బాధితుల నుంచి వివరాలు తెలుసుకుంటున్న డీఎస్పీ రాంబాబు
మనుబోలు: కొత్త సంవత్సరం ప్రారంభం రోజే.. దొంగలు తమ పనితనాన్ని ప్రదర్శించారు. మనుబోలు పడమటి వీధిలో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మూడు ఇళ్లల్లో చోరీలకు పాల్పడి బీభత్సం సృష్టించారు. సుమారు 70 సవర్ల బంగారు నగలు, రూ.5 లక్షల నగదును అపహరించారు. బాధితుల కథనం మేరకు.. మనుబోలు పడమటి వీధి రామమందిరం సమీపంలో ఉంటున్న బొమ్మిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి అలియాస్ ఈశ్వరయ్య తన పాత ఇంటి పక్కనే కొత్తగా ఇల్లు కట్టుకున్నాడు. ఇటీవలే గృహ ప్రవేశం చేశారు. పాత ఇంటిలో ఉన్న బీరువాను మంచి రోజు చూసుకుని తీసుకెళ్దామని అక్కడే ఉంచేశాడు. సోమవారం రాత్రి కుటుంబ సభ్యులంతా రోజులాగే కొత్త ఇంటిలో నిద్రించారు. తెల్లారి లేచి చూసే సరికి పాత ఇంటి తలుపు తాళం, ఇంటిలోని బీరువాను పగుల గొట్టి ఉంది. వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. సుమారు 50 సవర్ల బంగారు నగలు, రూ.2.35 లక్షల నగదు ఛోరీ జరిగినట్లు బాధితులు వాపోయారు.
వీరి ఇంటి ఎదురుగానే ఉంటున్న బొమ్మిరెడ్డి కోటేశ్వరరెడ్డి ఇంటికి తాళం వేసి భార్య, అమ్మ, నాన్నలతో కలిసి పైఫ్లోర్‌లో నిద్రించారు. రాత్రి 2:30 గంటల సమయంలో కోటేశ్వరరెడ్డి మూత్ర విసర్జనకు వెళ్లేందుకు తలుపు తీయబోగా బయట తలుపునకు గొళ్లెం పెట్టి ఉండటాన్ని గమనించారు. అనుమానం వచ్చి పక్కింటిలోనే ఉన్న సోదరుడికి ఫోన్ చేశాడు. అతను కింద ఫ్లోర్‌లో తలుపులు తీసున్నాయని చెప్పాడు. తలుపులు, బీరువా పగులగొట్టి ఉన్నాయి. బీరువాలో ఉన్న 3 సవర్ల బంగారు నగలు, రూ.15 వేలు నగదు కనిపించలేదని తెలిపారు. చోరి జరిగిన రెండు ఇళ్లకు 50 అడుగుల దూరంలో వీధి చివర ఓ గడ్డపార పడేసి ఉంది. అలాగే ఇదే వీధిలో ఉన్న బొమ్మరెడ్డి శంకర్‌రెడ్డి కుటుంబ సభ్యులు రెండు రోజులు క్రితం ఇంటికి తాళం వేసి బంధువుల వద్దకు వెళ్లారు. ఇంటి డోర్ లాక్ పగులగొట్టిన దొంగలు లోపల ఉన్న బీరువాను పగుల గొట్టి నగదు, నగలు దోచుకెళ్లారు. రూ.2.30 లక్షల నగదు, సుమారు 15 సవర్లకు పైగా బంగారం దొంగలు దోచుకెళ్లినట్లు బాధితుడు శంకర్‌రెడ్డి తెలిపారు. రూ.50 వేల విలువ చేసే వెండి వస్తువులు కూడా పోయాయని తెలిపారు.
వీటితోపాటు హరిజనవాడకు చెందిన భత్సల వెంకయ్య ఇంటి తాళాలు పగులగొట్టిన దొంగలు బీరువాలో ఏమీ లేకపోవడంతో వెళ్లిపోయారు. సమాచారమందుకున్న ఎస్సై శ్రీనివాసులురెడ్డి తన సిబ్బందితో కలిసి చోరీ జరిగిన ఇళ్లను పరిశీలించారు. క్లూస్ టీం మూడు ఇళ్లలో వేలి ముద్రలు సేకరించారు. గూడూరు డీఎస్పీ రాంబాబు, సీఐలు సుబ్బారావు, అక్కేశ్వరావు చోరీ జరిగిన ఇళ్లను పరిశీలించి బాధితుల నుంచి వివరాలు సేకరించారు. ఊరికి 2కి.మీ దూరంలో చోరి చేసిన ఇళ్ల నుంచి తీసుకెళ్లిన హ్యాండ్ బ్యాగ్‌లో ఉన్న ఐడీ కార్డులు, పర్సులు, షాలువా, ఓ కత్తి, సెంట్రింగ్ రాడ్ పడేసి కనిపించాయి. కొన్ని నెలలుగా మండల కేంద్రంలో వరుసగా జరుగుతున్న చోరీలతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment