మరో రెండు హార్బర్లు
చెన్నై, సాక్షి ప్రతినిధి: రాష్ట్రంలో చెన్నై, తూత్తుకుడి, ఎన్నూరు, నాగపట్నం, కడలూరు, రాయపురం, కాట్టుపల్లి తదితర పోర్టులు ఉన్నాయి. వీటిలో వర్తక, వాణిజ్యంతోపాటూ ఫిషింగ్ హార్బర్లుగా కొన్ని ప్రసిద్ధికెక్కాయి. వీటితోపాటూ రామేశ్వరం, ధనుష్‌కోటిలలో హార్బర్లు నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ రెండు ప్రాంతాల్లోని మత్స్యకారులను మరింత ఎక్కువగా చేపలవేటకు ప్రోత్సహించే నిమిత్తం రెండు కొత్త హార్బర్ల ప్రాంత సముద్రం లో చేప పిల్లలను పెద్ద సంఖ్యలో వదులుతారు. మత్స్యకార శాఖ పరిధిలోని సంక్షేమ, అభివృద్ధి పథకాల్లో ఈ రెండు ప్రాంత హార్బర్ల పరిధిలోని మత్స్యకారులకు ప్రాధాన్యత కల్పిస్తారు. కొత్త హార్బర్ల నిర్మాణంపై సాగుతున్న సర్వే నిమిత్తం రాష్ట్ర మత్స్యశాఖ డెరైక్టర్ బీలారాజేష్ ఇటీవల రామేశ్వరం, ధనుష్‌కోటిలలో పర్యటించారు. అక్కడి మత్స్యకారులతో ఏర్పడిన అనుభవాలను బుధవారం మీడియాకు వివరించారు.