ఎన్నికల ముంగిటప్రజాకర్షక బడ్జెట్
రూ.5,417కోట్ల లోటు
ఆహారధాన్యాలపై కొనసాగనున్న
పన్ను మినహాయింపు
గృహాలు, వ్యవసాయం, పరిశ్రమలకు
విద్యుత్ చార్జీల్లో 20 శాతం సబ్సిడీ
ఓట్ ఆన్ అకౌంట్ ప్రతిపాదించిన అజిత్‌పవార్
ముంబై : లోక్‌సభ ఎన్నికల ముంగిట మహారాష్ట్ర సర్కారు ప్రజాకర్షక బడ్జెట్ ప్రవేశపెట్టింది. బియ్యం, గోధుమలు, పప్పుధాన్యాలు, పిండి, బెల్లం, పసుపు, చింతపండు వంటి నిత్యావసర వస్తువులపై పన్ను మినహాయింపును కొనసాగించడంతో పాటు నివాస, వ్యవసాయ, వాణిజ్య వినియోగదారులు, పారిశ్రామికవేత్తలకు విద్యుత్ చార్జీల్లో 20 శాతం సబ్సిడీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉపముఖ్యమంత్రి, ఆర్థికమంత్రి కూడా అయిన అజిత్‌పవార్ మంగళవారం నాడు అసెంబ్లీలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రూ.5,417 కోట్ల లోటు బడ్జెట్‌ను ఆయన ప్రతిపాదించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ.1,69,907.55 కోట్లుగా, వ్యయం రూ.1,75,324.83 కోట్లుగా పేర్కొన్నారు.
నిత్యావసరమైన ఆహార ధాన్యాలతో పాటు ధనియాలు, మెంతులు, మిరపకాయలు, కొబ్బరి, పాపడ్, షోలాపూర్ దుప్పట్లు, టవళ్లపై వచ్చే ఏడాది మార్చి 31 వరకు పన్ను మినహాయింపు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అదనపు ఆదాయాన్ని ఆశించామని పేర్కొన్నారు. అయితే ఆదాయపు లక్ష్యాలను చేరుకున్నప్పటికీ ప్రకృతి విపత్తుల్లో నష్టపోయిన వారికి పునరావాసం కల్పిం చడం, విద్యుత్ సబ్సిడీలకు భారీగా ఖర్చు చేయాల్సి వచ్చిందని చెప్పారు. ఫలితంగా రూ.3,017.23 కోట్ల లోటును ఎదుర్కొన్నామని తెలిపారు. విద్యుత్ సబ్సిడీ కారణంగా వచ్చే ఏడాది కూడా వ్యయం భారీగా పెరగనుందని చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను ముసాయిదా ప్రణాళికను కేంద్ర ప్రణాళిక సంఘంతో చర్చించలేదని పవార్ తెలిపారు. అయినప్పటికీ రూ.51,222.54 కోట్లతో ప్రణాళికను ప్రతిపాదించినట్లు చెప్పారు. వచ్చే నాలుగు నెలల కోసం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రతిపాదిస్తున్నానని ఆర్థిక మంత్రి ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల అనంతరం అదనపు బడ్జెట్‌ను ప్రతిపాదిస్తానని తెలిపారు. ఈ మధ్యంతర బడ్జెట్‌లో విద్యుత్ సబ్సిడీ కోసం రూ.9వేల కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.
నివాస గృహాలకు, వ్యవసాయం, వాణిజ్య వినియోగం, పరిశ్రమలు, మహావితరణ్ నుంచి విద్యుత్‌ను పొందే పవర్‌లూమ్ వినియోగదారులకు 20 శాతం సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించినట్లు అజిత్‌పవార్ చెప్పారు. రాష్ట్రంలో తలసరి వార్షిక ఆదాయం రూ.1,05,493కి వృద్ధి చెందినట్లు తెలిపారు. అక్షరాస్యత శాతం 82.9కి చేరుకుందని చెప్పారు. జాతీయ ఆహార భద్రత పథకాన్ని ఈ నెలారంభం నుంచి అమలుచేస్తున్నామని, మొత్తం 8.77 కోట్ల మంది లబ్ధిదారులకు గాను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 1.77 కోట్ల మంది లబ్ధి పొందుతారని తెలిపారు. వీరికి సబ్సిడీ రేట్లకు ఆహారధాన్యాలు సరఫరా చేస్తామన్నారు. రాజీవ్‌గాంధీ జీవన్‌దాయి ఆరోగ్య యోజన పథకాన్ని రూ.698 కోట్లతో రాష్ట్రం మొత్తానికి వర్తింప చేస్తున్నామని చెప్పారు. త్రైయంబకేశ్వర్‌లో 2015-16లో నాసిక్‌లో జరగనున్న సింహస్థ కుంభమేళా కోసం అభివృద్ధి పనులకు రూ.2,378 కోట్లు మంజూరు చేశామని చెప్పారు. రూ.2,356 కోట్ల వ్యయంతో ప్రారంభించిన వర్సోవా-అంధేరీ-ఘాట్కోపర్ ఎలివేటెడ్ మెట్రో కారిడార్ ప్రాజెక్టు దాదాపు పూర్తి కానుందని, దాని ద్వారా ప్రతి రోజు ఆరు లక్షల మంది ప్రయాణికులు లబ్ధిపొందుతారని పవార్ చెప్పారు.