సాక్షి, బెంగళూరు : మైసూరు - బెంగళూరు మధ్య బుల్లెట్ ట్రైన్ సదుపాయం కల్పించాలనుకుంటున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. ఇందుకు జపాన్‌కు చెందిన కొన్ని కంపెనీలు ఆర్థికంగా, సాంకేతికంగా సహకారం అందించడానికి ముందుకు వచ్చాయన్నారు. చైనాలో ఈనెల 11 నుంచి మూడు రోజుల పాటు జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో పాల్గొన్న ఆయన అక్కడి అనుభవాలతోపాటు విదేశీపెట్టుబడిదారుల సహకారంతో రాష్ట్రంలో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలను గూర్చి బెంగళూరులో మీడియాకు సోమవారం వివరించారు.
త్వరలోనే జపాన్‌కు చెందిన కంపెనీ ప్రతినిధులు బెంగళూరును సందర్శించి బుల్లెట్ ట్రైన్‌కు సంబంధించిన ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి అందజేస్తారని చెప్పారు. ఈ సౌకర్యం ఏర్పాటైతే 250 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 30 నిమిషాల్లో చేరుకునేందుకు వీలవుతుందని వివరించారు. చెన్నె-బెంగళూరు మధ్య కూడా బుల్లెట్ ట్రైన్ సదుపాయం కల్పించే విషయం కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు. అదేవిధంగా బెంగళూరులోని దేవనహళ్లి వద్ద ప్రపంచ ప్రమాణాలకు తగ్గట్టు జాతీయ, అంతర్జాతీయ సమావేశాలు నిర్వహించేందకు వీలుగా కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) పద్దతిలో నిర్మించనున్న ఈ భవన నిర్మాణానికి సుమారు రూ.500 కోట్లు ఖర్చుకాగలవని అంచనా వేసినట్లు పేర్కొన్నారు. భవన నిర్మాణానికి చైనా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించే విషయం పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
వచ్చే ఏడాది ప్రభుత్వ పెట్టుబడిదారుల సదస్సు
వచ్చే ఏడాది అక్టోబరు నెలలో రాష్ట్రంలో నిర్వహించే సదస్సులో పాల్గొనాల్సిందిగా ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సులో పాల్గొన్న వివిధ ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీల ప్రతినిధులను ఆహ్వానించినట్లు సిద్ధరామయ్య తెలిపారు. చాలా మంది ఈ సదస్సులో పాల్గొనడానికి ఉత్సాహం చూపుతున్నారన్నారు. వ్యవసాయ, వ్యవసాయ ఆధారిత రంగంలో ఎక్కువ పెట్టుబడులు రావడం వల్ల రాష్ట్రంలోని అన్ని చాలా రకాల పరిశ్రమల స్థాపనకు, అభివృద్ధికి అవకాశం ఏర్పడుతుందన్నారు. ఇజ్రాయిల్ ‘మైక్రో ఇరిగేషన్’ రంగంలో ప్రపంచంలో అగ్రస్థానంలో ఉందని... అక్కడి కంపెనీలను ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు సిద్ధరామయ్య తెలిపారు.
జఫర్‌కు కృతజ్ఞతలు
చైనా పర్యటనలో తన భోజనానికి ఎలాంటి ఇబ్బం దులు లేకుండా దగ్గరుండి చూసుకున్న అక్కడి షాంగ్రిల్లా హోటల్‌లో పనిచేస్తున్న జఫర్ అనే వంటవాడికి సిద్ధరామయ్య ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. చైనాలో టీ అసలు తాగలేదన్నారు. సూట్ కంటే పంచెకట్టు తనకు సౌకర్యవంతంగా ఉంటుందని సిద్ధరామయ్య తెలిపారు.
మైసూరుకు బుల్లెట్ ట్రైన్
Published Tue, Sep 17 2013 3:23 AM | Last Updated on Fri, Sep 1 2017 10:46 PM
Advertisement
Advertisement