సాక్షి, ఒంగోలు : ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మంగళవారం జిల్లా పర్యటనకొస్తున్నారు. జిల్లాలో రెండుచోట్ల అధికారిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఆ రోజు ఉదయాన్నే 10 గంటలకు పర్చూరుకు చేరుకోనున్న చంద్రబాబు అక్కడ పొలం పిలుస్తోంది.. జన్మభూమి - మాఊరు కార్యక్రమాల్లో పాల్గొంటారు. భోజన విరామం అనంతరం సాయంత్రం మూడు గంటలకు ఒంగోలు చేరుకుంటారు.
స్థానిక మినీస్టేడియం ఆవరణలో ఏర్పాటుచేసిన జన్మభూమి కార్యక్రమానికి హాజరై రాత్రి బస కూడా నగరంలోనే చేస్తారని జిల్లా మంత్రి శిద్దా రాఘవరావు వెల్లడించారు. ముఖ్యమంత్రి కార్యక్రమ ఏర్పాట్లపై జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌చార్జులతో మంత్రి ఆదివారం తన నివాసంలో సమీక్షించారు. జిల్లా అభివృద్ధికి సంబంధించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాలపై చర్చించారు.
అనంతరం విలేకరులతో శిద్దా రాఘవరావు మాట్లాడుతూ అభివృద్ధి ప్రతిపాదనల్లో ప్రభుత్వం జిల్లాపై చిన్నచూపు చూస్తోందని కొందరు పనిగట్టుకుని విమర్శించడం మంచిదికాదన్నారు. జిల్లాలో స్మార్ట్‌సిటీ, ఎయిర్‌పోర్టు, రామాయపట్నం పోర్టుతో పాటు దొనకొండలో అతిపెద్ద పారిశ్రామిక వాడ ఏర్పాటుకానుందని వివరించారు. అధికార పగ్గాలు చేపట్టే సమయంలో పార్టీ అధినేత చేసిన ఐదు సంతకాలు అమల్లోకి వచ్చాయని చెప్పారు.
జిల్లాలో జన్మభూమి, ఎన్టీఆర్ సుజల స్రవంతి, ఎన్టీఆర్ భరోసా పేరిట పింఛన్‌ల పంపిణీ కార్యక్రమాలు విజయవంతంగా జరుగుతున్నాయన్నారు. వెలిగొండ ప్రాజెక్ట్ మొదటి దశ పనులు పూర్తిచేయడం, గుండ్లకమ్మ ప్రాజెక్ట్‌ను వినియోగంలోకి తీసుకొచ్చేందుకు పనులు శరవేగంగా జరుగుతున్నాయని వివరించారు. శనగ రైతుల సమస్యను కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు. దొనకొండ పారిశ్రామికవాడకు అందుబాటులో 74 వేల ఎకరాల భూమి ఉండగా, ఇప్పటికే 28 వేల ఎకరాలను సద్వినియోగం చేసేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని మంత్రి చెప్పారు.
ఒకరిద్దరు బడా పారిశ్రామికవేత్తలు కూడా ముందుకొచ్చినట్లు చెబుతూ.. త్వరలోనే దొనకొండ పారిశ్రామిక అభివృద్ధిపై ప్రత్యేక కమిటీ వేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, డాక్టర్ డోలా బాలవీరాంజనేయస్వామి, పార్టీ నేతలు కరణం బలరాం, ఆయన కుమారుడు వెంకటేష్, కందుల నారాయణరెడ్డి, బీఎన్ విజయకుమార్, అజిత, దివి శివరాం తదితరులు పాల్గొన్నారు.
సభాప్రాంగణం పరిశీలన
ఒంగోలు సెంట్రల్ : స్థానిక మినీస్టేడియంలో సీఎం చంద్రబాబు పాల్గొనే సభాప్రాంగణాన్ని మంత్రి శిద్దా రాఘవరావు పరిశీలించారు. సీఎం సభకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని ఆయన వెంట ఉన్న ఎస్పీ శ్రీకాంత్‌ను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా బారికేడ్లు నిర్మించాలని ఇంజినీరింగ్ అధికారులతోచెప్పారు.
