DTC buses
-
మెట్రో కార్డుతో 250 బస్సుల్లో జర్నీ
సాక్షి , న్యూఢిల్లీ : మెట్రో కార్డులతో ఢిల్లీ ప్రయాణీకులు ఎంపిక చేసిన 250 బస్సుల్లో తిరగవచ్చని ఢిల్లీ రవాణా మంత్రి కైలాష్ గెహ్లాట్ చెప్పారు. మెట్రో, ఢిల్లీ రవాణా సంస్థ బస్సులు, క్లస్టర్ బస్సుల్లో ఒకే కార్డుతో జర్నీ చేయడంపై నెలరోజులు ఎంపిక చేసిన బస్సుల్లో పరిశీలిస్తామని మంత్రి తెలిపారు. ఆయా బస్సుల్లో ఎలక్ర్టానిక్ టికెటింగ్ యంత్రాల్లో (ఈటీఎం) మెట్రో కార్డును ట్యాప్ చేయడం ద్వారా ప్రయాణాలు సాగించవచ్చన్నారు. మెట్రో కార్డును ట్యాప్ చేయగానే టికెట్ జనరేట్ అవుతుంది. ఈ టికెట్‌పై మెట్రో కార్డులో బ్యాలెన్స్ వివరాలూ పొందుపరుస్తారు. ఇక ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అన్ని బస్సుల్లో మెట్రో కార్డును కామన్ కార్డుగా అనుమతిస్తారు. -
డీటీసీ బస్సుల్లో సీసీటీవీ కెమెరాలు
న్యూఢిల్లీ: నగరవాసులకు ముఖ్యంగా మహిళా ప్రయాణికులకు భద్రతే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఢిల్లీ రవాణా సంస్థ (డీటీసీ) తాజాగా 200 బస్సుల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటుచేసింది. రాజ్‌ఘాట్, సరోజినీనగర్ డిపోకు చెందిన బస్సుల్లో వీటిని ఏర్పాటు చేశామని సంబంధిత అధకారి ఒకరు తెలియజేశారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఏడు గంటలపాటు దృశ్యాలను నమోదు చేయగల సామర్థ్యం ఈ కెమెరాలకు ఉందన్నారు. తొలి విడతలో భాగంగా వీటిని బస్సుల్లో అమర్చామన్నారు. మలివిడతలో మరిన్ని బస్సులకు వీటిని ఏర్పాటు చేస్తామన్నారు. తొలి విడత విజయవంతంగా పూర్తయిందన్నారు. తొలివిడత కింద అమర్చిన సీసీటీవీ కెమెరాల పనితీరును ప్రస్తుతం పరిశీలిస్తున్నామన్నారు. ఈ కెమెరాలు రాత్రి వేళల్లో డీటీసీ బస్సుల్లో రాకపోకలు సాగించే మహిళలకు ఎంతో ఉపయుక్తమవుతాయన్నారు. రాజ్‌ఘాట్, సరోజినీనగర్ డిపోల్లో కంట్రోల్‌రూంలను ఏర్పాటు చేశామని, ఈ కెమెరాలు నమోదు చేసే దృశ్యాలను నిపుణులు ప్రతిరోజూ పరిశీ లిస్తుంటారని తెలిపారు. సీసీటీవీ కెమెరాల్లో 15 గంటలపాటు నమోదైన దృశ్యాలను ఆయా కంప్యూటర్లలో భద్రపరుస్తామని తెలిపారు. డిసెంబర్, 16నాటి సామూహిక అత్యాచార ఘటన నేపథ్యంలో డీటీసీ యాజమాన్యం రాత్రివేళల్లో సేవలందించే బస్సుల్లో ఇద్దరు హోంగార్డులను నియమించిన సంగతి విదితమే. -
పర్యాటకులకు ‘మెట్రో మ్యాప్’
న్యూఢిల్లీ: జాతీయ రాజధానిలో పలు ప్రాంతాలను సందర్శించేందుకు వచ్చే పర్యాటకులకు ఇబ్బం దులు తొలగిపోయినట్లే.. నగరంలో పర్యాటక ప్రాంతాల సంఖ్య ఎక్కువే.. దేశ రాజధాని కావడంతో విదేశీయులు ఎక్కువగా ఇక్కడ ప్రదేశాలను సందర్శించేందుకు ఉత్సాహం చూపిస్తారు. అయితే వారికి ఇంతకుముందు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్లడానికి సరైన మార్గదర్శకం లేక ఇబ్బందులు పడేవారు. అటువంటి పర్యాటకుల సౌకర్యార్థం ఢిల్లీ మెట్రో ఒక రూట్ మ్యాప్‌ను తయారుచేస్తోంది. మెట్రో కారిడార్లు, మెట్రో ఫీడర్ సర్వీసులు, డీటీసీ బస్సుల సేవలను అనుసంధానించి ఈ రూట్‌మ్యాప్‌ను తయారుచేస్తున్నట్లు మెట్రో అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం మెట్రో, డీటీసీ రూట్ల అనుసంధానంపై సమాచారం ఇచ్చేవారు లేకపోవడంతో సందర్శకులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాగా ఈ మ్యాప్‌లో ఫేజ్-3 సహా మొత్తం మెట్రో నెట్వర్క్, మెట్రో ఫీడర్ బస్ సేవలను గుర్తిస్తారు. అలాగే ఆయా మెట్రో స్టేషన్లకు సమీపంలో అందుబాటులో ఉండే డీటీసీ బస్సుల గురించి కూడా సమాచారం ఉంటుంది. మ్యాప్‌లో సమీప రైల్వే స్టేషన్లతో పాటు ముఖ్యమైన సందర్శక ప్రదేశాలను క్రమపద్ధతిలో గుర్తిస్తారు. ఈ విషయమై మెట్రో అధికార ప్రతినిధి అనుజ్ దయాల్ మాట్లాడుతూ.. ఈ మ్యాప్ మెట్రో వెబ్సైట్లో అందుబాటులో ఉంటుందని చెప్పారు. ఇందులో మెట్రో ఫేజ్-3 లైన్లతో సహా మొత్తం నెట్వర్క్ సమాచారంతోపాటు, ఫీడర్ బస్ సర్వీస్, డీటీసీ బస్ రూట్లకు సంబంధించిన సమాచారం పొందుపరచబడి ఉంటుందన్నారు. ఈ మ్యాప్‌లో పలు స్థాయిలలో సమాచారం అందించబడుతుందని ఆయన వివరించారు. ఉదాహరణకు.. ఫీడర్ బస్ సర్వీస్‌కు , సమీప మెట్రో స్టేషన్ మధ్య ఉన్న సంబంధాన్ని మొదటి స్థాయిలో చూపిస్తే.. మెట్రోస్టేషన్‌కు సమీప బస్‌స్టాప్‌లో అందుబాటులో ఉండే డీటీసీ రూట్ల గురించి రెండో స్థాయిలో సమాచారం పొందుపరచబడి ఉంటుందన్నారు. ఢిల్లీ- గుర్గావ్ కారిడార్‌కు అందుబాటులో ఉండే డీటీసీ బస్ రూట్లను ఈ మ్యాప్‌లో పసుపు రంగు లైన్‌తో సూచిస్తారని ఆయన ఉదహరించారు. ఈ మ్యాప్‌కు సంబంధించి మొదటి ప్రచురణ మరో రెండు నెలల్లో అందుబాటులోకి వస్తుందని దయాల్ తెలిపారు. వాటిని మెట్రో స్టేషన్లతో పాటు వివిధ ప్రాంతాల్లో ప్రదర్శించనున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా ఫేజ్-3లోని కారిడార్లను సందర్శకులు మ్యాప్‌లో సులభంగా గుర్తించేందుకు వివిధ రంగులను వాడాలని డీఎంఆర్సీ నిర్ణయించింది. ముకుంద్‌పూర్ నుంచి శివ్ విహార్ వరకు ఉన్న కారిడార్(ఏడవలైను)కు ‘పింక్’, పశ్చిమ జనక్‌పురి నుంచి బొటానికల్ గార్డెన్(లైన్ 8) వరకు వ్యాపించి ఉన్న కారిడార్‌ను గుర్తించేందుకు గులాబీ రంగును వాడాలని నిర్ణయం తీసుకుంది. -
డీటీసీ బస్సుల్లో నిఘానేత్రాలు
న్యూఢిల్లీ: ప్రయాణికుల భద్రతపై ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ప్రత్యేక దృష్టిని సారించింది. నగరంలో 2012 డిసెంబర్ 16వ తేదీన జరిగిన ‘నిర్భయ’ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దీంతో ప్రయాణికుల భద్రతపై మరింత దృష్టి పెట్టాలని డీటీసీ, రవాణా శాఖలు ప్రతిపాదించాయి. ఈ మేరకు డీటీసీ బస్సుల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. దీనిలో భాగంగా డీటీసీకి చెందిన 200 బస్సుల్లో ఒక్కొక్కదాంట్లో రెండేసి కెమెరాలను ఏర్పాటుచేయనున్నారు. ఈ సందర్భంగా రవాణా శాఖకు చెందిన ఒక సీనియర్ అధికారి మాట్లాడుతూ..‘2012 డిసెంబర్ 16న నగరంలో ఒక నడుస్తున్న బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం జరిగిన దరిమిలా ప్రభుత్వ రవాణా వాహనాల్లో భద్రతను పెంచాలని నిర్ణయించాం. సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తయ్యింది. ఎన్నికల నియమావళి పూర్తయిన తర్వాత పనులు ఫ్రారంభిస్తాం..’ అని తెలిపారు. ఏయే రూట్ల బస్సుల్లో వీటిని అమర్చాలనేది యోచిస్తున్నామన్నారు. కార్యాలయాల పనివేళల్లో, రాత్రి వేళల్లో తిరిగే బస్సుల్లో మొదట వీటిని ఏర్పాటు చే యనున్నట్లు ఆయన వివరించారు. అయితే ఏసీ, నాన్-ఏసీ బస్సుల్లో ఈ సదుపాయం కచ్చితంగా అమలవుతుందని స్పష్టం చేశారు. ఒక బస్సులో ఏర్పాటుచేసే కెమెరాలు ఆ బస్సులో జరిగే మొత్తం కార్యకలాపాలను చిత్రీకరిస్తాయని, ఆ సమాచారం మొత్తం 15 రోజుల వరకు అందుబాటులో ఉంటుందని సదరు రవాణా శాఖ అధికారి తెలిపారు. 