అశ్లీల ఫొటోలు పంపిస్తే..ఇక అంతే
కఠిన చర్యల దిశగా బెంగళూరు పోలీసులు
బెంగళూరు :
సీఎం సిద్ధరామయ్యకు వ్యతిరేకంగా ఫేస్‌బుక్‌లో అవహేళనకరంగా పోస్టు. కావేరి కోసం కర్ణాటక ప్రజలు రోడ్డు పైకి వచ్చి నిరసనలకు దిగుతుంటే కర్ణాటక విరుద్ధంగా ట్విట్టర్‌లో వ్యంగ్య చిత్రాలు. ఇలా రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతున్న సాంకేతిక పరిజ్ఞానం వల్ల భావప్రకటన విపరీతస్థాయికి చేరింది. ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్, వుయ్‌చాట్ తదితర సామాజిక మాధ్యమాల్లో అశ్లీల సందేశాలు, ఫొటోలు, వ్యక్తిగత ఇతర మతాలపై అనుచిత సందేశాలు అప్‌లోడ్ చేస్తుండటంతో సమాజ భద్రతకు ముప్పు వాటిల్లుతోంది. దీంతో ఇటువంటి అనర్థాలకు బ్రేక్ వేయాలని కర్ణాటక పోలీసులు నిర్ణయించుకున్నారు. అశ్లీల, అవహేళన రీతిలో ఫొటోలు, సందేశాలు పోస్ట్ చేసే వ్యక్తులపై గట్టి చర్యల ద్వారా ఇటువంటివి అరికట్టడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
గత కొద్ది కాలంగా ప్రముఖ సంస్థలు, వ్యక్తులతో పాటు ఇతర మతాలపై కూడా నిందాపూర్వకంగా సందేశాలు పోస్ట్ చేస్తున్న ఘటనలు పెచ్చు మీరడంతో సదరు వ్యక్తులపై సుమోటో కేసును నమోదు చేయడానికి పోలీసులు నిర్ణయించుకున్నట్లు సమాచారం. అందులో భాగంగా ఇప్పటికే ఇటువంటి అనర్థాలకు కారణమవుతున్న సామాజిక మాధ్యమాలపై నిఘా ఉంచిన పోలీసులు అటువంటి çవ్యక్తులను అరెస్ట్ చేయడానికి చర్యలను ముమ్మరం చేశారు. ఇటువంటి ఘటనల్లో బాధితులు స్టేషన్‌కు రాకుండానే కేవలం మెయిల్ ద్వారా కూడా ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసు నమోదు చేసుకోనున్నారు.
సైబర్‌క్రైమ్‌కు అడ్డుకట్ట వేయడానికి నిర్ణయించుకున్న పోలీసుశాఖ అందుకు తగ్గట్లుగా పోలీసు సిబ్బందికి కూడా సైబర్‌క్రైమ్‌పై అవగాహన కల్పించడానికి చర్యలను ప్రారంభించింది. క్షేత్రస్థాయి సిబ్బంది నుండి ఎస్పీ కేడర్ అధికారుల వరకు అందరికీ సైబర్‌క్రైమ్‌పై శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. దీంతో ఫేస్‌బుక్, యూట్యూబ్‌లో అవహేళనకర పోస్టులు చేసే వ్యక్తుల ఖాతాలను భాధితుల ఫిర్యాదులు మేరకు రద్దు చేసే ప్రక్రియ ఇకపై మరింత సులభతరం కానుంది. సామాజిక మాధ్యమాల ద్వారా సమాజ భద్రతకు ప్రమాదకరంగా పరిణమించిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవడానికి పోలీసుశాఖలోని ఇతర ఉన్నతాధికారులతో చర్చించనున్నారు.