లైవ్‌లో బైక్ సర్వీసింగ్
బెంగళూరు: బైక్ సర్వీసింగ్, ఆయిలింగ్ ప్రక్రియను వాహనదారులు లైవ్‌లో దేశంలో ఎక్కడినుంచైనా వీక్షించే అవకాశాన్ని కల్పిస్తూ బెంగళూరులోని నమ్మ మెకానిక్ సంస్థ వాహనదారులకు వినూత్న సేవలు అందజేస్తోంది. సాధారణంగా ఎవరైనా బైక్ సర్వీసింగ్‌కు ఇచ్చిన తర్వాత ఆ ప్రక్రియ ఆలస్యమైతే వాహనం ఇచ్చి వచ్చేస్తారు. అయితే మెకానిక్ ఏ కంపెనీ ఆయిల్ వాడారో? ఒరిజినల్ స్పేర్‌పార్ట్స్ తీసి లోకల్ స్పేర్‌పార్ట్స్ వేసేరామో? అని వాహనదారులు పరిపరి విధాలుగా ఆలోచించడం పరిపాటి. ఇలాంటి సమస్యలకు, అనుమానాలకు చెక్ పెడుతూ బెంగళూరుకు చెందిన 'నమ్మ(మీ) మెకానిక్స్' సంస్థ బైక్ సర్వీస్ ఎలా జరుగుతోందో మీరు ఇంట్లో ఉండే ప్రత్యక్షంగా చూడవచ్చు.
ముందుగా గూగుల్ ప్లేస్టోర్‌కి వెళ్లి gdmmsliteయాప్‌ను మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలి. అటు పై ఈ సంస్థకు చెందిన www.nammamechanik.comలో వ్యక్తిగత వివరాలు, బైక్ వివరాలు నమోదు చేసి ఎప్పుడు సర్వీస్‌కు ఇస్తున్నామో తెలపాలి. తొంబై రోజుల ముందస్తు బుకింగ్ సదుపాయం కూడా ఉంది. మనం తెలియజేసిన రోజున కంపెనీ ప్రతినిధులు ఇంటి వద్దకే వచ్చి బైక్‌ను వీడియో తీసి సీడీ అందజేస్తారు. అనంతరం బైక్‌ను సర్వీస్ స్టేషన్‌కు తీసుకెళ్తారు. సర్వీస్ స్టేషన్‌లోని ఏ ర్యాంప్ పై మన బైక్ ఉందో తెలియజేసే టెక్ట్స్ మెనేజ్‌తో పాటు లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌ను కూడా మన మొబైల్ నంబర్‌కు పంపిస్తారు. వీటిని ఉపయోగించి బైక్ సర్వీస్ జరుగుతున్న తీరును నేరుగా వీక్షించవచ్చు. ఏవైనా సందేహాలు, సూచనలు ఉంటే కంపెనీ సిబ్బందితో నేరుగా ఫోన్లో మాట్లాడే అవకాశం కూడా ఉంది. సర్వీస్ పూర్తయిన తర్వాత వాహనంలో బైక్‌ను ఇంటి వద్దకు తీసుకు వచ్చి కంపెనీ సిబ్బంది అప్పగిస్తారని సంస్థ ఎండీ ఎన్‌టీ అరుణ్‌కుమార్ తెలిపారు.