
ఆగంతకుడి ఆచూకేదీ?
సాక్షి ప్రతినిధి, బెంగళూరు :
నగరంలోని కార్పొరేషన్ బ్యాంకు ఏటీఎం కేంద్రంలో జ్యోతి ఉదయ్‌పై వేట కత్తితో దాడి జరిగి ఎనిమిది రోజులైనా ఆగంతకుని ఆచూకీ ఏమాత్రం లభ్యం కాలేదు. అనంతపురం జిల్లా కదిరి ఏటీఎం కేంద్రంలో అచ్చు ఇలాంటి పోలికలే ఉన్న ఆగంతకుడు సీసీ టీవీ కెమెరా దృశ్యాల్లో కనిపించినా, కేసు దర్యాప్తులో పురోగతి కనిపించడం లేదు. సుమారు 200 మంది పోలీసులు ఆగంతకుని వేటలో ఉన్నారు. నగర పోలీసులు, అనంతపురం జిల్లా పోలీసులతో కలసి పని చేస్తున్నారు. జ్యోతి మొబైల్ ఫోన్‌ను హిందూపురంలో విక్రయించడం ద్వారా ఆగంతకుడు పోలీసుల దృష్టి మళ్లించడానికి ప్రయత్నించాడా... అనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. బహుశా అతను సరిహద్దు ప్రాంతానికి చెందిన వాడై ఉంటాడని, బెంగళూరు కూడా అతనికి సుపరిచితమేనని తెలుస్తోంది. జ్యోతిపై దాడి చేయడానికి అర గంట ముందు అతను అక్కడ రెక్కీ కూడా నిర్వహించినట్లు తెలుస్తోంది.
సిమ్ కార్డు లభ్యం
జ్యోతి ఉదయ్ ఫోన్‌ను తీసుకు పోయిన ఆగంతకుడు అందులోని సిమ్ కార్డును బీఎంటీసీ బస్సులో పడేశాడు. మెజిస్టిక్ నుంచి మారతహళ్లికి వెళ్లే బస్సులో రమణ అనే కార్మికునికి సీటు కింద ఈ సిమ్ కార్డు లభించింది. దానిని తన ఫోనులో వాడుకుంటూ అతను పోలీసులకు దొరికి పోయాడు. మారతహళ్లి సమీపంలోని కాడుబీసనహళ్లిలో ఉంటున్న అతనిని సీసీబీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు దర్యాప్తు చేస్తున్న సిల్వర్ జూబ్లీ పార్కు పోలీసులకు అప్పగించారు. ఈ నెల 19న తాను మెజిస్టిక్ నుంచి మారతహళ్లికి వెళుతుండగా బస్సులో సీటు కింద సిమ్ కార్డు లభ్యమైందని అతను పోలీసులకు చెప్పాడు. దానిని తన ఫోనులో వాడుకుంటున్నానని, అంతకు మించి తనకేమీ తెలియదని వివరించాడు. సోమవారం రాత్రి వరకు పోలీసులు అతనిని ప్రశ్నించారు. అనుమానం కలగక పోవడంతో తర్వాత వదిలి వేశారు.
ఏటీఎంలో పని పూర్తి చేసుకున్న అనంతరం కార్పొరేషన్ సర్కిల్ నుంచి ఆగంతకుడు అదే బస్సులో మెజిస్టిక్‌కు వెళ్లి ఉంటాడని భావిస్తున్నారు. ఆ సందర్భంలోనే సిమ్ కార్డును ఫోన్ నుంచి తీసి పారేసి ఉంటాడని పోలీసులు అంచనాకు వచ్చారు. హిందూపురంలో మొబైల్ ఫోను పోలీసులకు లభ్యమైన సంగతి తెలిసిందే. దీంతో మొబైల్ ఫోన్, సిమ్ కార్డు ఆధారంగా చేపట్టిన దర్యాప్తునకు ద్వారాలు మూసుకు పోయాయి. దరిమిలా ఈ కేసు దర్యాప్తు మరింత సంక్లిష్టంగా మారింది. ధర్మవరంలో ఓ మహిళను హత్య చేసిన దుండగుడే బెంగళూరులోనూ ఈ అకృత్యానికి పాల్పడి ఉంటాడనే అనుమానంతో ఇరు రాష్ట్రాల పోలీసులు సంయుక్త కార్యాచరణను కొనసాగిస్తున్నారు.
కోలుకుంటున్న జ్యోతి
ఇక్కడి కెంగేరిలోని బీజీఎస్ గ్లోబల్ ఆస్పత్రిలో జ్యోతి కోలుకుంటోంది. ఆమె ఆరోగ్యం కుదుట పడుతోందని, ఒకటి, రెండు రోజుల్లో ఐసీయూ నుంచి జనరల్ వార్డుకు తరలించే విషయమై యోచిస్తున్నామని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. కాగా జ్యోతి పళ్ల రసం, ఆహారం తీసుకుంటోందని ఆమె భర్త ఉదయ్ కుమార్ తెలిపారు. ఫిజియో థెరపీ కూడా చేయిస్తున్నారని చెప్పారు. ఏటీఎం కార్డును ఎత్తుకెళ్లిన దుండగుడు పిన్ నంబరును కూడా జ్యోతిని అడిగి తెలుసుకున్నాడా అనే విషయం ఇంకా తెలియలేదన్నారు. ఈ సంఘటనపై ఆమెను ఏమీ అడగవద్దని వైద్యులు సూచించారని తెలిపారు.