సాక్షి ప్రతినిధి, బెంగళూరు :
వంట గ్యాస్‌కు నగదు బదిలీ పథకం నగరంతో పాటు పలు జిల్లాల్లో ప్రారంభమైంది. బ్యాంకు ఖాతాతో ఆధార్ సంఖ్యను అనుసంధానం చేసిన వారికి ఇకమీదట సబ్సిడీ మొత్తాన్ని ఆయా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. అంటే... ఇక వంట గ్యాస్‌ను బుక్ చేసిన వినియోగదారులు మార్కెట్ ధరకు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. వారం తర్వాత సబ్సిడీ మొత్తం బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది. ఆధార్ సంఖ్యను బ్యాంకు ఖాతాతో అనుసంధానం చేయని వినియోగదారులకు చమురు కంపెనీలు మూడు నెలలు గడువునిచ్చాయి. అప్పటి వరకు సబ్సిడీ ధరపైనే సిలిండర్లను సరఫరా చేస్తారు. వచ్చే ఏడాది మార్చి ఒకటో తేదీలోగా అనుసంధాన ప్రక్రియను పూర్తి చేయకపోతే మార్కెట్ ధరకే సిలిండర్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
ఆధార్ లేకపోతే...
వంట గ్యాస్ వినియోగదారులు ఆధార్ సంఖ్యను బ్యాంకు ఖాతా, వంట గ్యాస్ ఏజెన్సీల వద్ద అనుసంధానం చేయిస్తే అత్యుత్తమం. గ్యాస్ ఏజెన్సీ, బ్యాంకుల వద్దకెళ్లి ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. దీని కోసం బ్యాంకు, గ్యాస్ ఏజెన్సీలకు ప్రత్యేక అర్జీలను పూర్తి చేసి సమర్పిస్తే సరిపోతుంది. ఆధార్ కార్డు నకళ్లను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు ఇంకా లభించని వారు బెంగళూరు వన్ కేంద్రాలకు వెళ్లి ఈ-ఆధార్ సంఖ్యను పొందవచ్చు. ఆధార్ నమోదు కేంద్రాల్లో ఇచ్చిన రసీదుల నకళ్లను సమర్పించినా సరిపోతుంది. కాగా గ్యాస్ వినియోగదారులకు పలు బ్యాంకుల్లో ఖాతాలున్నప్పటికీ, ఏదైనా ఒక బ్యాంకు వద్దే ఆధార్ అనుసంధానం చేయించాలని అధికారులు సూచిస్తున్నారు. తమకు ఖాతాలున్న అన్ని బ్యాంకులతో అనుసంధానం చేస్తే భవిష్యత్తులో అనేక ఇబ్బందులు తలెత్తడమే కాకుం డా సబ్సిడీ లభించకపోయే
ప్రమాదం కూడా ఉందని వారు హెచ్చరిస్తున్నారు.
ఈ నెల ఒకటి నుంచి...
బెంగళూరు సహా హావేరి, కొప్పళ, బీదర్, దావణగెరె, బిజాపురలలో ఈ నెల ఒకటో తేదీ నుంచి నగదు బదిలీ పథకం అమలులోకి వచ్చింది. ఇదివరకే మైసూరు, తుమకూరు, ధార్వాడ, ఉడిపి, ఉత్తర కన్నడ, గదగ జిల్లాల్లో ఈ పథకం అమలులో ఉంది. మిగిలిన 18 జిల్లాల్లో వచ్చే జనవరి ఒకటో తేదీ నుంచి అమలులోకి వస్తుంది.
70 శాతం మందికి ఆధార్
2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా ఆరు కోట్లా 11 లక్షలా 30 వేలా 704 మంది కాగా నాలుగు కోట్లా 30 లక్షలా ఏడు వేలా 539 మంది ఆధార్ పరిధిలోకి వచ్చారు. వీరిలో మూడు కోట్లా 44 లక్షలా 15 వేలా 581 మందికి ఆధార్ కార్డులు కూడా అందాయి. బెంగళూరులో 77 లక్షలా తొమ్మిది వేలా 78 మంది ఆధార్ కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకోగా, ఇప్పటి వరకు 57 లక్షలా 19 వేలా 319 మందికి ఆధార్ సంఖ్య లభించింది.