
న్యాయనిపుణులతో చర్చిస్తాం
బెంగళూరు: లోకాయుక్త న్యాయమూ ర్తి వై.భాస్కర్‌రావును పదవి నుంచి తొల గించే అంశంపై న్యాయనిపుణులతో చర్చిం చి నిర్ణయం తీసుకోనున్నట్లు స్పీకర్ కాగో డు తిమ్మప్ప వెల్లడించారు. బెళగావిలోని సువర్ణసౌధలో సోమవారం తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడారు. లోకాయుక్తను పదవి నుంచి తొలగించాలని ప్రతి పక్షాల ఎమ్మెల్యేలు సంతకాలు చేసి ఇవ్వడంపై ప్రస్తుతం తాను స్పందించలేనని కాగోడు తిమ్మప్ప తెలిపారు. లోకాయుక్తను పదవి నుంచి తొలగించే అంశంపై ఉన్నట్లుండి నిర్ణయం తీసుకోలేమని, ఈ విషయానికి సంబంధించి న్యాయపరమైన చిక్కుల గురించి సైతం ఆలోచించాల్సి ఉంటుందని స్పీకర్ కాగోడు తిమ్మప్ప వెల్లడించారు.
సవరణలు చేసే వరకు సాధ్యం కాదు
లోకాయుక్త న్యాయమూర్తి వై.భాస్కర్‌రావును ఆ పదవి నుంచి తొలగించే అంశానికి సంబంధించి చట్టసభల్లో చర్చను చేపట్టాలని ప్రతిపక్షాలు పట్టుపడుతున్న నేపథ్యం లో సోమవారం సాయంత్రం స్పీకర్ నేతృత్వంలో శాసనసభా సలహా సమితి సభ జరిగింది. లోకాయుక్తను పదవి నుంచి తొలగించేందుకుగాను చర్చ చేపట్టడానికి గల సాధ్యాసాధ్యాలను సమీక్షించేందుకు స్పీకర్ కాగోడు తిమ్మప్ప, ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతోపాటు అన్ని పార్టీలకు చెందిన ముఖ్య నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న అడ్వొకేట్ జనరల్ రవివర్మ కుమార్, న్యాయమూర్తుల తొలగింపునకు సంబంధించి ప్రస్తుతం ఉన్న చట్టాల్లో సవరణలు తీసుకొచ్చే వరకు చట్టసభల్లో ఈ అంశంపై చర్చించడం సాధ్యం కాదని సలహా సమితికి వివరించారు. ముందుగా న్యాయమూర్తుల తొలగింపు చట్టంలో సవరణలు తీసుకురావాలని, ఆ తర్వాత మాత్రమే లోకాయుక్తను ఆ పదవి నుంచి తొలగించే అంశంపై చట్టసభల్లో చర్చించేందుకు సాధ్యమవుతుందని అడ్వకేట్ జనరల్ స్పష్టం చేయడంతో తదుపరి చర్యలపై పార్టీల నేతలు సమాలోచనలు చేస్తున్నారు.