ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, రేణిగుంట: అమ్మమ్మ మందలించిందని ఓ మనవరాలు ఇంటి నుంచి అదృశ్యమైంది. ఎక్కడెక్కడో తిరిగి చివరికి రేణిగుంటకు చేరింది. అదృష్టవశాత్తు సీఐ అంజూయాదవ్ దృష్టికి రావడంతో వ్యవహారం సుఖాంతమైంది. కుటుంబ సభ్యుల దరికి చేరింది. శనివారం రాత్రి సీఐ తెలిపిన వివరాలు.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన యువతి(18) చెన్నైలో చదువుతోంది. అక్కడే అమ్మమ్మ ఇంటిలో ఉంటోంది. ఆమె తల్లి ఓ ప్రైవేటు స్కూలులో టీచర్‌గా పనిచేస్తోంది. చదువుల పరంగా వెనుకబడిపోతున్నావని అమ్మమ్మ ఇటీవల మందలించడంతో ఇంటి నుంచి పారిపోయింది. ఈమేరకు చెన్నైలో మిస్సింగ్ కేసు కూడా నమోదైంది.
చెన్నై నుంచి గుంటూరు ఇతర ప్రాంతాలకు వెళ్లిన యువతి శనివారం రేణిగుంటలో ప్రత్యక్షమైంది. ఆమె అనుమానాస్పదంగా సంచరిస్తుండడంతో ఆటోడ్రైవర్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సీఐ ఆ యువతిని తన వెంట స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఒకింత బెరుకు, భయంతో ఉన్న విద్యార్థినికి తొలుత అల్పాహారం తెప్పించి పెట్టారు. ఆ తర్వాత అనునయించి మాట్లాడితే విషయం చెప్పింది. ఇలా చెప్పాపెట్టకుండా ఇంటి నుంచి వచ్చేస్తే కుటుంబ సభ్యులు ఎంతగా టెన్షన్ పడతారో..ఆలోచించావా తల్లీ? అంటూ బుజ్జగించారు.
చదవండి: (చిరునవ్వుతో భర్తకు ఎదురెళ్లింది.. ఏమైందో తెలియదు.. కొద్ది నిమిషాల్లోనే..)
కుటుంబ సభ్యుల వివరాలతో పాటు ఆ విద్యార్థి వద్ద ఉన్న ఐడీ కార్డును చూసి ఎక్కడ చదువుతోందో తెలుసుకున్నారు. ఆ విద్యార్థిని తల్లి, అమ్మమ్మతో తన ఫోన్ నుంచి మాట్లాడించారు. అంతే! ఉరుకులు పరుగులతో ఆ విద్యార్థిని తల్లి తన కుమారుడితో వచ్చి శనివారం రాత్రి సీఐను కలిసింది. కుమార్తెను చూడగానో భావోద్వేగంతో కదలిపోయింది. అప్పటివరకు పడిన టెన్షన్ ఎగిరిపోయిందేమో..! కళ్ల నుంచి రాలుతున్న ఆనందభాష్పాల నడుమ కుమార్తెను హత్తుకుంది. పోలీసుల మోముల్లో నవ్వులు పూశాయి.
Comments
Please login to add a commentAdd a comment