ఒంగోలు సెంట్రల్: ఒంగోలు నగరంలో విజయ దశమి నుంచి సిటీ బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు రాష్ట్ర రోడ్డు రవాణ శాఖ మంత్రి శిద్దారాఘవరావు తెలిపారు. నగరంలోని తన నివాసంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణికులకు మెరుగైన సేవలందించేందుకు 500 నూతన బస్సులను అన్ని డిపోల్లో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఒంగోలు నుంచి చెన్నై, చీరాల నుంచి బెంగళూరుకు రెండు సూపర్‌లగ్జరీ బస్ సర్వీసులను మంగళవారం ప్రారంభిస్తున్నామన్నారు.
అదే విధంగా దర్శి నుంచి 5 పల్లెవెలుగు సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. దర్శి నుంచి దొనకొండకు వయా వెంకటాపురం, పొదిలి నుంచి దర్శికి వయా వేముల, కురిచేడు నుంచి దర్శికి వయా పొట్లపాడు, ఒంగోలు నుంచి పిడతలపూడికి వయా చీమకుర్తి, పొందూరు నుంచి టంగుటూరుకు వయా మల్లవరం, తూర్పునాయుడుపాలేలకు సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ప్రతి డిపోకు పది పల్లెవెలుగు బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
‘ఎన్‌టీఆర్ సుజల’ ప్రారంభానికి చర్యలు
ఎన్‌టీఆర్ సుజల పథకాన్ని అక్టోబర్ 2 నుంచి ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర రవాణ శాఖ మంత్రి శిద్దా రాఘవరావు తెలిపారు. నగరంలోని తన నివాసంలో ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజినీర్లతో సోమవారం మంత్రి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మొదటి దశలో మండలానికి ఒక గ్రామంలో ఎన్‌టీఆర్ సుజల పథకాన్ని ప్రారంభించడానికి ఇంజినీరింగ్ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా వెయ్యి లీటర్ల మంచి నీటిని అందించేందుకు మిషనరీ, నిర్మాణ వ్యయం రూ.3 లక్షలు అవుతుందన్నారు.
రెండో దశలో అన్ని గ్రామాల్లో తాగునీటి రక్షిత పథకాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్‌టీఆర్ సుజల పథకం ఏ గ్రామాల్లో ఏర్పాటు చేయాలో స్థానిక శాసనసభ్యుల సహకారం తీసుకోవాలన్నారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో ఆర్‌డబ్ల్యూఎస్ సూపరింటెండెంట్ ఇంజినీర్ వీవీఎస్‌మూర్తి, పొదిలి ఆర్‌డబ్ల్యూస్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.
ఒంగోలులో దసరా నుంచి సిటీ బస్సులు
Published Tue, Sep 9 2014 1:33 AM | Last Updated on Sat, Sep 2 2017 1:04 PM
Advertisement