బ్యానర్లకు కమిటీ
చట్ట విరుద్ధంగా, అనుమతులు లేకుండా కూడళ్లలో, బస్టాపుల్లో బ్యానర్లు, ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేస్తే ఇక కొరడా ఝుళిపించనున్నారు. ఇందు కోసం హైకోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక కమిటీ రంగంలోకి దిగనుంది. ఈ కమిటీకి చైర్మన్‌గా న్యాయమూర్తి ఎస్ రాజేశ్వరన్ వ్యవహరించనున్నారు.
సాక్షి, చెన్నై: రాష్ట్రంలో ఎక్కడ బడితే అక్కడ రోడ్ల మీద బ్యానర్లు,ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేసే సంస్కృతి తాండవం చేస్తోంది. రాజకీయ సభలైనా, వివాహాలైనా, పుట్టినరోజులైనా సరే బ్యానర్లు కట్టాల్సిందే. ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లను ఏర్పాటు చేసుకోవాల్సిందే. వీటి కారణంగా అనేక చోట్ల ప్రమాదాలు సైతం చోటు చేసుకుంటున్నాయి. రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో అయితే, ఇక చెప్పలేం. రోడ్లు కన్పించని రీతిలో ముంచెత్తేస్తారు. వీటిపై కొరడా ఝుళిపించే విధంగా సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి కోర్టుల్లో ఉద్యమిస్తున్నారు. ఎక్కడైనా తనకు బ్యానర్, కటౌట్టు కనిపిస్తే చాలు వాటిని స్వయంగా తొలగించే పనిలో ఆయన నిమగ్నం అవుతారు. ఎట్టకేలకు ఇటీవల హైకోర్టు ఆయన ఉద్యమానికి స్పందించింది. ఇక బ్యానర్లు, కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాల్సి ఉంటే, ఆయా జిల్లా కలెక్టర్ల అనుమతిని తప్పనిసరి చేస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అలాగే, నిర్ణీత సమయంలోపు వాటిని తొలగించని పక్షంలో కొరడా ఝుళిపించాలని సూచించింది. అయితే, వీటిని అమలు చేసే వాళ్లు లేరు. దీంతో మళ్లీ హైకోర్టును ఆశ్రయించిన ట్రాఫిక్ రామస్వామి ప్రభుత్వం, అధికార యంత్రాంగంపై కోర్టు ధిక్కార కేసు నమోదుకు పట్టుబట్టే పనిలో పడ్డారు.
రంగంలోకి కమిటీ : బ్యానర్లు, ఫ్లెక్సీల వ్యవహారంలో కోర్టు ధిక్కార కేసు నమోదుకు పట్టుబడుతూ ట్రాఫిక్ రామస్వామి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ బుధవారం ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్, న్యాయమూర్తి ఆర్ మహేశ్వరన్ నేతృత్వంలోని బెంచ్ ముందుకు వచ్చింది. ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ సోమయాజులు హాజర య్యారు. నిబంధనల్ని కఠినతరం చేశామని, అనుమతులు తప్పనిసరి అని తన వాదనలో సోమయాజులు హైకోర్టు దృష్టికి తెచ్చారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్ని వివరించారు. కొరడా ఝుళిపించే విధంగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జీవ రత్నం, మరో అధికారి ఏకాంబరం నేతృత్వంలో కమిటీ ఏర్పాటుకు నిర్ణయించినట్టు బెంచ్ దృష్టికి తెచ్చారు. ఇందుకు బెంచ్ నిరాకరించింది. ఐఏఎస్ అధికారి జీవ రత్నంను సభ్యుడిగా నియమిస్తూ ఆ కమిటీకి చైర్మన్‌గా న్యాయమూర్తి ఎస్ రాజేశ్వరన్‌ను నియమించింది. రాజేశ్వరన్ నేతృత్వంలోని కమిటీ ఇక బ్యానర్లు, ఫ్లెక్సీలు, హోర్డింగ్‌ల వ్యవహారాల్ని పరిశీలిస్తుందని, అనుమతులు లేకుండా, ఇష్టా రాజ్యంగా, చట్ట విరుద్ధంగా ఏర్పాటు చేసే వాటిపై కొరడా ఝుళిపించే విధంగా ఈ కమిటీ నిర్ణయాలు తీసుకుంటుందని బెంచ్ స్పష్టం చేసింది.