బదియాళలో రైలు బోగీల తయారీ పరిశ్రమకు శంకుస్థాపన
- అంచనా వ్యయం రూ. 750 కోట్లు
- తొలివిడతలో రూ. 75 కోట్లు విడుదల
- ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా : కేంద్ర మంత్రి ఖర్గే
యాదగిరి, న్యూస్‌లైన్ : యాదగిరి సమీపంలోని బదియాళ గ్రామం వద్ద రైల్వే ఫియట్ బోగీల తయారీ పరిశ్రమకు కేంద్ర మంత్రి మల్లికార్జున ఖర్గే ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆర్థిక కార్యాకలాపా అభివృద్ధికి తోడు యువతకు ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా రైలు బోగీల తయారీ యూనిట్ స్థాపనకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. మొత్తం ప్రాజెక్ట్ వ్యయం రూ,. 750 కోట్లు కాగా తొలివిడతలో రూ. 75 కోట్లు విడుదల చేశారని రెండవ విడతలో మరో రూ.75 కోట్లు, మూడవ విడతలో రూ. 300 కోట్లు విడుదల చేయనున్నట్లు వివరించారు.
ఈ యూనిట్ స్థాపనతో ఈ ప్రాంతం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. జాతీయ పథకం కావడంతో జిల్లా కేంద్రంలోనే యూనిట్ స్థాపనకు శ్రీకారం చుట్టామని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తూ 150 ఎకరాల భూమిని అందించిందని పేర్కొన్నారు. చిక్కమగళూరు - కడూరు, కోలారు - చిక్కబళ్లాపుర, రాయచూరు - గద్వాల రైల్వే మార్గాలను పూర్తి చేస్తామని చెప్పారు.
వాడి - గదగ్ రైల్వే మార్గం పనులను త్వరలో చేపట్టనున్నట్లు వివరించారు. దీంతో ఉత్తర కర్ణాటక ప్రాంతంలో హై-క ప్రాంతం ఉంచి గోవాకు రైల్వే మార్గం ఏర్పడుతుందని అన్నారు. చిక్కమగళూరు - సకలేశపుర, చామరాజనగర్ - మళవళ్లి - రామ్‌నగర్ రైల్వే మార్గాలు చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా మంత్రి బాబురావు చించననూర్, ఎమ్మెల్యే ఎ.బి.మాలకరెడ్డి, రైల్వే బోర్డు చైర్మన్ అరుణేంద్రకుమార్, మెకానికల్ బోర్డు సభ్యులు అలోక్ జోహరె, సీఎండీ సతీష్ పాల్గొన్నారు.