ఆగిన ఆటోప్రయాణికులు ఇబ్బందులపాలు
సాక్షి, న్యూఢిల్లీ :పోలీసుల వేధింపులకు నిరసనగా ఆటో డ్రైవర్లు సోమవారం ఒక రోజు సమ్మె చేశారు. భారతీయ మజ్దూర్ సంఘ్ ఆటో యూనియన్ పిలుపు మేరకు ఆటోడ్రైవర్లు ఈ సమ్మెలో పాల్గొన్నారు. ట్రాఫిక్ పోలీసులు ఒకవైపు లంచాలు అడగడమే కాకుండా, మరోవైపు భారీ జరిమానాలు విధిస్తున్నారని ఢిల్లీ ఆటో రిక్షా సంఘ్ అధ్యక్షుడు రాజేందర్ సోనీ ఆరోపించారు అంతేకాకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. పోలీసుల జులుం కారణంగా ఆటోడ్రై వర్లు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.పోలీసు కమిషనర్‌తో చర్చల అనంతరం ఆటో యూనియన్ సమ్మెను విరమించింది.
కాగా ఈ సమ్మె కారణంగా నగరవాసులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. భారతీయ మజ్దూర్ సంఘ్ పిలుపు మేరకు జరిగిన సమ్మెలో పాల్గొనడం వెనుక రాకీయ ఉద్దేశం లేదని ఢిల్లీ ఆటో రిక్షా సంఘ్ అధ్యక్షుడు రాజేందర్ సోనీ ప్రకటించారు. అయితే ఈ నెల 31వ తేదీన అరవింద్ కేజ్రీవాల్ స్థానిక రామ్‌లీలామైదాన్‌లో నిర్వహించే ఆటోడ్రైవర్ల సమావేశాన్ని దెబ్బతీసే ఉద్దేశంతోనే భారతీయ మజ్దూర్ సంఘ్ ఈ సమ్మెకు పిలుపు ఇచ్చిందని రాజకీయ పండితులు అంటున్నారు. అన్ని పార్టీలు తమ తమ రాజకీయ ప్రయోజనాలకోసం పలుమార్లు ఆటోడ్రైవర్లను పావులు చేసి వాడుకున్నాయని, రాజకీయ నాయకుల చేతిలో తాము పలుమార్లు మోసపోయామని రాజేందర్ సోనీ ఆరోపించారు.
కాగా నగరంలోని ఆటో డ్రైవర్లందరికీ సోనీ....తనను తాను నాయకుడిగా చూపుకునే ప్రయత్నం చేస్తున్నాడని ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు ఇచ్చే కొందరు ఆటోడ్రైవర్లు ఆరోపించారు. ఈ రోజు సమ్మెలో సోనీ ఎందుకు పాల్గొన్నాడని వారు ప్రశ్నించారు. సోనీ ఆటో యూనియన్‌కు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ మద్దతు ఇస్తున్నాయని ఆప్ ఆటో విభాగం సమన్వయకర్త సంజయ్ చావ్లా ఆరోపించారు. అయితే సమ్మెలో పాల్గొనాలంటూ తాము ఎవరినీ బలవంతపెట్టలేదని సోనీ చెప్పారు. సమ్మెలో నగరంలోని ఆటోడ్రైవర్లు భారీ సంఖ్యలో స్వచ్ఛందంగా పాల్గొన్నారని ఆయన చెప్పారు.