ఐసీయూలో అంబరీష్
- ఆస్పత్రి ఎదుట అభిమానుల ధర్నా
- ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు : సిద్దరామయ్య
బెంగళూరు, న్యూస్‌లైన్ : శ్యాండిల్‌వుడ్ రెబల్‌స్టార్, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి అంబరీష్ అనారోగ్యంతో ఇక్కడి విక్రమ్ ఆస్పత్రి ఐసీయులో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం రాత్రి అస్వస్థతకు గురైన అంబరీష్‌ను వెంటనే ఆయన సతీమణి సుమలత పాటు కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
విక్రమ్ ఆస్పత్రికి శ్వాసకోస వైద్య నిపుణుడు సతీష్ నాయక్, గుండె వైద్య నిపుణుడు డాక్టర్ రంగనాథ్, కిడ్ని వైద్య నిపుణుడు రవీష్‌లు అంబరీష్‌కు వైద్యం అందిస్తున్నారు. శ్వాస తీసుకోవడంలో సమస్య ఎదురవుతోందని వైద్యులు తెలిపారు. శనివారం సాయంత్రం వైద్యులు సతీష్ నాయక్, రంగనాథ్, రవీష్‌లు విలేకరులతో మాట్లాడారు. అంబరీష్ కోలుకుంటున్నారని చెప్పారు. అంబరీష్ ఐసీయూలో ఉండటం వల్ల ఎవ్వరూ ఆందోళన చెందన వసరం లేదని, ఆయన ఆరోగ్యం కుదుటపడుతోందని వారు అన్నారు.
తరలి వచ్చిన నాయకులు.. నటులు
ముఖ్యమంత్రి సిద్దరామయ్య, హోం శాఖ మంత్రి కే.జే. జార్జ్ తదితరులు విక్రమ్ ఆస్పత్రికి వచ్చి అంబరీష్ ఆరోగ్యంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సిద్దు విలేకరులతో మాట్లాడుతూ... డాక్టర్ల సమాచారం మేరకు అంబరీష్ ఐసీయూలో ఆరోగ్యంగానే ఉన్నారని అన్నారు. అంబరీష్‌ను పరామర్శించడానికి హ్యాట్రిక్ హీరో శివరాజ్‌కుమార్, క్రేజీస్టార్ రవిచంద్రన్, భారతీ విష్ణువర్దన్‌తో సహ పలువురు నటినటులు ఆస్పత్రికి చేరుకుని వైద్యులతో మాట్లాడారు. ఇదిలా ఉంటే అంబరీష్ ఆరోగ్య విషయంపై ఆందోళన చెందిన ఆయన అభిమానులు వందలాది మంది ఆస్పత్రికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తమ అభిమాన నాయకుడిని చూడటానికి అవకాశం ఇవ్వాలని మండ్యకు చెందిన అభిమానులు ఆస్పత్రి వద్ద ధర్నా నిర్వహించారు.