హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి : రావెల
మడకశిర : రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు తెలిపారు. కేంద్రంలో తమ మిత్రపక్షమైన బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ వివిధ రకాలుగా ఒత్తిడి తీసుకొచ్చి ప్రజల పక్షాన నిలబడతామన్నారు.
అనంతపురం జిల్లాలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఓటుకు కోట్లు కేసుపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. ఈ కేసులో ఆడియో, వీడియో టేపులు చెల్లవని సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ ప్రతిపక్షాలు బురదజల్లుతున్నాయన్నారు. స్టింగ్ ఆపరేషన్లు చట్టవిరుద్ధమని ఆయన అన్నారు. సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని శరవేగంగా అభివద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. రక్షకతడుల ద్వారా అనంతపురం జిల్లా వ్యాప్తంగా వేరుశనగను కాపాడడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే ఈరన్న, ఎమ్మెల్సీ తిప్పేస్వామి పాల్గొన్నారు.