గతేడాది న్యూ ఇయర్ వేడుకల్లో బాధిత యువతులు
మద్యం మత్తు, డ్రగ్స్ మైకంలో పోకిరీ యువకులు విచక్షణకోల్పోయి యువతులు, మహిళలపై వేధింపులకు దిగడం, వేలాది మంది మధ్య ఈ దుశ్వాసన పర్వాలకు గురవడంతో షాక్‌కు గురైన వనితల వేదనతో 2017కు బెంగళూరు స్వాగతం పలికింది. పదుల సంఖ్యలో యువతులు తమ భర్తలు, స్నేహితుల ముందే ఆకతాయిల చేష్టలతో రోదించారు. దీంతో 2018 తొలి క్షణాల్లో ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని బెంగళూరు పోలీసులు సిద్ధమయ్యారు.
వేడుకల చుట్టూ పోలీసు కవచం
ఈ ఏడాది న్యూ ఇయర్ వేడుకల కోసం అప్పుడే ఎంజీ రోడ్, బ్రిగేడ్ రోడ్‌లు సమాయత్తమవుతున్నాయి. ట్రినిటీ సర్కిల్, కస్తూర్బా రోడ్, కబ్బన్ పార్క్ వరకు పూర్తిగా ఖాకీమయం కానుంది. నిఘా పెంచడానికి ఎంజీ రోడ్, బ్రిగేడ్ రోడ్‌కు వెళ్లే ఈ ప్రాంతాల్లో అడుగడుగునా సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు నగర పోలీస్ కమిషనర్ సునీల్ కుమార్ నుండి సిబ్బందికి ఆదేశాలు అందాయి. మహిళా పోలీసులను సైతం మఫ్టీలో మోహరించి పోకిరీలను ముందుగానే పసిగట్టి అదుపులోకి తీసుకుంటారు.
సాక్షి, బెంగళూరు:
బెంగళూరులో నూతన సంవత్సర వేడుకలు అనగానే అందరికీ గుర్తొచ్చే ప్రాంతం ఎంజీ రోడ్, బ్రిగేడ్ రోడ్. ఈ ప్రాంతాల్లో ప్రతి ఏడాది నూతన సంవత్సర వేడుకలు అత్యంత అట్టహాసంగా సాగుతాయి. అయితే గత ఏడాది నూతన సంవత్సర వేడుకల్లో జరిగిన ఘటనతో అంతర్జాతీయ స్థాయిలో బెంగళూరు అప్రతిష్ట మూటగట్టకోవడం తెలిసిందే. ఈ ఘటనలపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో అలాంటి దుర్ఘటనలు ఈసారి కూడా జరగకుండా 31వ తేదీ సాయంత్రం నుంచే మొదలయ్యే వేడుకలకు భద్రతను మరింత కట్టుదిట్టం చేయనున్నారు. ఎంజీ రోడ్డులో నూతన సంవత్సర వేడుకలను నిషేధించాలంటూ డిమాండ్ వినిపించినప్పటికీ, నిషేధం జోలికి పోకుండా, భద్రతను పెంచాలని హోం శాఖ భావిస్తోంది.
హుక్కా సెంటర్లు, డ్రగ్స్‌కు అడ్డుకట్ట
నగరంలోకి వస్తున్న మత్తు పదార్థాలు చాలా వరకు హుక్కా సెంటర్ల ద్వారానే యువతకు చేరుతున్నాయి. గత ఏడాది నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్న కొంతమంది యువత ఈ మత్తు పదార్థాలను సేవించడంతోనే అసలు తామేం చేస్తున్నామనే విచక్షణా జ్ఞానాన్ని కోల్పోయి అలా ప్రవర్తించారని వైద్య పరీక్షల్లో వెల్లడైంది. ఈ నేపథ్యంలో హుక్కాసెంటర్లపై పోలీసులు నిఘాను తీవ్ర తరం చేశారు. అనుమతులు లేకుండా నడుపుతున్న హుక్కా సెంటర్‌లపై దాడులు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా తాత్కాలికంగా న్యూ ఇయర్ వేడుకలు జరిగే రెండు రోజులు (డిసెంబర్ 30, 31) తేదీల్లో హుక్కా సెంటర్‌లను మూయించడంతో పాటు డ్రగ్స్ విక్రయాలకు అడ్డుకట్ట వేయాలని నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment