'ఉగ్రభూతాన్ని తరిమికొట్టాలి'
► కొవ్వొత్తులతో నివాళులర్పించిన బీజేపీ
► ఏబీవీపీ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దహనం
ఒంగోలు : కశ్మీర్‌లోయలోని యురీ సెక్టార్‌లో పాక్ దుశ్చర్యకు అమరులైన జవానుల ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ సోమవారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీతో నివాళులర్పించారు. స్థానిక చర్చి సెంటర్ నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పీవీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తోందన్నారు.
ఉగ్రభూతాన్ని తరిమికొట్టాలని ఏబీవీపీ టెక్నికల్ జిల్లా కన్వీనర్ విజయ్‌బాబు అన్నారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో స్థానిక కోర్టు సెంటర్‌లో ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రభుత్వం ఆదేశిస్తే ఏబీవీపీ కార్యకర్తలు యుద్ధరంగంలోకి దిగేందుకు సిద్ధమన్నారు. బీజేపీ నాయకులు బత్తిన నరసింహారావు, ఖలీఫాతుల్లాబాషా, ఆర్‌ఎస్‌ఎస్ జిల్లా ప్రచారక్ చంద్రశేఖర్, ఏబీవీపీ నగర సంఘటన కార్యదర్శి హనుమంతు తదితరులు పాల్గొన్నారు.