banglore police
-
ఆభరణాలు కనిపిస్తే అంతే!
హైదరాబాద్: హైదరాబాద్‌లోని సంపన్నుల నివాసాల్లో కోట్లాది రూపాయల విలువ చేసే వజ్రాభరణాలు దొంగతనం చేసి పరారైన ఘరానా దొంగ ఇర్ఫాన్ (35) ఎట్టకేలకు బెంగళూరు పోలీసులకు చిక్కాడు. ఈ మోస్ట్ వాంటెడ్ దొంగను విచారిస్తున్న కొద్దీ బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో చేసిన దొంగతనాల చిట్టా బయటికొస్తున్నది. తాజాగా ఇర్ఫాన్‌ను విచారించిన అక్కడి పోలీసులకు ఏడాది క్రితం ఎమ్మెల్యే కాలనీలో చేసిన దొంగతనాలతో కూడా ఇర్ఫాన్‌కు సంబంధాలు ఉన్నట్లు తెలిసింది.మాజీ ఎంపీ సుబ్బిరామిరెడ్డి సోదరుడి కొడుకు తిక్కవరపు ఉత్తమ్‌రెడ్డి నివాసంలో ఆగస్టు 28వ తేదీన రూ.2 కోట్ల విలువ చేసే ఆభరణాలు దొంగిలించి పరారైన ఘటనలో, ఒక వైపు పోలీసులు గాలింపు చేస్తున్న క్రమంలోనే నిందితుడు బెంగళూరు పోలీసులకు ఈ నెల 1న ముంబైలో పట్టుబడ్డాడు. విచారించగా ఉత్తమ్‌రెడ్డి నివాసంతో పాటు గత జూలై 22వ తేదీన జూబ్లీహిల్స్ రోడ్ నెం. 28లో నివసించే విల్లామేరీ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఫిలోమినా ఇంట్లో దొంగతనం చేసి రూ.30 లక్షల విలువ చేసే ఆభరణాలు తస్కరించింది కూడా ఇర్ఫాన్‌గా గుర్తించారు. అలాగే గత ఆగస్టు 24వ తేదీన ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆదిత్య ఎన్‌క్లేవ్‌లో నివసించే జగదీశ్ ఇంట్లో రూ.25 లక్షల విలువ చేసే ఆభరణాలు తస్కరించింది కూడా అతడే అని విచారణలో తేలింది. నెల రోజుల వ్యవధిలోనే ఈ మూడు దొంగతనాలు చేసి పరారైన ఇర్ఫాన్ ఇక్కడి పోలీసులకు సవాల్‌గా మారాడు. 2018 ఆగస్టు 9వ తేదీన బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని ఎమ్మెల్యే కాలనీలో నివసించే శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి సోదరుడు వెంకట్‌రెడ్డి ఇంట్లో రూ.10 లక్షల విలువ చేసే ఆభరణాలు తస్కరించి ఒక రోజు గడవకముందే, 2018 ఆగస్టు 10వ తేదీన ఎమ్మెల్యే కాలనీలో నివసించే డాక్టర్ రామారావు ఇంట్లో రూ.50 లక్షల విలువ చేసే ఆభరణాలు తస్కరించి పరారైనట్లు విచారణలో తేలింది. పీటీ వారెంట్‌తో రప్పించేలా.. హైదరాబాద్‌కు వచ్చినప్పుడు తలాబ్ కట్టలో నివసించే స్నేహితులు సాజిద్, ముజఫర్ల వద్ద ఆశ్రయం పొందేవాడని తేలడంతో ఆ ఇద్దరినీ సీసీఎస్ పోలీసులు వారం క్రితం అరెస్ట్ చేశారు. మరింత లోతుగా ఇర్ఫాన్‌ను విచారించగా ఢిల్లీ, గుర్గావ్, ముంబై, బెంగళూరుతో పాటు హైదరాబాద్‌లో మొత్తం 12 దొంగతనాలు చేసినట్లుగా తేలింది. హైదరాబాద్‌లో చేసిన దొంగతనాల్లో సీసీ కెమెరాల్లో ముఖం కనిపించకుండా ఇర్ఫాన్ జాగ్రత్తలు తీసుకున్నాడు. బెంగళూరులో పట్టుబడ్డ ఓ దొంగద్వారా అక్కడి పోలీసులు ముంబైలో తలదాచుకున్న ఇర్ఫాన్‌ను చాకచక్యంగా పట్టుకోవడంతో నేరాల చిట్టా బయటపడింది. ప్రస్తుతం ఇర్ఫాన్‌ను బెంగళూరు పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే కాలనీలో రెండు చోట్ల దొంగతనం చేసిన విషయాన్ని రెండు రోజుల క్రితమే ఇర్ఫాన్ వెల్లడించగా, నగరంలో ఇంకా ఎక్కడెక్కడ భారీ దొంగతనాలు జరిగాయన్నదానిపై పోలీసులు ఆరా తీస్తూనే ఆ వివరాలను బెంగళూరు పోలీసులకు అందిస్తున్నారు. బెంగళూరు పోలీసులు ఇర్ఫాన్‌ను రిమాండ్‌కు తరలించగానే, హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు పీటీ వారెంట్ జారీ చేసి నిందితుడిని హైదరాబాద్‌కు తీసుకొచ్చి ఇక్కడి దొంగతనాలపై విచారణ ప్రారంభించనున్నారు. మొత్తానికి ఈ గజదొంగ పోలీసులకు చిక్కడంతో నగర పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. -
వైరల్ అవుతున్న పోలీసు కమీషనర్ వీడియో
-
వైరల్ అవుతున్న ఆ పోలీస్ సెల్యూట్..!
సాక్షి, బెంగుళూరు : కనిపించని నాలుగో సింహం పోలీస్ అంటే మనలో చాలా మందికి భయం. ఇంక వారితో మాట్లాడాలంటే కొంతమంది బెంబేలెత్తిపోతారు. కానీ ఓ విద్యార్థి మాత్రం పోలీసు అధికారిని చూడగానే గౌరవంతో సెల్యూట్ చేశాడు. సిబ్బందితో కలిసి వెళ్తూ.. హడావిడిలో ఉన్న ఆ అధికారి కూడా హుందాగా స్పందించాడు. ఆ విద్యార్థి సెల్యూట్‌ను గమనించి.. వెంటనే ప్రతి సెల్యూట్ చేశాడు. బెంగళూరులో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటోంది. నగరంలోని మాల్య ఆస్పత్రి వద్ద ఈ అరుదైన ఘటన జరిగింది. బెంగుళూరు పోలీసు కమిషనరు టీ. సునీల్ కుమార్ మాల్య ఆస్పత్రి ముందు నుంచి వెళ్తున్నారు. కమిషనర్‌ను గమనించిన ఓ పాఠశాల విద్యార్థి గౌరవ సూచకంగా ఆయనకు సెల్యూట్ చేశాడు. తన సిబ్బందితో కలసి వెళ్తున్న కమిషనర్ ఇది గమనించి.. వెంటనే ఆ బాలునికి ప్రతి సెల్యూట్ చేశారు. ఇదంతా అక్కడ ఉన్న కెమెరాల్లో రికార్డయ్యింది. ‘ఒక యూనీఫామ్ మరో యూనీఫామ్కి ఇచ్చిన గౌరవం క్రమశిక్షణను సూచిస్తుంది’ అనే క్యాప్షన్‌తో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను ఇప్పటికే 1500 మంది షేర్ చేశారు. 80,000 వ్యూస్ వచ్చాయి. -
సురక్షితం.. నూతన సంబరం
మద్యం మత్తు, డ్రగ్స్ మైకంలో పోకిరీ యువకులు విచక్షణకోల్పోయి యువతులు, మహిళలపై వేధింపులకు దిగడం, వేలాది మంది మధ్య ఈ దుశ్వాసన పర్వాలకు గురవడంతో షాక్‌కు గురైన వనితల వేదనతో 2017కు బెంగళూరు స్వాగతం పలికింది. పదుల సంఖ్యలో యువతులు తమ భర్తలు, స్నేహితుల ముందే ఆకతాయిల చేష్టలతో రోదించారు. దీంతో 2018 తొలి క్షణాల్లో ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని బెంగళూరు పోలీసులు సిద్ధమయ్యారు. వేడుకల చుట్టూ పోలీసు కవచం ఈ ఏడాది న్యూ ఇయర్ వేడుకల కోసం అప్పుడే ఎంజీ రోడ్, బ్రిగేడ్ రోడ్లు సమాయత్తమవుతున్నాయి. ట్రినిటీ సర్కిల్, కస్తూర్బా రోడ్, కబ్బన్ పార్క్ వరకు పూర్తిగా ఖాకీమయం కానుంది. నిఘా పెంచడానికి ఎంజీ రోడ్, బ్రిగేడ్ రోడ్‌కు వెళ్లే ఈ ప్రాంతాల్లో అడుగడుగునా సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు నగర పోలీస్ కమిషనర్ సునీల్ కుమార్ నుండి సిబ్బందికి ఆదేశాలు అందాయి. మహిళా పోలీసులను సైతం మఫ్టీలో మోహరించి పోకిరీలను ముందుగానే పసిగట్టి అదుపులోకి తీసుకుంటారు. సాక్షి, బెంగళూరు: బెంగళూరులో నూతన సంవత్సర వేడుకలు అనగానే అందరికీ గుర్తొచ్చే ప్రాంతం ఎంజీ రోడ్, బ్రిగేడ్ రోడ్. ఈ ప్రాంతాల్లో ప్రతి ఏడాది నూతన సంవత్సర వేడుకలు అత్యంత అట్టహాసంగా సాగుతాయి. అయితే గత ఏడాది నూతన సంవత్సర వేడుకల్లో జరిగిన ఘటనతో అంతర్జాతీయ స్థాయిలో బెంగళూరు అప్రతిష్ట మూటగట్టకోవడం తెలిసిందే. ఈ ఘటనలపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో అలాంటి దుర్ఘటనలు ఈసారి కూడా జరగకుండా 31వ తేదీ సాయంత్రం నుంచే మొదలయ్యే వేడుకలకు భద్రతను మరింత కట్టుదిట్టం చేయనున్నారు. ఎంజీ రోడ్డులో నూతన సంవత్సర వేడుకలను నిషేధించాలంటూ డిమాండ్ వినిపించినప్పటికీ, నిషేధం జోలికి పోకుండా, భద్రతను పెంచాలని హోం శాఖ భావిస్తోంది. హుక్కా సెంటర్లు, డ్రగ్స్‌కు అడ్డుకట్ట నగరంలోకి వస్తున్న మత్తు పదార్థాలు చాలా వరకు హుక్కా సెంటర్ల ద్వారానే యువతకు చేరుతున్నాయి. గత ఏడాది నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్న కొంతమంది యువత ఈ మత్తు పదార్థాలను సేవించడంతోనే అసలు తామేం చేస్తున్నామనే విచక్షణా జ్ఞానాన్ని కోల్పోయి అలా ప్రవర్తించారని వైద్య పరీక్షల్లో వెల్లడైంది. ఈ నేపథ్యంలో హుక్కాసెంటర్లపై పోలీసులు నిఘాను తీవ్ర తరం చేశారు. అనుమతులు లేకుండా నడుపుతున్న హుక్కా సెంటర్లపై దాడులు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా తాత్కాలికంగా న్యూ ఇయర్ వేడుకలు జరిగే రెండు రోజులు (డిసెంబర్ 30, 31) తేదీల్లో హుక్కా సెంటర్లను మూయించడంతో పాటు డ్రగ్స్ విక్రయాలకు అడ్డుకట్ట వేయాలని నిర్ణయించారు. -
అశ్లీల ఫొటోలు పంపిస్తే..ఇక అంతే
కఠిన చర్యల దిశగా బెంగళూరు పోలీసులు బెంగళూరు : సీఎం సిద్ధరామయ్యకు వ్యతిరేకంగా ఫేస్బుక్లో అవహేళనకరంగా పోస్టు. కావేరి కోసం కర్ణాటక ప్రజలు రోడ్డు పైకి వచ్చి నిరసనలకు దిగుతుంటే కర్ణాటక విరుద్ధంగా ట్విట్టర్లో వ్యంగ్య చిత్రాలు. ఇలా రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతున్న సాంకేతిక పరిజ్ఞానం వల్ల భావప్రకటన విపరీతస్థాయికి చేరింది. ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్, వుయ్‌చాట్ తదితర సామాజిక మాధ్యమాల్లో అశ్లీల సందేశాలు, ఫొటోలు, వ్యక్తిగత ఇతర మతాలపై అనుచిత సందేశాలు అప్లోడ్ చేస్తుండటంతో సమాజ భద్రతకు ముప్పు వాటిల్లుతోంది. దీంతో ఇటువంటి అనర్థాలకు బ్రేక్ వేయాలని కర్ణాటక పోలీసులు నిర్ణయించుకున్నారు. అశ్లీల, అవహేళన రీతిలో ఫొటోలు, సందేశాలు పోస్ట్ చేసే వ్యక్తులపై గట్టి చర్యల ద్వారా ఇటువంటివి అరికట్టడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. గత కొద్ది కాలంగా ప్రముఖ సంస్థలు, వ్యక్తులతో పాటు ఇతర మతాలపై కూడా నిందాపూర్వకంగా సందేశాలు పోస్ట్ చేస్తున్న ఘటనలు పెచ్చు మీరడంతో సదరు వ్యక్తులపై సుమోటో కేసును నమోదు చేయడానికి పోలీసులు నిర్ణయించుకున్నట్లు సమాచారం. అందులో భాగంగా ఇప్పటికే ఇటువంటి అనర్థాలకు కారణమవుతున్న సామాజిక మాధ్యమాలపై నిఘా ఉంచిన పోలీసులు అటువంటి çవ్యక్తులను అరెస్ట్ చేయడానికి చర్యలను ముమ్మరం చేశారు. ఇటువంటి ఘటనల్లో బాధితులు స్టేషన్‌కు రాకుండానే కేవలం మెయిల్ ద్వారా కూడా ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసు నమోదు చేసుకోనున్నారు. సైబర్‌క్రైమ్‌కు అడ్డుకట్ట వేయడానికి నిర్ణయించుకున్న పోలీసుశాఖ అందుకు తగ్గట్లుగా పోలీసు సిబ్బందికి కూడా సైబర్‌క్రైమ్‌పై అవగాహన కల్పించడానికి చర్యలను ప్రారంభించింది. క్షేత్రస్థాయి సిబ్బంది నుండి ఎస్పీ కేడర్ అధికారుల వరకు అందరికీ సైబర్‌క్రైమ్‌పై శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. దీంతో ఫేస్బుక్, యూట్యూబ్‌లో అవహేళనకర పోస్టులు చేసే వ్యక్తుల ఖాతాలను భాధితుల ఫిర్యాదులు మేరకు రద్దు చేసే ప్రక్రియ ఇకపై మరింత సులభతరం కానుంది. సామాజిక మాధ్యమాల ద్వారా సమాజ భద్రతకు ప్రమాదకరంగా పరిణమించిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవడానికి పోలీసుశాఖలోని ఇతర ఉన్నతాధికారులతో చర్చించనున్నారు. -
ఇక 'ఆపరేషన్ స్మైల్'
బెంగళూరులో ప్రయోగాత్మకంగా చేపట్టిన పోలీసులు భిక్షాటన నుంచి చిన్నారులను దూరం చేసే దిశగా ఒకే రోజు '164' మంది చిన్నారులకు విముక్తి మెట్రోనగరి బెంగళూరులో ట్రాఫిక్ జంజాటం, కాలుష్యం ఇవన్నీ ఎంత సర్వసాధారణమో ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద భిక్షాటన కూడా అంతే సాధారణం. ముఖ్యంగా చిన్నారులను తీసుకుని భిక్షాటన సాగించే మహిళలు, చిన్నతనంలోనే భిక్షాటన దిశగా మళ్లిన చిన్నారుల సంఖ్య కూడా ఎక్కువే. ఎక్కడో అనాధలుగా దొరికిన పిల్లలను బలవంతంగా భిక్షాటన రొంపిలోకి దింపే వారు, ఇంకా చేతిలో బిడ్డతో భిక్షాటననే ఓ వ్యాపారంగా మార్చేసుకున్న వారు ఇలా ఒక్కొక్కరి వెనక ఒక్కో కథ, ఈ కథలన్నింటి వెనక మౌనంగా తమ బాల్యాన్ని కోల్పోతోంది మాత్రం చిన్నారులే. ఇలాంటి చిన్నారుల జీవితాల్లో తిరిగి నవ్వుల వసంతాన్ని తీసుకు వచ్చేందుకు పోలీసు శాఖ ప్రయోగాత్మకంగా ఓ కార్యక్రమాన్ని ప్రారంభించింది. రాష్ట్ర హోం శాఖ మంత్రి కె.జె.జార్జ్ ఆదేశాల మేరకు ప్రారంభమైన ఈ కార్యక్రమం పేరే 'ఆపరేషన్ స్మైల్' నగర పోలీస్ కమీషనర్ మేఘరిక్ ఆదేశాల మేరకు ఈస్ట్ జోన్ అదనపు పోలీస్ కమిషనర్ పి.హరిశేఖరన్ ఈ కార్యక్రమానికి నోడల్ అధికారిగా బాధ్యతలు చేపట్టారు. సాక్షి, బెంగళూరు : రాష్ట్ర రాజధాని బెంగళూరులో గురువారం సాయంత్రం నుంచి ఆపరేషన్ స్మైల్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమం కోసం మొత్తం నాలుగు టీమ్‌లను పోలీసు శాఖ ఏర్పాటు చేసింది. ఇందులో మొదటిదైన సర్వేలైన్స్ టీమ్‌లో నగరంలో చిన్నారుల సంరక్షణ కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థల్లోని కార్యకర్తలు, ఇతర వలంటీర్లు ఉంటారు. ఇక రెండోదైన రెస్క్యూటీమ్లో మఫ్టీలో ఉన్న ఇద్దరు పోలీసులతో పాటు (మహిళా పోలీసులతో కలిపి) స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులుంటారు. ఇక మూడోదైన ఇంటరాగేషన్, ఇన్ఫర్మేషన్ టీమ్‌లో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ(సీడబ్ల్యూసీ) అధికారి, సీపీఓ, సోషల్ వర్కర్, స్పెషల్ జువైనల్ పోలీస్ యూనిట్ అధికారితో పాటు మహిళా పోలీసు ఉంటారు. ఇక చివరిదైన రిహాబిలిటేషన్ టీమ్‌లో సీడబ్యూసీ అధికారితో పాటు వైద్యాధికారి, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, భిక్షాటన నుంచి బయటకు తీసుకు వచ్చిన పిల్లలు, మహిళలకు ఆశ్రయం ఇచ్చే సంస్థ ప్రతనిధులు భాగస్వాములై ఉంటారు. గురువారం సాయంత్రం నుంచే ఈ బృందాలన్నీ తమ పనిని ప్రారంభించాయి. గురువారం సాయంత్రం నగరంలోని ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, సౌత్-ఈస్ట్, నార్త్-ఈస్ట్, సెంట్రల్ ఇలా అన్ని ప్రాంతాల్లోనూ ఏకకాలంలో 'ఆపరేషన్ స్మైల్'ను పోలీసులు చేపట్టారు. మొత్తం 237 మహిళా భిక్షుకులను ఈ రొంపి నుంచి బయటకు లాగారు. ఇందులో '164' మంది చిన్నారులుండడం గమనార్హం. ఉపాధి మార్గాల కల్పన దిశగా..... ఇక 'ఆపరేషన్ స్మైల్' ద్వారా రక్షించిన చిన్నారులు, మహిళలకు నగరంలోని కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఆశ్రయం కల్పించేందు కు ముందుకొచ్చాయి. ఇక వీరితో చిన్నారు లు, మహిళల రక్షణ విషయాలపై పర్యవేక్షణకు గాను ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, స్పెషల్ జువైనల్ పోలీస్ యూనిట్స్ ఈ పర్యవేక్షణ బా ధ్యతలను నిర్వర్తించనున్నాయి. ఇప్పటి వర కు భిక్షాటనలో గడిపిన మహిళలకు ఇతర ఉపాధి మార్గాలను చూపడంతో పాటు చిన్నారులకు విద్యాభ్యాసాన్ని అందించే దిశగా స్వచ్ఛంద సంస్థలు పనిచేయనున్నాయి. -
ఎంపీ అసదుద్దీన్‌కు నోటీసులు
ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి బెంగళూరు పోలీసులు నోటీసులు పంపించారు. ఈ ఫిబ్రవరి 21న బెంగళూరులో ఆయన నిర్వహించ తలపెట్టిన సభకు అనుమతి లేదంటూ వాటిల్లో పేర్కొన్నారు. అయితే, తనకు నోటీసులు ఇచ్చేందుకు వచ్చిన పోలీసులకు అసదుద్దీన్ పూలబొకే ఇచ్చి పంపించడం గమనార్హం.