విజయదశమి ఉత్సవాలకు జిల్లా సిద్ధమైంది. దశమితోపాటు శ్రవణ నక్షత్రం కలిసిరావడంతో ఆదివారమే జిల్లా వ్యాప్తంగా పండుగ జరుపుకుంటున్నారు. ప్రభుత్వం, ఇతర సంస్థలు సోమవారం విజయదశమి సెలవు ప్రకటించినా... ఆదివారమే మంచి ముహూర్తం ఉందని పండితులు ప్రకటించడంతో వేడుకలకు ప్రజలు సిద్ధమయ్యారు. వేదాలకు, మేధావులకు నిలయమైన మంథనిలో ఆదివారం ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు లక్ష్మీనారాయణస్వామి ఆలయ పూజారి తిరునగరం రమేశ్ ఆచార్యులు తెలిపారు. ఖమ్మం జిల్లా భద్రాచలం మినహా అన్ని ప్రాంతాల్లో ఆదివారమే దసరా పండుగ జరుపుకుంటున్నారు.
కరీంనగర్ కల్చరల్/మంథని, న్యూస్‌లైన్ : దసరా అంటేనే ఆయుధ పూజకు ప్రత్యే కం. ఆయుధపూజ, శమీపూజపై అనేక కథనాలు ఉన్నాయి. పాండవులు వనవాసం పూర్తి చేసుకుని హస్తినకు చేరుకున్న రోజు ఆశ్వీయుజ శుద్ధ దశమి. పాండవులు తిరిగి రాజ్యానికి చేరుకోగానే ప్రజలు దశమిని ఘనంగా నిర్వహించుకుంటారు. ఇది విజయదశమిగా మారిందని పురాణోక్తి. విజయదశమి వేడుకల్లో భాగంగా శమీ వృక్షాన్ని పూజించడం సంప్రదాయం. ఆది పరాశక్తికి తొమ్మిది రోజుల పూజల అనంతరం దశమి నాడు విశేష పూజలు చేస్తారు.
మరో కథనం ప్రకారం... అజ్ఞాతవాసానికి వెళ్లేప్పుడు పాండవులు తమను ఎవరూ గుర్తుపట్టకుండా ఆయుధాలు శమీ చెట్టుపై ఉంచి వెళ్తారు. అజ్ఞాతవాసంలో విరాట్ రాజు కొలువులో ఉంటారు. వారు ఎక్కడ ఉన్నారో కనిపెట్టడానికి కౌరవులు అన్ని రాజ్యాల మీద యుద్ధం ప్రకటిస్తూ విరాట్ రాజు మీద కూడా యుద్ధం ప్రకటిస్తారు. ఆ సమయంలో పాండవుల అజ్ఞాతవాసం ముగుస్తుంది. దీంతో వారు శమీ చెట్టు మీద దాచిన ఆయుధాలకు పూజ చేసి తీసుకుని రాజు కుమారుడి వెంట యుద్ధానికి బయల్దేరుతారు. అప్పటినుంచి ఆయుధపూజ చేయడం ఆనవాయితీగా వస్తోంది.
విజయదశమి రోజు శమీ వృక్షాన్ని పూజి స్తారు. శమీ చెట్టు కొమ్మలు తీసుకొచ్చి దేవాలయాలు, ముఖ్య కూడళ్లలో ఉంచి పూజలు నిర్వహిస్తారు. వాటి ఆకులు తీసుకుని బంధుమిత్రులకు, పెద్దలకు అందించి దీవెనలు తీసుకోవడం ఆనవాయితీ. ఈ రోజు పాలపిట్టను చూస్తే శుభసూచకంగా భావిస్తారు. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో పాలపిట్టను చూసేందుకు ఊరి శివారుకు వెళ్తుంటారు.
వేడుకలకు సిద్ధం
దసరా ఉత్సవాలకు నగరంలోని చైతన్యపురిలో గల శ్రీ మహాశక్తి ఆలయం ప్రత్యేక అలంకరణాలు, రంగురంగుల విద్యుద్దీపాలతో ముస్తాబైంది. ముగ్గురమ్మల మూలపుటమ్మ శ్రీమహాదుర్గగా, శ్రీ మహాలక్ష్మిగా, శ్రీమహాసరస్వతిగా ఒకే ప్రాంగణంలో కొలువుదీరగా దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఉదయం 7.30 కి శ్రీరాజరాజేశ్వరీపూజ, శమీపూజ సాయంత్రం 4 గంటల నుంచి దసరా ఉత్సవాలు జరుగుతాయి.
గిద్దె పెరుమాండ్ల ఆలయంలో...
నగరంలోని శ్రీ గిద్దెపెరుమాండ్ల స్వామి ఆల యానికి 300 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ ఆలయంలోనే దసరా ఉత్సవాలు నిర్వహించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఆదివారం ఉదయం 5 నుంచి వాహన పూజలు, 9 గంటలకు గణపతి పూజ, శమీ పూజలతో ఉత్సవాలు మొదలవుతాయి. సాయంత్రం 3 గంటల నుంచి జాతర, రాత్రి 8 గంటలకు రామలీల కార్యక్రమాలు నిర్వహిస్తారు.
రాజన్న సన్నిధిలో..
వేములవాడ : హరిహరులు కొలువై ఉన్న శైవక్షేత్రం వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి సన్నిధిలో ఆదివారం విజయదశమి వేడుకలు జరగనున్నాయి. శమీ పూజ సమయానికి శ్రవణ నక్షత్రం ప్రారంభమవుతుండడంతో తిథి, నక్షత్ర గణాంకాల అనుకూలత కారణంగా ఆది వారమే దసరా ఉత్సవాలకు నిర్ణయించామని స్థానాచార్యులు గోపన్నగారి శంకరయ్య వెల్లడిం చారు. శ్రీరాజరాజేశ్వరీ దేవికి శ్రీసూక్త, దుర్గాసూక్త అభిషేకం నిర్వహించనున్నారు. ఉదయం 9.15 నుంచి ఆయుధపూజ, 3.15 నుంచి ధ్వజారోహణ, మహాలక్ష్మీ అవతార అలంకరణ, గజ వాహన అపారాజిత పూజ నిర్వహించనున్నా రు. అనంతరం శ్రీరాజరాజేశ్వర స్వామి, శ్రీరాజ రాజేశ్వరీ దేవి శమీయాత్ర ప్రారంభమవుతుం ది. రాత్రి 9 గంటలకు ఏకాంత సేవ ఉంటుంది.
కొండగట్టులో...
మల్యాల : కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో ఆదివారం విజయదశమి వేడుకలు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. తొమ్మిది రోజులుగా ఆలయంలోని మూలవిరాట్టు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తుండగా దుర్గామాత విగ్రహాన్ని ఈ సందర్భంగా నిమజ్జనం చేయనున్నారు. వేడుకలు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
నేడే దసరా
Published Sun, Oct 13 2013 5:17 AM | Last Updated on Fri, Sep 1 2017 11:36 PM
Advertisement
Advertisement