
26న ఎయిర్‌పోర్టుపై దాడి!
సాక్షి, ముంబై: ముంబై విమానాశ్రయంపై దాడి చేస్తామంటూ మరోసారి హెచ్చరికలు వచ్చాయి. ఈసారి లేఖ రూపంలో కాకుండా ముంబై విమానాశ్రయంలోని ఓ టాయిలెట్ (మూత్రశాల) గోడపై ఈ హెచ్చరికను రాశారు. ఐఎస్‌ఐఎస్ పేరుతో గోడపై రాసిన సందేశంలో గణతంత్ర దినోత్సవం 26వ తేదీన దాడి చేస్తామని పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల్లో దాడులు చేయనున్నామంటూ గత కొన్ని రోజులుగా ఉగ్రవాద సంస్థల పేర్లతో అనేక హెచ్చరికలు వస్తున్నాయి.
అలాంటిదే ముంబై విమానాశ్రయం టాయిలెట్ గోడపై అనే సందేశం కన్పించింది. ఇది ఎవరు రాశారో తెలియరాలేదు. ఇంతకుముందు కూడా ఈ నెల 7న ముంబై విమానాశ్రయంలో ఓ టాయిలెట్ గోడపై ‘అటాక్ బై ఐఎస్‌ఐఎస్ 10.01.15’ అని హెచ్చరికలు రాశారు. కానీ 10వ తేదీన ఎలాంటి ఘటన జరగలేదు. దీంతో తాజాగా హెచ్చరికను కూడా పెద్దగా పరిగణించాల్సిన అవసరం లేదని కొందరు వాదిస్తున్నారు. అయినప్పటికీ ముంబైలో పోలీసులను అప్రమత్తం చేశారు.