న్యూఢిల్లీ: ప్రయాణికుల భద్రతపై ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ ప్రత్యేక దృష్టిని సారించింది. నగరంలో 2012 డిసెంబర్ 16వ తేదీన జరిగిన ‘నిర్భయ’ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దీంతో ప్రయాణికుల భద్రతపై మరింత దృష్టి పెట్టాలని డీటీసీ, రవాణా శాఖలు ప్రతిపాదించాయి. ఈ మేరకు డీటీసీ బస్సుల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. దీనిలో భాగంగా డీటీసీకి చెందిన 200 బస్సుల్లో ఒక్కొక్కదాంట్లో రెండేసి కెమెరాలను ఏర్పాటుచేయనున్నారు. ఈ సందర్భంగా రవాణా శాఖకు చెందిన ఒక సీనియర్ అధికారి మాట్లాడుతూ..‘2012 డిసెంబర్ 16న నగరంలో ఒక నడుస్తున్న బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం జరిగిన దరిమిలా ప్రభుత్వ రవాణా వాహనాల్లో భద్రతను పెంచాలని నిర్ణయించాం.
సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తయ్యింది. ఎన్నికల నియమావళి పూర్తయిన తర్వాత పనులు ఫ్రారంభిస్తాం..’ అని తెలిపారు. ఏయే రూట్ల బస్సుల్లో వీటిని అమర్చాలనేది యోచిస్తున్నామన్నారు. కార్యాలయాల పనివేళల్లో, రాత్రి వేళల్లో తిరిగే బస్సుల్లో మొదట వీటిని ఏర్పాటు చే యనున్నట్లు ఆయన వివరించారు. అయితే ఏసీ, నాన్-ఏసీ బస్సుల్లో ఈ సదుపాయం కచ్చితంగా అమలవుతుందని స్పష్టం చేశారు. ఒక బస్సులో ఏర్పాటుచేసే కెమెరాలు ఆ బస్సులో జరిగే మొత్తం కార్యకలాపాలను చిత్రీకరిస్తాయని, ఆ సమాచారం మొత్తం 15 రోజుల వరకు అందుబాటులో ఉంటుందని సదరు రవాణా శాఖ అధికారి తెలిపారు. 15 రోజుల తర్వాత ఆ సమాచారాన్ని డీటీసీ అధికారులు తమ వద్ద భద్రపరుస్తారని వివరించారు. ఈ కెమెరాల ఏర్పాటు వల్ల జేబు దొంగతనాలు, అస్వస్థతకు గురైన ప్రయాణికులకు అందిన వైద్య సేవలను సైతం రికార్డు చేసే అవకాశముందన్నారు.
సాధారణంగా కదిలే బస్సుల్లో జరిగే నేరాలకు సంబంధించి సాక్ష్యాధారాలను సేకరించడంలో పోలీసులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిఘా నేత్రాల ఏర్పాటువల్ల నిందితులను పట్టుకోవడం సులభతరమవుతుంది..దీంతో నేరాల సంఖ్యను అదుపుచేయడం సాధ్యమవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, ప్రయోగాత్మకంగా డీటీసీ బస్సుల్లో ఈ నిఘా నేత్రాలను ఏర్పాటుచేసిన తర్వాత క్రమేపీ ఈ సదుపాయాన్ని ప్రైవేట్ వాహనాలకూ విస్తరించనున్నారు. వసంత్ విహార్ సామూహిక అత్యాచారం తర్వాత మహిళల భద్రత నిమిత్తం బస్సుల్లో సీసీటీవీ కెమెరాలను వెంటనే ఏర్పాటు చేయాలని రవాణా శాఖకు జాతీయ రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఆదేశించింది. అలాగే 10 లక్షల జనాభా దాటిన ప్రతి పట్టణంలోనూ మహిళా భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. కాగా, ఇప్పటికే పలు బస్టాండ్లలో సీసీటీవీ కెమెరాలను అమర్చిన విషయం తెలిసిందే.
డీటీసీ బస్సుల్లో నిఘానేత్రాలు
Published Sat, Apr 26 2014 10:42 PM | Last Updated on Sat, Sep 2 2017 6:33 AM
Advertisement
Advertisement