పోటెత్తిన భద్ర‘గిరి’
పోటెత్తిన భద్ర‘గిరి’
Published Mon, Oct 17 2016 4:39 PM | Last Updated on Mon, Sep 4 2017 5:30 PM
భద్రాచలం: రామాలయ ప్రాంగణం గిరిపుత్రులతో జనసందోహంగా మారింది. శబరి మాత వంశస్తుల గిరి ప్రదర్శనతో భద్రగిరి, రామాలయ మాడవీధులు పులకించిపోయాయి. శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో శబరి స్మృతి యాత్ర ఉత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. వాల్మీకి జయంతిని పురస్కరించుకొని మొదట చిత్రకూట మండపం వద్ద ఉన్న వాల్మీకి విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ఖమ్మం జిల్లా జడ్జి విజయ్‌మోహన్, భద్రాచలం ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ బులికృష్ణ, దేవస్థానం ఈఓ రమేష్‌బాబు వాల్మీకి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆలయ ప్రధాన అర్చకులు పొడిచేటి జగన్నాథాచార్యులు ఆధ్వర్యంలో అర్చకులు, వేదపండితులు వాల్మీకికి విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం గావించి హారతి సమర్పించారు. శబరిమాత చిత్రపటానికి కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు.శబరిమాత చిత్రపటంతో గిరిజనుల కోలాటాలు, రేలా నృత్యాలు, కొమ్ము, కోయ డ్యాన్సులతో గిరి ప్రదక్షిణ చేశారు. ఈ సందర్భంగా తూము నర్సింహదాసు, భక్తరామదాసు, శబరి మాత విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
శబరి నదీ జలంతో అభిషేకం..
శబరి నది నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చిన జలంతో మేళతాళాలు, ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛరణల మధ్య ఆలయ ధ్వజస్తంభానికి అభిషేకం చేశారు. పసుపు, కుంకుమ చల్లి ధ్వజస్తంభంపై ముగ్గు వేసి బలిపీఠం కార్యక్రమాన్ని నిర్వహించారు. వేడుక కోసం ప్రత్యేకంగా తెప్పించిన వివిధ రకాల పుష్పాలు, పండ్లతో గిరిజనులు ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశారు. గిరిజనులు ప్రదర్శించిన నృత్యాలకు మంత్ర ముగ్ధులైన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ఎమ్మెల్యే సున్నం రాజయ్య కొమ్ము తలపాగా ధరించి, డోలు వాయిస్తూ గిరిజనులను ఉత్తేజపరిచారు.
రామయ్యకు పుష్పార్చన..
శ్రీసీతారామచంద్రస్వామి వారికి పుష్పార్చన అత్యంత వైభవోపేతంగా జరిగింది. ఉత్సవ మూర్తులను, శబరి మాత చిత్రపటాన్ని గర్భ గుడి నుంచి ఊరేగింపుగా చిత్రకూట మండపానికి తీసుకొచ్చారు. ఫల, పుష్పాలను మేళతాళాల మధ్య చిత్రకూటమండపానికి తీసుకొచ్చారు. తొలుత ఆలయ అర్చకులు, వేద పండితుల ‘శ్రీరామ సంపుటి’ని నిర్వహిస్తూ స్వామి వారికి ధూప దీప నైవేద్యాలను సమర్పించారు. ఈ సందర్భంగా ‘శ్రీరామాయనమః’ నామస్మరణతో చిత్రకూట మండపం మార్మోగింది. ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఫల, పుష్పాలతో సీతా లక్ష్మణ సమేతుడైన రామయ్య స్వామికి అర్చన నిర్వహించారు. ఈ సందర్భంగా కొంతమంది గిరిజన పెద్దలకు ఆలయం తరఫున ఎమ్మెల్యే సున్నం రాజయ్య చేతులమీదగా వస్త్రాలను, స్వామి వారి ప్రసాదాలను అందజేశారు.
పురవీధుల్లో గిరిజనుల ప్రదర్శన..
ఉత్సవంలో భాగంగా శబరి చిత్రపటంతో గిరిజనులు భద్రాచలం పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. రామాలయం నుంచి బ్రిడ్జి సెంటర్‌కు, అక్కడి నుంచి బస్టాండ్ మీదగా అంబేద్కర్ సెంటర్‌కు చేరుకుని కొమ్ము నృత్యాలను ప్రదర్శించారు. అనంతరం మార్కెట్ సెంటర్, తాతగుడి మీదగా తిరిగి రామాలయానికి చేరుకున్నారు. గిరిజనులు ప్రదర్శించిన కొమ్ము, కోయ నృత్యాలు ఆధ్యంతం భక్తులను, పట్టణ వాసులను ఆకట్టుకున్నాయి. వేడుకలకు అశ్వారావుపేట, ముల్కలపల్లి, చర్ల, దుమ్ముగూడెం మండలాలలతో పాటు, ఏపీలో విలీనమైన మండలాల నుంచి కూడా అధిక సంఖ్యలో గిరిజనులు తరలివచ్చారు. శబరి తిరిగిన ప్రాంగణమైన ఏపీలోని కూనవరం మండల కేంద్రానికి సమీపంలో ఉన్న శబరి నది వద్ద కూడా దేవస్థానం ఆధ్వర్యంలో అర్చకులు వెళ్లి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఏఈఓ శ్రావణ్‌కుమార్, డీఈ రవీందర్ రాజు, అగ్నిమాపక అధికారి సురేష్, ఆలయ పర్యవేక్షకులు భవానీ రామకృష్ణ, సీసీటూఈఓ అనిల్‌కుమార్, గిరిజన సంఘం పెద్దలు కృష్టదొర పాల్గొన్నారు. గిరిజనులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా భద్రాచలం సీఐ శ్రీనివాసుల ఆదేశాల మేరకు పట్టణ ఎస్‌సై కరుణాకర్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Advertisement
Advertisement