- 50 అంతస్తులతో 151 మీటర్ల ఎత్తు
- దక్షిణాదిలో అతి పొడవైన టవర్!
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రియల్ ఎస్టేట్ రంగంలోని గోల్డెన్ గేట్ ప్రాపర్టీస్ లిమిటెడ్ నగరంలోని యశ్వంతపురలో ‘ప్రెసిడెన్షియల్ టవర్’ పేరిట 50 అంతస్తుల గృహ సముదాయాన్ని నిర్మించనుంది. ఈ టవర్ ఎత్తు 151 మీటర్లు ఉంటుంది. బెంగళూరులో, బహుశా దక్షిణాదిలో కూడా ఇదే అతి ఎత్తైన టవర్ అని సంస్థ వ్యవస్థాపకుడు కే ప్రతాప్ ఒక ప్రకటనలో తెలిపారు. వరల్డ్ ట్రేడ్ సెంటర్, ఓరియన్ మాల్, స్టార్ హోటల్స్, ఆస్పత్రుల సమీపంలోని నిర్మించనున్న ఈ ప్రాజెక్టులో అనేక అధునాతన సదుపాయాలుంటాయని వెల్లడించారు.
ఈ ప్రాజెక్టులో భాగంగా అరవై వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నగరంలో పెద్దదైన క్లబ్ హౌస్‌ను కూడా నిర్మించనున్నట్లు తెలిపారు. ప్రాజెక్టును చేపట్టిన 36 నెలల్లో నిర్మాణాన్ని పూర్తి చేస్తామని పేర్కొన్నారు. మొత్తమ్మీద 40 నెలల వ్యవధిలో అపార్ట్‌మెంట్లను సంబంధిత యజమానులకు అప్పగించలేని పక్షంలో వారి పెట్టుబడిపై ఏడాదికి పది శాతం చొప్పున వడ్డీని చెల్లిస్తామని వెల్లడించారు.
ఈ హామీని తొలుతే బాండు రూపంలో ఇస్తామని తెలిపారు. నగరంలో పది వేల మందికి పైగా అత్యంత శ్రీమంతులున్నారని, కనుక విలాసవంతమైన నివాస అపార్ట్‌మెంట్లకు ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటుందని ఆయన పేర్కొన్నారు.