భద్రత పటిష్టం: ఎస్పీ
పర్చూరు : సీఎం చంద్రబాబు పర్యటనకు గట్టి భద్రత చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ శ్రీకాంత్ తెలిపారు. ఆదివారం స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డుకు వచ్చిన ఆయన.. సీఎం పర్యటన రూట్ మ్యాప్‌పై పోలీస్ అధికారులతో చర్చించారు. అక్కడ ఏర్పాటు చేస్తున్న హెలిప్యాడ్‌ను పరిశీలించారు. ఆనంతరం వైఆర్ హైస్కూల్‌లో ఏర్పాట్లను పరిశీలించారు.
విద్యార్థులతో సీఎం మాట్లాడే అవకాశం ఉందన్నారు. పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా సీఎం పరిశీలించే నాగులపాలెంలోని పత్తి పొలం వద్దకు ఎస్పీ చేలగట్లు దాటుకుంటూ వెళ్లారు. ఆయనతో పాటు ఏఎస్పీ రామానాయక్, డీఎస్పీ లక్ష్మీనారాయణ, ఇంటిలిజెన్స్ సెకూ్యురిటీ డీఎస్పీ నాగేశ్వరరావు, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ తిరుమలరావు, ఇంకొల్లు సీఐ సత్యకైలాస్‌నాథ్, ఎస్సై మాధవరావు ఉన్నారు.
సీఎం పర్యటన ఇలా..
ఒంగోలు టౌన్ : ఉదయం 9.30 గంటలకు హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరతారు.
10.45 గంటలకు పర్చూరు మార్కెట్ యార్డులో దిగుతారు.
11.00 నుంచి 11.30 గంటల వరకు అక్కడి వైఆర్ హైస్కూల్‌లో బడిపిలుస్తోంది కార్యక్రమంలో పాల్గొంటారు.
11.30 నుంచి 12.00 గంటల వరకు పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా రైతులతో సమావేశం అవుతారు.
మధ్యాహ్నం 12.00 గంటల నుంచి 2.00గంటల వరకు జన్మభూమి - మా ఊరు గ్రామసభలో పాల్గొంటారు.
2.00 నుంచి 3.00 గంటల వరకు రిజర్వ్‌డు
3.00 గంటలకు పర్చూలోని హెలిపాడ్ వద్దకు చేరుకుంటారు.
3.25 గంటలకు హెలికాప్టర్ ద్వారా ఒంగోలు పోలీసు ట్రైనింగ్ కాలేజీలోని హెలిపాడ్ వద్ద దిగుతారు.
3.30 గంటలకు మినీ స్టేడియం చేరుకుంటారు.
3.30 గంటల నుంచి సాయంత్రం 6.00 గంటల వరకు జన్మభూమి - మా ఊరు గ్రామసభ, అక్షర విజయం సక్సెస్‌మీట్‌లో పాల్గొంటారు.
6.30 గంటలకు మినీ స్టేడియం నుంచి ఎన్‌ఎస్‌పీ గెస్ట్‌హౌస్‌కు బయల్దేరతారు.
6.45 గంటలకు ఎన్‌ఎస్‌పీ గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు.
7.00 నుంచి 8.00గంటల వరకు రిజర్వ్‌డ్. రాత్రికి అక్కడే బస చేస్తారు.
8వ తేదీ ఉదయం 9.45 గంటలకు ఒంగోలు పోలీసు ట్రైనింగ్ కాలేజీలోని హెలిపాడ్ వద్దకు చేరుకొని అక్కడి నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి వెళ్తారు.
సీఎం పర్యటన ఏర్పాట్లు ముమ్మరం
Published Mon, Oct 6 2014 2:34 AM | Last Updated on Wed, Aug 29 2018 3:33 PM
Advertisement
Advertisement