సకల విజయ వరప్రదాయిని దుర్గామాతను వివిధ అవతారాల్లో ప్రత్యేక అలంకరణలు చేపట్టిన భక్తులు విశేష పూజలు నిర్వహిస్తున్నారు. ఇక విజయదశమిని పురస్కరించుకుని ఆదివారం జిల్లాలోని అన్ని ఆలయాల్లో దుర్గమ్మను భక్తిశ్రద్ధలతో పూజించేందుకు సిద్ధమయ్యారు.
కర్నూలు(కల్చరల్), న్యూస్‌లైన్: సకల విజయ వరప్రదాయిని దుర్గామాతను వివిధ అవతారాల్లో ప్రత్యేక అలంకరణలు చేపట్టిన భక్తులు విశేష పూజలు నిర్వహిస్తున్నారు. ఇక విజయదశమిని పురస్కరించుకుని ఆదివారం జిల్లాలోని అన్ని ఆలయాల్లో దుర్గమ్మను భక్తిశ్రద్ధలతో పూజించేందుకు సిద్ధమయ్యారు.
ఆదివారం మధ్యాహ్నం 1.30 నుంచి 2.20 గంటల్లోపు నవమి నిష్ర్కమించి విజయదశమి ఆరంభమవుతున్న శుభ సందర్భాన చేపట్టే కార్యక్రమాలు విజయవంతమవుతాయని ప్రముఖ పండితులు తెలకపల్లి రఘురామశర్మ తెలిపారు. విజయదశమి రోజున జిల్లాలోని శ్రీశైలం, అహోబిలం, మంత్రాలయం, మహానంది తదితర ఆలయాల్లో విశిష్ట పూజలు జరగనున్నాయి. శ్రీశైలంలో విజయదశమి సందర్భంగా భ్రమరాంబికాదేవిని అత్యంత ఆకర్షణీయంగా అలంకరించి పురవీధుల్లో ఊరేగించనున్నారు.
అహోబిళ పుణ్యక్షేత్రంలో ప్రహ్లాద వరదుడికి ఆనందోత్సాహాల నడుమ ఊరేగింపు నిర్వహించనున్నారు. మంత్రాలయంలో రాఘవేంద్రస్వామికి రథోత్సవం నిర్వహిస్తారు. మహానందిలో శివపార్వతులను ప్రత్యేకంగా అలంకరించనున్నారు. జిల్లాలోని ఆలయాల్లో విజయదశమిని పురస్కరించుకుని చండీ హోమం, సప్తశతీ పారాయణం, పూర్ణాహుతి, కుంకుమార్చనలు చేయనున్నారు. సాయంత్రం రథోత్సవం నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
జిల్లాలో పుంజుకున్న
దసరా సందడి
గత రెండు నెలలుగా జిల్లా అంతటా సమైక్యాంధ్ర ఉద్యమం ఉద్ధృతంగా జరుగుతున్న నేపథ్యంలో బంద్‌లు, ధర్నాలు, రాస్తారోకోలతో దసరాకు సంబంధించిన వ్యాపారం స్తంభించింది. అయితే శనివారం ఆర్టీసీ బస్సులు డిపోలు వదిలి ఊర్లకు తరలివెళ్లడంతో సందడి పుంజుకుంది. వస్త్ర దుకాణాలలో కొనుగోళ్లు ఊపందుకున్నాయి. వ్యాపార కేంద్రాలైన కర్నూలు, నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు తదితర ప్రాంతాల్లో దసరా హుషారు కనిపించింది. జనం శనివారం రోజున విజయదశమి పూజా సామగ్రి, పిండి వంటకాలకు సంబంధించిన సరుకులను కొనుగోలు చేయడంతో ఆయా ప్రాంతాల్లో రద్దీ నెలకొంది.
జమ్మి చెట్టుకు అలంకరణలు: విజయదశమి సందర్భంగా జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో శివారుల్లోని జమ్మిచెట్లను ప్రత్యేకంగా అలంకరించారు. సాయంత్రం 6 గంటల నుంచి వేలాదిగా తరలివచ్చే జనం జమ్మివృక్షం చుట్టూ ప్రదక్షిణ చేసి జమ్మి పత్రాలను తీసుకెళ్లి పెద్దలకు సమర్పించి నమస్కరించే సాంప్రదాయం దసరా పండగలో విశేషం.