గార్ల(డోర్నకల్): మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలో విజయదశమి రోజు శనివారం జాతీయ జెండాను ఆవిష్కరించను న్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా గార్ల మండల కేంద్రంలో నిజాం నవాబు కాలం నుంచి జెండా ఆవిష్కరణ ఆనవాయితీగా వస్తోంది. అప్పట్లో స్థానిక మసీదు సెంటర్‌లో నిజాం అధికారిక జెండాను ఆవిష్కరించేవారు.
నిజాం పాలన ముగిసిన తర్వాత 1952లో సదరు గద్దెపై కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించారు. అయితే దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కమ్యూనిస్టులు కోర్టుకు వెళ్లారు. ఈ క్రమంలో కోర్టు సదరు గద్దెపై దేశభక్తికి చిహ్నంగా జాతీయ జెండాను ఎగురవేయాలని సూచించింది. దీంతో 1958లో తొలిసారి అప్పటి మున్సిపల్ చైర్మన్ మాటేడి కిషన్‌రావు జాతీయ జెండాను ఎగుర వేశారు. నాటి నుంచి నేటి వరకు గార్ల మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్, మొదటి పౌరుడు అదే ఆనవాయితీని కొనసాగిస్తున్నారు.