పొత్తిళ్లలోనే బిడ్డ దొంగలపాలు
పదేళ్లు దాటినా ఆచూకీ లేని వైనం
అంధ దంపతుల ఆవేదన
కళ్లు లేకపోతేనేం ఆ కళ్లు భవిష్యత్తుపై ఎన్నో కలలుగన్నాయి. కంటి చూపులేని తమకు కన్నబిడ్డలే చుక్కానిగా నిలుస్తారని ఆశపడ్డాయి. పొత్తిళ్లలోనే పురిటిబిడ్డ దొంగల పాలు కావడంతో ఆ దంపతుల ఆశలు అడియాశలయ్యాయి. దొంగలెత్తుకెళ్లిన బిడ్డ తిరిగి వస్తాడని చూపులేని ఆ కళ్లు పదేళ్లుగా ఎదురుచూపులు చూస్తున్నాయి.
చెన్నై
మదురై అన్నానగర్‌కు చెందిన ముత్తుమాణిక్యం, మారీశ్వరి దంపతులు పుట్టుకతో అంధులు. ముత్తుమాణిక్యం అన్నానగర్‌లోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో లిఫ్ట్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. భార్య మారీశ్వరి ప్రసవం కోసం మదురై ప్రభుత్వ రాజాజీ ఆసుపత్రిలో చేరి 2006 జనవరి 6వ తేదీన పండంటి ఆడ శిశువుకు జన్మనిచ్చింది. తల్లి కళ్లులేని విషయాన్ని గమనించిన గుర్తుతెలియని వ్యక్తి ప్రసవించిన కొన్ని గంటల్లోనే వారి బిడ్డను ఎత్తుకెళ్లాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం దక్కలేదు. ఆ మరుసటి ఏడాది మారీశ్వరి మళ్లీ గర్భం దాల్చింది.
ఈసారి తన బిడ్డను కాపాడుకునేందుకు ప్రభుత్వ ఆసుపత్రికి కాకుండా ప్రయివేటు ఆసుపత్రిలో ప్రసవించింది. రెండోసారి కూడా ఆడశిశువే పుట్టింది. ప్రస్తుతం రెండో బిడ్డ నాలుగో తరగతి చదువుతోంది. మొదటి బిడ్డను దొంగలెత్తుకెళ్లి ఈనాటికి పదేళ్ల మూడు నెలలు అవుతోంది. ఈ దంపతులకు జరిగిన నష్టానికి పరిహారంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే రూ.3లక్షలను చెల్లించింది. ఈ సొమ్మును రెండో శిశువు పేరిట బ్యాంకులో ఫిక్సిడ్ డిపాజిట్టు చేశారు. మదురై హైకోర్టు శాఖ బార్ కౌన్సిల్ వారు రెండో శిశువు కాలేజీ చదువుల వరకు అయ్యే ఖర్చును తాము భరిస్తామని ముందుకు వచ్చారు. రెండో బిడ్డ పుట్టినా కన్నవారి కడుపుతీపి మొదటి బిడ్డను మరువలేకపోతోంది.
మొదటి బిడ్డను తెచ్చివ్వండి పోలీసు బాబులు
ఈ దయనీయ పరిస్థితిపై ముత్తురామలింగం మీడియాతో మాట్లాడుతూ మొదటి బిడ్డ ఉండి ఉంటే ఈ పదేళ్లలో ఎంతగా ఎదిగి ఉండేది అనే ఆలోచనలతోనే బతుకుతున్నాం. కంటి చూపులేని కారణంగా కాయకష్టం చేసి ఎక్కువగా సంపాదించలేని పరిస్థితి. ఈ కష్టకాలంలో ఎంతో తోడుగా నిలుస్తుందని ఆశపడ్డాం. నా సంపాదన ఇంటి బాడుగకు, కడుపు నింపుకునేందుకు కూడా సరిపోవడం లేదు.
అరకొర సంపాదనైనా ఎవరి వద్ద చేయి చాచకుండా గౌరవప్రదమైన జీవితాన్ని గడుపుతున్నాం. ఇటువంటి గడ్డు పరిస్థితిలో ప్రభుత్వం ఇచ్చిన రూ.3లక్షలు, బార్ కౌన్సిల్ సహాయం మాకు ఎంతో ఊరటనిచ్చింది. ఆపద సమయంలో అండగా నిలిచిన ముఖ్యమంత్రికి, బార్ కౌన్సిల్‌కు ఎంతో కృతజ్ఞతలు. మాకు వచ్చిన కష్టం మరే తల్లిదండ్రులకు రాకూడదని ఆ భగవంతుని వేడుకుంటున్నాను. కంటిచూపు లేని మాకు కన్నబిడ్డలే ఆధారం. దొంగలెత్తుకెళ్లిన మా మొదటి బిడ్డను పోలీసులు వెతికి తెచ్చిస్తే మరింతగా రుణపడి ఉంటాం. ఆ మేరకు పోలీసులు సహకరించాలని కోరుతున్నాం. - ముత్తురామలింగం, బిడ్డ తండ్రి
చూపు లేకున్నా ఎదురుచూపులు
Published Wed, Nov 4 2015 8:38 AM | Last Updated on Wed, Apr 3 2019 4:04 PM
Advertisement
Advertisement