ఏపీ ప్రజలు మంచి పారిశ్రామికవేత్తలు: జైట్లీ
ఏపీ ప్రజలు మంచి పారిశ్రామికవేత్తలు: జైట్లీ
Published Fri, Oct 28 2016 4:33 PM | Last Updated on Sat, Jun 2 2018 2:23 PM
ఆంధ్రప్రదేశ్ ప్రజలు మంచి పారిశ్రామిక వేత్తలని, ఆ విషయం ఇప్పటికే నిరూపితమైందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. వాళ్ల ముందడుగుతో రాష్ట్రం త్వరలోనే మరిన్ని వెలుగులు చూస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ కోర్ క్యాపిటల్ నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు లింగాయపాలెం వచ్చిన ఆయన.. అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఆయన ఏమన్నారంటే...
''ఇద్దరికి ప్రధానంగా అభినందనలు. ముందుగా ఈ ప్రాంత రైతులు.. చరిత్రలో తొలిసారిగా వాళ్లు ఎప్పుడూ లేనట్లుగా తమ భూములను రాష్ట్ర రాజధాని కోసం ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రికార్డు సమయంలో రాజధాని నిర్మాణానికి మొత్తం ఏర్పాట్లన్నింటినీ పూర్తి చేశారు. అందుకని రైతులను, ముఖ్యమంత్రిని అభినందిస్తున్నాను. విభజనకు వ్యతిరేకంగా అప్పట్లో కొందరు పోరాడారు. చంద్రబాబు, వెంకయ్య ఆ సమయంలో రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు మంచి ప్యాకేజి కావాలని అడిగారు. సుజనాచౌదరి, సీఎం రమేష్ రాష్ట్ర ప్రజల గొంతును పార్లమెంటులో గట్టిగా వినిపిస్తూ వెంకయ్య మాటలకు అడ్డుతగిలారు. కొత్త రాజధాని అత్యాధునికంగా తయారవుతుందన్న విశ్వాసం నాకుంది. సీఎం చైనా, జపాన్, దావోస్, అమెరికా.. అన్నిదేశాలూ తిరుగుతూ వనరుల సేకరణకు ప్రయత్నిస్తున్నారు
హైదరాబాద్‌ను ఎలా అధునాతనంగా రూపొందించారో, గుంటూరు ప్రాంతంలోనూ మంచి రాజధాని రూపొందించే అవకాశం మీకు దొరికింది. ఇందులో మీకు కేంద్రప్రభుత్వం కూడా తగినంత సాయం చేస్తుంది. మొదటి ఐదేళ్లలో 2.03 లక్షల కోట్లు ఇస్తామని నేను ఇంతకుముందే చెప్పాను. 2004 నుంచి 2009 వరకు ఏపీకి 34వేల కోట్లు కేంద్రం నుంచి వచ్చాయి. 2009 నుంచి 2014 వరకు ఐదళ్లలో 64వేల కోట్ల సాయం వచ్చింది. కానీ మోదీ పాలనలోని ఐదేళ్లలో ఏపీకి కేవలం ఆర్థికసంఘం, ఇతర నిధుల కింద రూ. 2.03 లక్షల కోట్లు ఇస్తున్నాం.
జాతీయస్థాయి విద్యాసంస్థలు మరికొన్నింటిని కూడా ఆంధ్రప్రదేశ్‌కు మంజూరు చేస్తాం. రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తరణ, పలు పరిశ్రమల మంజూరుకు కేంద్రం ప్రయత్నిస్తుంది. భూసేకరణ పూర్తయితే విజయవాడ విమానాశ్రయం కూడా అత్యాధునికంగా రూపొందుతుంది. రాష్ట్రంలో ప్రతి ప్రాంతానికీ సాగునీరు అందించేందుకు పోలవరం ప్రాజెక్టుకు నాబార్డు ద్వారా నిధులిస్తున్నాం. కేంద్రం నుంచి 90:10 నిష్పత్తిలో రావాల్సిన నిధులన్నింటినీ ప్రత్యేక ప్యాకేజితో ఇప్పటికే అందిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మంచి పారిశ్రామికవేత్తలు. రైతులు అందించిన సాయం, పారిశ్రామికవేత్తల ముందడుగుతో రాష్ట్రం అద్భుతంగా వెలుగుతుందని ఆశిస్తున్నాను. రైతులు తమ భూములను అమ్ముకుంటే వారికి పడే కేపిటల్ గెయిన్ టాక్స్ విషయాన్ని పలువురు ప్రశ్నించారు. దానికి వీలైనంత త్వరలో పరిష్కారం చూసే ప్రయత్నం చేస్తాను. ఏపీ ప్రజల ముఖాల్లో చిరునవ్వులు చిందేందుకు అందరం కలిసి ప్రయత్నం చేద్దాం''
Advertisement
Advertisement