‘ఆమ్నీ’లో చార్జీల మోత | Amni buses Charges hiked in chennai | Sakshi
Sakshi News home page

‘ఆమ్నీ’లో చార్జీల మోత

Published Wed, Aug 27 2014 1:58 AM | Last Updated on Sat, Sep 2 2017 12:29 PM

‘ఆమ్నీ’లో చార్జీల మోత

‘ఆమ్నీ’లో చార్జీల మోత

రాష్ట్రంలో మళ్లీ ఆమ్నీ బస్సుల్లో చార్జీలు పెరగనున్నాయి. రూ.50 నుంచి రూ.70 మేరకు టికెట్ల ధరను ఆయా ట్రావెల్స్ యాజమాన్యాలు పెంచేందుకు సిద్ధమయ్యాయి. దీంతో ప్రయాణికుల మీద అదనపు భారం పడనుంది. డీజిల్ ధరల పెరుగుదల, టోల్ ట్యాక్స్‌ల పెంపు వెరసి చార్జీలను పెంచక తప్పడం లేదని ఆమ్నీ యాజమాన్యాల సంఘం కోశాధికారి మారన్ స్పష్టం చేశారు.
 
 సాక్షి, చెన్నై:రాష్ట్ర రాజధాని నగరం చెన్నై నుంచి దక్షిణాది జిల్లాలకు, నగరాలకు, పట్టణ కేంద్రాలకు అటు ప్రభు త్వ, ఇటు ప్రైవేటు బస్సులు నిత్యం పరుగులు తీస్తుం టాయి. పక్క రాష్ట్రాల్లోని బెంగళూరు, మైసూరు, విజ యవాడ, విశాఖ పట్నం, హైదరాబాద్, కర్నూలుతోపాటు ముంబై వంటి ఉత్తరాది నగరాలకు ఈ బస్సులు నడుస్తున్నాయి. ప్రభుత్వ బస్సుల మీద కన్నా, ప్రైవేటు బస్సులను ఆశ్రయించే వారు అధికం. సౌకర్యం, సుఖమయ ప్రయాణం ఓవైపు, అతి వేగంగా దూసుకెళుతూ త్వరితగతిన గమ్యస్థానాలకు చేర్చడం మరో వైపు వెరసి అత్యధిక శాతం ప్రయాణికుల దృష్టిలో ఆమ్నీ బస్సులు పడ్డాయి.
 
 ఓల్వో, హైటెక్, డీలక్స్, సూపర్, సెమి డీలక్స్ ఇలా ప్రైవేటు హంగులతో ఉండే ఈ బస్సుల్లో చార్జీలు వసతులకు తగ్గట్టుగానే ఉంటాయి. ఇటీవల ప్రమాదాల నివారణ అడ్డుకట్ట లక్ష్యంగా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు, ఆంక్షల మేరకు బస్సుల్లో సౌకర్యాలు మరింత పెరిగాయి. దీన్ని సాకుగా చూపుతూ మేలో రూ.20 నుంచి రూ.50 వరకు చార్జీలను ఈ బస్సుల యాజమాన్యాలు వడ్డించాయి. తాజాగా డీజిల్ ధరల పెంపు, పెరిగిన టోల్ చార్జీలు తదితర కారణాలను ఎత్తి చూపుతూ మరోమారు చార్జీల్ని పెంచేందుకు ఆమ్నీ యాజమాన్యాలు సిద్ధమయ్యాయి.
 
 చార్జీల వడ్డన : సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి కొత్త టోల్ చార్జీలు అమల్లోకి రానున్నాయి. రాష్ట్రంలో దక్షిణాది జిల్లాల వైపుగా వెళ్లే బస్సులకు నాలుగు లేదా ఐదు టోల్ గేట్లు ఎదురవుతాయి. ఈ టోల్ ఫీజులతో పాటుగా డీజిల్ ధర తరచూ పెరుగుతుండడంతో చార్జీల్ని పెంచాలన్న నిర్ణయానికి ఆమ్నీ యాజమాన్యాలు వచ్చాయి. డీలక్స్ ఓల్వో, బెర్త్ సౌకర్యం కలిగిన బస్సుల్లో రూ.50 నుంచి 70 వరకు చార్జీల్ని పెంచేందుకు సిద్ధమయ్యాయి. ప్రస్తుతం  చెన్నై నుంచి మదురైకు  డీలక్స్ బస్సుల్లో రూ.600, ఓల్వోల్లో రూ.800, బెర్త్ సీట్స్‌కు రూ.860 వసూలు చేస్తున్నారు.
 
 ఈ చార్జీలకు అదనంగా రూ. 50 నుంచి 70 వరకు పెరగనున్నాయి. ఇదే రకంగా మిగిలిన ప్రాంతాలకు చార్జీలు వడ్డించనున్నారు. దీపావళి ముందస్తు రిజర్వేషన్ పేరిట ఈ చార్జీలను అమల్లోకి తీసుకురాబోతున్నామని యాజమాన్య సంఘాలు పేర్కొంటున్నా, ఇప్పటికే ట్రావెల్స్ యాజమాన్యాల చార్జీల్లో రూ.పది నుంచి ఇరవై వరకు పెంచి ఉన్నాయి. తాజా పెంపు నిర్ణయంతో మరింతగా వసూళ్లు పెరగనున్నాయి.
 
 తప్పడం లేదు: చార్జీల పెంపు తప్పడం లేదని ఆమ్నీ బస్సు యాజమాన్యాల సంఘం కోశాధికారి మారన్ స్పష్టం చేశారు. డీజిల్ ధరలు తరచూ పెరుగుతున్నాయని వివరించారు. తాజాగా, టోల్ ఫీజులను 35 శాతం మేరకు పెంచారని పేర్కొన్నారు. ఇది వరకు ఓ టోల్ గేట్‌లో రూ.150 చెల్లించే వాళ్లమని, ప్రస్తుతం రూ.225 చెల్లించాల్సి వస్తోందన్నారు. ఇన్సూరెన్స్ రుసుం పెరగడం, కేంద్ర ప్రభుత్వం ఐదు శాతం సేవా పన్ను విధించడం వెరసి తమ మీద అదనపు భారం పడుతోందని వివరించారు. అనేక యాజమాన్యాలు బస్సులను నడిపేందుకు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
 
 ఆమ్నీ బస్సులు రోడ్డెక్కలేని పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయని, అన్ని సమస్యలు, పరిస్థితుల్ని అధిగమించి బస్సులు నడపాలా? అన్న డైలమాలో ఎందరో యజమానులు ఉన్నారని వివరించారు. కొందరు యాజమాన్యాలు సంక్లిష్ట పరిస్థితుల్లో బస్సులు నడుపుతుంటే, ప్రభుత్వాల నిర్ణయాలు నష్టాల్లోకి నెడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాజా పరిస్థితులతో చార్జీల వడ్డన తప్పడం లేదన్నారు. ప్రస్తుత చార్జీలకు రూ.50 అదనంగా పెంచాలని నిర్ణయించామని, దీపావళి ముందస్తు  రిజర్వేషన్ సమయంలో ఈ పెంపు వర్తింప చేయబోతున్నామని పేర్కొన్నారు. దీపావళి రిజర్వేషన్ అని యాజమాన్యాలు పేర్కొంటున్నా, దీపావళికి హౌస్‌ఫుల్ బోర్డులతో మరింత అదనపు చార్జీలను వడ్డించడం ఆమ్నీ యాజమాన్యాలకు పరిపాటే. ఈ దృష్ట్యా, తాజా చార్జీల వడ్డన అమల్లోకి వచ్చినట్టే!  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement