ప్రతీకాత్మకచిత్రం
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలో నూతన సంవత్సర వేడుకలు శ్రుతిమించాయి. కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టే క్రమంలో ఢిల్లీలోని వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు బాలురిపై కొందరు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఎనిమిది సంవత్సరాల బాలుడు బుల్లెట్ గాయాలతో మరణించగా, మరో బాలుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఢిల్లీలోని ఉస్మాన్‌పూర్ ప్రాంతంలో తమ ఇంటి టెర్రేస్‌పై నూతన సంవత్సర వేడుకలు జరుగుతుండగా కొందరు వ్యక్తులు ఎనిమిదేళ్ల బాలుడిపై కాల్పులు జరిపారు. కాగా నూతన సంవత్సర వేడుకల సందర్భంగా బాణాసంచా పేలుళ్లు తమకు వినిపించాయని, అనంతరం బాలుడు స్పృహ కోల్పోయి పడిఉండటాన్ని గమనించామని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
స్ధానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా అప్పటికే బాలుడు మరణించాడని వైద్యులు నిర్ధారించినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి పలువురిని ప్రశ్నించామని విచారణ కొనసాగుతోందని పోలీసులు చెప్పారు. ఇక ఈశాన్య ఢిల్లీలోని వెల్‌కం ప్రాంతంలో జరిగిన మరో ఘటనలో 12 ఏళ్ల బాలుడిపై గుర్తుతెలియని వ్యక్తి కాల్పులు జరిపాడని, ఈ ఘటనలో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడని పోలీసులు తెలిపారు. కాగా, బాధిత బాలుడికి ప్రాణాపాయం తప్పిందని, చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment