మోడీ ర్యాలీ కోసం కసరత్తు.
Published Sun, Sep 22 2013 12:00 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ ప్రధాన మంత్రి అభ్యర్థి హోదాలో నరేంద్ర మోడీ అధ్యక్షతన ఈ నెల 29న ఢిల్లీలో నిర్వహించనున్న ర్యాలీని విజయవంతం చేసేం దుకు స్థానిక పార్టీ నాయకులు కసరత్తును మొదలెట్టారు. ఇందుకోసం ఉత్తర ఢిల్లీ రోహిణిలోని జపనీస్ పార్క్‌లో రోజూ సమావేశమవుతున్నారు. ‘ప్రతి రోజు సమావేశమవుతున్నాం. ఈ ర్యాలీ సన్నాహాల్లో అందరూ నాయకులతో పాటు వాలంటీర్లు కూడా పాల్గొంటున్నార’ని ర్యాలీ ఏర్పాట్ల నిర్వాహకుడు, బీజేపీ సీనియర్ నాయకుడు విజేందర్ గుప్తా శనివారం విలేకరులకు తెలిపారు. ఇక్కడ ఏర్పాట్ల కోసం 2,000 మంది వాలంటీర్‌లు సహాయసహకారాలు అందిస్తున్నారు. భారీ మొత్తంలో ఎల్‌ఈడీ స్క్రీన్‌లు, సీసీ టీవీ కెమెరాలు, బ్యానర్‌లు, పార్కింగ్ స్థల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారని చెప్పారు.
‘పార్క్ మొత్తం 25 ఎల్‌ఈడీ స్క్రీన్‌లను ఏర్పాటుచేస్తున్నాం. స్టేజీకి దూరంగా ఉండే ప్రజలు కూడా నరేంద్ర మోడీని స్క్రీన్ ద్వారా చూసే అవకాశముంటుంద’ని గుప్తా వివరించారు. రోహిణికి రాని వారి కోసం నగరంలోని వివిధ ప్రాంతాల్లో, మార్కెట్ ప్రదేశాల్లో 100 స్క్రీన్‌లు ఏర్పాటుచేస్తున్నామని చెప్పారు. పార్క్‌కు సమీపంలో 5,000 కారులు, బస్సులు నిలిపేలా తాత్కాలిక పార్కింగ్ వసతి కల్పిస్తున్నామని తెలిపారు. భద్రత చర్యలకు ప్రాధాన్యమిస్తున్నామని, సీసీటీవీ కెమెరాలు, ప్రైవేట్ భద్రతాసిబ్బంది సహాయం తీసుకుంటున్నామని వివరించారు. భద్రత కారాణాల రీత్యా మోడీ విమానంలో వేదికకు చేరుకునే అవకాశముందన్నారు. ‘ఈ ర్యాలీకి కనీసం నాలుగు లక్షల మంది వస్తారని భావిస్తున్నాం. ఈ పార్క్ సామర్థ్యం నాలుగు నుంచి ఐదు లక్షల మేర ఉంటుంద’ని గుప్తా తెలిపారు. ఈ ర్యాలీలో అవినీతి, ధరల పెరుగుదల, శాంతి భద్రతలపైనే ప్రధాన ప్రస్తావన ఉంటుందని వివరించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశముందని తెలిపారు.
Advertisement
Advertisement