15 రోజుల తర్వాత ఆ సమాచారాన్ని డీటీసీ అధికారులు తమ వద్ద భద్రపరుస్తారని వివరించారు. ఈ కెమెరాల ఏర్పాటు వల్ల జేబు దొంగతనాలు, అస్వస్థతకు గురైన ప్రయాణికులకు అందిన వైద్య సేవలను సైతం రికార్డు చేసే అవకాశముందన్నారు. సాధారణంగా కదిలే బస్సుల్లో జరిగే నేరాలకు సంబంధించి సాక్ష్యాధారాలను సేకరించడంలో పోలీసులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిఘా నేత్రాల ఏర్పాటువల్ల నిందితులను పట్టుకోవడం సులభతరమవుతుంది..దీంతో నేరాల సంఖ్యను అదుపుచేయడం సాధ్యమవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, ప్రయోగాత్మకంగా డీటీసీ బస్సుల్లో ఈ నిఘా నేత్రాలను ఏర్పాటుచేసిన తర్వాత క్రమేపీ ఈ సదుపాయాన్ని ప్రైవేట్ వాహనాలకూ విస్తరించనున్నారు. వసంత్ విహార్ సామూహిక అత్యాచారం తర్వాత మహిళల భద్రత నిమిత్తం బస్సుల్లో సీసీటీవీ కెమెరాలను వెంటనే ఏర్పాటు చేయాలని రవాణా శాఖకు జాతీయ రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఆదేశించింది. అలాగే 10 లక్షల జనాభా దాటిన ప్రతి పట్టణంలోనూ మహిళా భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. కాగా, ఇప్పటికే పలు బస్టాండ్లలో సీసీటీవీ కెమెరాలను అమర్చిన విషయం తెలిసిందే. -
రాత్రి షెల్టర్లుగా పాత డీటీసీ బస్సులు
సాక్షి, న్యూఢిల్లీ: చలి పులి పంజా నుంచి నిరాశ్రయులను తప్పించడానికి ‘ఆప్’ సర్కారు కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుతం నగరంలో ఉన్న రాత్రి షెల్టర్లు కొద్దిమందికి మాత్రమే ఆశ్రయం కల్పించగలుగుతున్నాయి. ఇంకా వందలాదిమంది చలినుం చి ఎటువంటి రక్షణ పొందలేక ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో నిరాశ్రయులకు తక్షణ రక్షణ కల్పించేందుకు అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగించుకునేందుకు సర్కారు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా ఎప్పటినుంచో పనికిరావని వదిలేసిన డీటీసీ బస్సులను తాత్కాలిక నైట్ షెల్టర్లుగా ఉపయోగించాలని యోచిస్తోంది. నగరంలో పనికిరాకుండా పోయిన అన్ని డీటీ సీ బస్సులను నైట్షెల్టర్లుగా మారుస్తున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ మంగళవారం ఫేస్ బుక్‌లో వెల్లడిం చింది. నైట్షెల్టరుగా మార్చిన ఓ బస్సు ఫోటోను కూడా దానికి జోడించారు. పనికి రాకుండా పోయి న బస్సులను తాత్కాలిక నైట్ షెల్టర్లుగా మార్చి వాటిలో బ్లాంకెట్ల వంటి కనీస వసతులను సమకూరుస్తున్నారని, దీని వల్ల నిరాశ్రయులు కనీసం కం టినిండా నిద్ర పోగలుగుతారని అందులో పేర్కొం ది. నగరంలోని ఓ ఎన్జీఓ సహాయంతో ఇప్పటికే రెండు బస్సులను నైట్ షెల్టర్లుగా మార్చి వాడుతున్నారు. నగరంలోని నిరాశ్రయులకు రాత్రి పూట నిద్రించే ందుకు నైట్ షెల్టర్లను అందచేయాలని ఆప్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదేశం మేరకు రాత్రి పూట ఆరుబయట గడిపే నిరాశ్రయులపై సర్కారు సర్వే నిర్వహించిన విషయం తెలిసిందే. దీని ప్రకారం నగరంలోని 212 ప్రాంతాల్లో 4,018 మంది చలిలో రాత్రు లు రోడ్డుపక్కన గడుపుతున్నారు. అయితే వాస్తవ సంఖ్య దీనికన్నా ఎక్కువే ఉంటుందని బాధితులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా నగరంలో నిరాశ్రయుల కోసం త్వరలో 100 నైట్ షెల్టర్లు నిర్మించనున్నట్లు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనీష్ సిసోడియా తెలిపారు.