ఆకర్ష అన్నభాగ్య | apl strategy to attract cardholders | Sakshi
Sakshi News home page

ఆకర్ష అన్నభాగ్య

Published Thu, Feb 5 2015 1:28 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

apl strategy to attract cardholders

ఏపీఎల్ కార్డుదారులను ఆకర్షించే వ్యూహం
రూ. 10కి కిలో బియ్యం
రూ.5కే ఐదు ఇడ్లీలకు ఓకే
సీఎల్పీలో ఆమోదం

 
బెంగళూరు :  కాంగ్రెస్ పార్టీకి దూరమైన మధ్య తరగతి ప్రజలను తిరిగి ఆకర్షించే చర్యల్లో భాగంగా ఏపీఎల్ కార్డుదారులకూ అన్నభాగ్య పథకాన్ని విస్తరించాలని రాష్ర్ట ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా విధానసౌధలో ముఖ్యమంత్రి అధ్యక్షతన బుధవారం జరిగిన సీఎల్పీ సమావేశంలో ముమ్మర చర్చ జరిగింది. మెజారిటీ సభ్యులతో పాటు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా ఈ పథకానికి ఆమోదం తెలపడంతో అమలుకు మార్గం సుగమమైంది. రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీపీఎల్ కార్డుదారులకు కుటుంబసభ్యుల సంఖ్యను అనుసరించి రూ. 1కే కిలో బియ్యం అందజేసే అన్నభాగ్య పథకాన్ని ప్రవేశపెట్టారు. అప్పటి వరకూ ఏపీఎల్ కార్డుదారులకు రాయితీపై ఇస్తున్న బియ్యం కోటాను ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో మధ్య తరగతి ప్రజలు కాంగ్రెస్‌పై వ్యతిరేకతను పెంచుకున్నారు. దీని ఫలితం  లోకసభ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తిరిగి మధ్య తరగతి ప్రజల ఓట్లను ఆకర్షించేలా అన్నభాగ్యను విస్తరించాలని ప్రభుత్వం యోచన చేసింది. కిలో బియ్యం రూ. 10 చొప్పున కుటుంబసభ్యుల సంఖ్యను అనుసరించి ఏపీఎల్ కార్డుదారులకు సరఫరా చేయాలని నిర్ణయానికి వచ్చారు. మరోసారి అధికారులతో చర్చించి ఒక్కొక్కరికి ఎన్ని కిలోల చొప్పున ఇవ్వాలనే విషయంపై స్పష్టత తీసుకోనున్నట్లు సమాచారం. అదేవిధంగా రేషన్‌షాపుల ద్వారా రూ.30లకు కిలో కందిపప్పు, రూ.25 కిలో డాల్డా, రూ.2లకు కిలో అయోడైజ్డ్ ఉప్పును వితరణ చేయాలనే ప్రస్తావనకు కూడా అనుమతి లభించింది.

రూ.5లకు ఐదు ఇడ్లీకు ఓకే..

పేదలకు పౌష్టికాహారాన్ని అందించే చర్యల్లో భాగంగా ప్రభుత్వ క్యాంటీన్లు ఏర్పాటు చేసి రూ.5కు ఐదు ఇడ్లీ, అంతే ధరకు ఉప్మా, పులిహోర తదితర ఆహారపదార్థాలను అందించాలనే రాష్ట్ర ప్రణాళిక సంఘం సూచనకు సీఎల్పీ నాయకుల నుంచి ఏకగ్రీవంగా సమ్మతి లభించింది. అయితే పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి వీలుగా రాష్ట్రంలో లాటరీల అమ్మకాలను పునఃప్రారంభించాలనే ప్రణాళికా సంఘం సూచనలను ఆమోదించకూడదంటూ సీఎంకు కాంగ్రెస్ నాయకులు మూకుమ్మడిగా సూచించారు. ఇందుకు సిద్ధరామయ్య సైతం సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement