= విద్యార్థులకు అందని వైనం
= పంపిణీలో పాలికె నిర్లక్ష్యం
= చలి తీవ్రతతో పాఠశాలలకు డుమ్మా కొడుతున్న విద్యార్థులు
= 20 శాతం పడిపోయిన హాజరు
= మరింత దిగజారే అవకాశం
సాక్షి, బెంగళూరు : బృహత్ బెంగళూరు మహా నగర పాలికె (బీబీఎంపీ) వైఖరి వల్ల విద్యాభివృద్ధికి గండిపడుతోంది. ప్రతి ఏటా చలి బారి నుంచి పాలికె పరిధిలోని విద్యార్థులను కాపాడేందుకు స్వెట్టర్లను అందజేయడం బీబీఎంపీ ఆనవాయితీగా పాటిస్తూ వచ్చింది. అంతేకాక బీబీఎంపీ పరిధిలోని పాఠశాలల్లో చదివే విద్యార్థులందరూ నిరుపేదలే. స్వెట్టర్లను కొనే ఆర్థిక స్థోమత వారి తల్లిదండ్రులకు ఉండదు. దీంతో పాలికె పాఠశాల్లో విద్యాభివృద్ధిని కాంక్షిస్తూ స్వెట్టర్లను ఇంతకాలం ఉచితంగా బీబీఎంపీ అందిస్తూ వచ్చింది.
అయితే ఈ ఏడాది చలికాలం ప్రారంభమై నెల కావస్తున్నా ఇప్పటికీ విద్యార్థులకు స్వెట్టర్లు అందలేదు. పంపిణీపై ఇప్పటికీ బీబీఎంపీ ఓ నిర్ణయానికి రాలేకపోయింది. పాలికె పరధిలో 102 ప్రాథమిక, ప్రాథమికోన్నత, 34 మాధ్యమిక పాఠశాలలు, 13 పీయూసీ, నాలుగు డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. వీటన్నింటిలో కలిపి మొత్తం 17 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ విద్యార్థులందరికీ విద్యా సంవత్సరం ఆరంభంలో యూనిఫాం, షూ, చలికాలంలో స్వెట్టర్లను పాలికె అందిస్తోంది. ఈ ఏడాది గతంలో ఎన్నడూ లేనంతగా చలి తీవ్రత ఉంటోంది. దీనికి తోడు ఇప్పటి వరకూ విద్యార్థులకు స్వెట్టర్లు అందలేదు. దీంతో పాఠశాలల్లో హాజరు 20 శాతం పడిపోయింది. భవిష్యత్తులో ఇది మరింత పెరిగే ప్రమాదముంది.
రాజకీయ జోక్యం వల్లే?
రాజకీయ జోక్యం వల్లనే విద్యార్థులకు సకాలంలో స్వెట్టర్లు అందకపోవడానికి కారణమని వెల్లడవుతోంది. గత ఏడాదిలో నిర్వహించిన టెండర్ ప్రక్రియలో తక్కువ ధరకు కోట్ చేసిన ఓ కంపెనీ అందజేసిన స్వెట్లరు నాణ్యత రహితంగా ఉన్నట్లు విమర్శలు వెల్లువెత్తాయి. ఆ కంపెనీకే ఈ ఏడాది కూడా కాంట్రాక్ట్ కట్టబెట్టేందుకు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే విశ్వప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఈ ఏడాది ఆగస్టులో నిర్వహించిన టెండర్ ప్రక్రియలో ఆ కంపెనీ తప్ప మరెవ్వరూ టెండర్ వేయలేదు. దీంతో మరోసారి టెండర్లను బీబీఎంపీ ఆహ్వానించింది. ఈ సారి కూడా ఆ ఒక్క కంపెనీ తప్ప మరెవ్వరూ పాల్గొనలేదు.
అయితే నిబంధనల ప్రకారం టెండర్ ప్రకియలో ఒక్క కంపెనీనే పాల్గొంటే కాంట్రాక్ట్‌ను అప్పగించరాదు. అయితే ఎలాగైనా సరే ఆ కంపెనీకే కాంట్రాక్ట్ అప్పగించాలని సదరు ఎమ్మెల్యే తీవ్ర ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. దీంతో పాలికె అధికారులు ఎటూ తేల్చుకోలేక పోతున్నారు. ఈ విషయమై బీబీఎంపీ అధికారి ఒకరు మాట్లాడుతూ... ‘సాధారణంగా నవంబర్‌లోనే విద్యార్థులకు స్వెట్టర్లు అందాల్సి ఉంది. పదిహేను రోజులుగా చలి తీవ్రత అధికంగా ఉంది. దీంతో హాజరు శాతం తగ్గింది. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. చూద్ధామన్న సమాధానం వస్తోంది’ అని తెలిపారు.
బీబీఎంపీలో స్వెట్టర్ల మాయాజాలం
Published Mon, Dec 23 2013 1:45 AM | Last Updated on Thu, Jul 11 2019 5:23 PM
Advertisement
Advertisement