ పంచాయతీ పరిధి రాంలీలా మైదానంలో హిందూ సమాజ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం 4గంటలకు రావణాసురుడిని దహనం చేయనున్నారు.
అంతకుముందు కన్యకాపరమేశ్వరి మందిరంలో భారతమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి శోభాయాత్ర ప్రారంభిస్తారు. భైంసాలోని సాయిబాబా మందిరంలో మైసమ్మగుట్ట వద్ద దసరా వేడుకలకు ఏర్పాట్లు చేశారు. ఆసిఫాబాద్‌లోని అభయాంజనేయ స్వామి ఆలయ సమీపంలో దసరా వేడుకలు నిర్వహిస్తారు. ప్రత్యేకంగా నరకాసురుడి వధ చేపట్టనున్నారు. మంచిర్యాలలోని గోదావరి తీరాన గౌతమేశ్వరి ఆలయ పరిధిలో జమ్మిచెట్టు వద్ద ప్రత్యేక పూజలు చేస్తారు.
ఆలయం నుంచి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకెళ్లి జమ్మి చెట్టు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిర్మల్‌లోని మంగల్‌పేట్‌లో మహాలక్ష్మీ ఆలయంలో రావణాసురుడిని దహనం చేస్తారు. బెల్లంపల్లిలోని సింగరేణి తిలక్ స్టేడియంలో రావణాసురుడి వధకు ముమ్మర ఏర్పాట్లు చేశారు. కాగజ్‌నగర్‌లో పెనుల్ పహాడ్ మైదానంలో రావణుడి దహనం చేయనున్నారు.
ఆయుధ పూజ
విజయదశమి వేడుకల్లో భాగంగా జమ్మిచెట్టు, ఆయుధాలను పూజిస్తారు. జమ్మి చెట్టు కొమ్మలను తీసుకొచ్చి ఆలయాలు, ముఖ్య కూడళ్లలో ఉంచుతారు. పూజల అనంతరం ఆకులను తీసుకుని బంధుమిత్రులు, పెద్దలకు అందించి దీవెనలు తీసుకోవడం ఆనవాయితీ. ఎదుటి వారికి ఇచ్చి ఆలింగనం చేసుకుంటారు. తెలంగాణలో ఇంటిల్లిపాదీ ఆనందంగా జరుపుకునే అతి పెద్ద పండుగ దసరా. కొత్త బట్టలు ధరించి దేవాలయాలకు వెళ్లడం, కుటుంబ సభ్యులంతా కలిసి పిండి పంటలు భుజించడం చేస్తారు. ఇదే రోజున రోజు పాలపిట్టను చూస్తే శుభసూచకంగా భావిస్తారు.
శుభప్రదంగా..
దసరా రోజు ఏ వస్తువులు కొనుగోలు చేసినా శుభప్రదంగా భావిస్తారు. కొత్త అల్లుళ్లకు సైతం దసరా రోజు వాహనాలు కొనివ్వడం కూడా సంప్రదాయంగా వస్తోంది. వ్యాపారాలు, దుకాణాలు నూతనంగా ప్రారంభిస్తారు. ఈ రోజు ప్రారంభించిన దుకాణాలు, కొనుగోలు చేసిన వస్తువులకు ఎటువంటి అరిష్టాలు జరగకుండా ఉంటాయని నమ్మకం. పాత యంత్రాలు, వాహనాలు సైతం శుభ్రం చేసి ప్రత్యేక పూజలు చేస్తారు. ఇదీ సంప్రదాయంగా వస్తోంది.
పెద్దల దీవెన..
దసరా ఉత్సవాన్ని పురస్కరించుకుని రావణ సంహరణ జరిగిన అనంతరం ప్రజలు తమ తల్లిదండ్రులు, అక్కాచెల్లెళ్ల దీవెనలు, పెద్దల ఆశీర్వాదాన్ని తీసుకుంటారు. తోటి స్నేహితులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆనందోత్సాహాలతో సంబరాలు చేసుకుంటారు. చిన్నాపెద్ద తేడా లేకుండా కొత్త దుస్తులను ధరించి ఆనందోత్సాహాలతో పండుగను జరుపుకుని పిండి వంటకాల విందు ఆరగిస్తారు.
ముస్తాబైన రాంలీలా మైదానం..
ఆదిలాబాద్‌లోని మావల గ్రామ పంచాయతీ పరిధి దస్నాపూర్ రాంలీలా మైదానంలో దసరా పండగకు మైదానాన్ని గురువారం ముస్తాబు చేశారు. పంచాయతీ సర్పంచ్ ఉష్కం రఘుపతి పనులను పరిశీపలించారు. కన్యక పరమేశ్వరి ఆలయంలో భరతమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి శోభాయాత్ర ప్రారంభించారు. అక్కడ నుంచి రాంలీలా మైదానానికి శోభాయాత్ర చేరుతుంది. ముఖ్య అతిథులుగా మంత్రి జోగు రామన్న, జిల్లా ఎస్పీ గజరావు భూపాల్, జిల్లా కలెక్టర్ ఎం.జగన్మోహన్, న్యాయమూర్తులు పాల్గొంటారు.
దసరాకు సర్వం సన్నద్ధం
Published Fri, Oct 3 2014 1:13 AM | Last Updated on Mon, Jul 29 2019 6:03 PM
Advertisement
Advertisement