=నగరానికి ప్రత్యామ్నాయ జల వనరులు
=దృష్టి సారించిన బెంగళూరు జల మండలి
=సర్కార్‌కు పలు సూచనలిచ్చిన ‘త్యాగరాజన్’
=‘లింగనమక్కి’ నుంచి నీరు మళ్లింపు
=నీటి వృథాను అరికడితే కొంత ఊరట
=‘బారాపూలె’ నీటిని సద్వినియోగం చేసుకోవాలి
=పలు నదులపై ఆనకట్టలు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రత్యామ్నాయ జల వనరులపై ఇప్పటి నుంచే దృష్టి పెట్టాలని బీఎన్. త్యాగరాజన్ నేతృత్వంలోని కమిటీ ప్రభుత్వానికి సూచించింది. భవిష్యత్తులో నగర నీటి అవసరా దృష్ట్యా అవసరమైన జల వనరులను గుర్తించడానికి ప్రభుత్వం నియమించిన ఈ కమిటీ ఇటీవల నివేదికను సమర్పించింది. బెంగళూరు జల మండలి అధ్యక్షుడుగా పని చేసి రిటైరైన త్యాగరాజన్ నివేదిక ప్రకారం...2051 నాటికి నగర జనాభా 3.45 కోట్లకు చేరుతుంది. వైశాల్యం ప్రస్తుతం ఉన్న 800 చదరపు కిలోమీటర్ల నుంచి 1,500కు పెరుగుంది. అప్పట్లో నగరానికి ఏటా 88.25 టీఎంసీల నీరు అవసరమవుతుంది.కమిటీ సూచించిన ప్రత్యామ్నాయాలు...
కావేరి నుంచి
కావేరి న్యాయ పంచాయతీ తుది తీర్పు అనంతరం రాష్ట్రానికి 270 టీఎంసీల నీటి కేటాయింపు జరిగింది. ఇందులో 250.62 టీఎంసీలు వ్యవసాయానికి పోతుంది. 1.85 టీఎంసీలను ఇతర అవసరాలకు నిర్ణయిస్తూ, మిగిలిన 17.64 టీఎంసీలను రాష్ట్ర విచక్షణకు వదిలి వేశారు. ఇందులో 12.88 టీఎంసీల నీటిని నగరానికి కేటాయించాలి.
లింగనమక్కి నుంచి...
శివమొగ్గ జిల్లా సాగర తాలూకా లింగనమక్కి జలాశయం నుంచి దశాబ్దానికి పది టీఎంసీల చొప్పున దశలవారీ 30 టీఎంసీల నీటిని నగరానికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేపట్టాలి. ప్రస్తుతం అక్కడ జల విద్యుదుత్పాదన జరుగుతోంది. తాగు నీటికి తొలి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉన్నందున, విద్యుదుత్పాదనను ఇతర మార్గాల ద్వారా చేపట్టవచ్చు. లింగనమక్కి నుంచి టీజీ హళ్లి మీదుగా నగరానికి పది టీఎంసీలు సరఫరా చేయడానికి రూ.12,500 కోట్లు అవసరమవుతుంది.
వృథా అరికడితే...
ప్రస్తుతం జల మండలి ద్వారా సరఫరా అవుతున్న నీటిలో సుమారు 50 శాతం వరకు లెక్కలు తేలకుండా వృథా అవుతోంది. దీనిని 16 శాతానికి తగ్గించగలిగితే నాలుగు టీఎంసీల నీటిని ఆదా చేయవచ్చు.
బారాపూలె నుంచి...
కొడగు జిల్లాలో పుట్టి కేరళ ద్వారా సముద్రంలో కలుస్తున్న బారాపూలె నీటిని సద్వినియోగం చేసుకోవాలి. నీటి పారుదుల శాఖ అంచనా ప్రకారమే ఇక్కడి నుంచి పది టీఎంసీలను లక్ష్మణతీర్థ వదృ్ద కష్ణరాజ సాగర్ జలాశయానికి మళ్లించవచ్చు. రెండేళ్లలో రూ.వంద కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును పూర్తి చేయవచ్చు.
హేమావతి నుంచి...
చిన్న నీటి పారుదల శాఖ హేమావతి జలాశయం ఎడమ కాలువ ద్వారా పంటలకు నీరు సరఫరా చేయని పక్షంలో ఐదు టీఎంసీల నీటిని కుణిగల్, బుడగనహళ్లి చెరువులకు మళ్లించవచ్చు. అక్కడి నుంచి హెసరఘట్ట, తిప్పగొండనహళ్లి జలాశయాలకు పంప్ చేయడం ద్వారా బెంగళూరుకు తరలించవచ్చు. అయితే దీని వల్ల 73 వేల ఎకరాలకు సాగు నీరు అందకుండా పోతుంది.
ఎత్తినహొళె నుంచి...
పశ్చిమ దిశగా ప్రవహిస్తున్న ఎత్తినహొళె తదితర నదులపై ఆనకట్టలను నిర్మించడం ద్వారా తుమకూరు వరకు 24 టీఎంసీల నీటిని తరలించడానికి నీటి పారుదల శాఖ పథకాన్ని సిద్ధం చేసింది. ఇందులో పది టీఎంసీలను బెంగళూరుకు ఇవ్వాల్సిందిగా నిపుణుల కమిటీ కోరింది. దీనికి ప్రభుత్వం సమ్మతిస్తే జల మండలి ఆ నీటిని వినియోగించుకునే ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం నగరానికి రోజూ 1.4 కోట్ల లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నారు. దీనికి ఏటా 18.8 టీఎంసీల నీరు అవసరమవుతుంది.