నగరవాసులకు ముఖ్యంగా మహిళా ప్రయాణికులకు భద్రతే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఢిల్లీ రవాణా సంస్థ (డీటీసీ)
న్యూఢిల్లీ: నగరవాసులకు ముఖ్యంగా మహిళా ప్రయాణికులకు భద్రతే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఢిల్లీ రవాణా సంస్థ (డీటీసీ) తాజాగా 200 బస్సుల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటుచేసింది. రాజ్‌ఘాట్, సరోజినీనగర్ డిపోకు చెందిన బస్సుల్లో వీటిని ఏర్పాటు చేశామని సంబంధిత అధకారి ఒకరు తెలియజేశారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఏడు గంటలపాటు దృశ్యాలను నమోదు చేయగల సామర్థ్యం ఈ కెమెరాలకు ఉందన్నారు. తొలి విడతలో భాగంగా వీటిని బస్సుల్లో అమర్చామన్నారు. మలివిడతలో మరిన్ని బస్సులకు వీటిని ఏర్పాటు చేస్తామన్నారు. తొలి విడత విజయవంతంగా పూర్తయిందన్నారు.
తొలివిడత కింద అమర్చిన సీసీటీవీ కెమెరాల పనితీరును ప్రస్తుతం పరిశీలిస్తున్నామన్నారు. ఈ కెమెరాలు రాత్రి వేళల్లో డీటీసీ బస్సుల్లో రాకపోకలు సాగించే మహిళలకు ఎంతో ఉపయుక్తమవుతాయన్నారు. రాజ్‌ఘాట్, సరోజినీనగర్ డిపోల్లో కంట్రోల్‌రూంలను ఏర్పాటు చేశామని, ఈ కెమెరాలు నమోదు చేసే దృశ్యాలను నిపుణులు ప్రతిరోజూ పరిశీ లిస్తుంటారని తెలిపారు. సీసీటీవీ కెమెరాల్లో 15 గంటలపాటు నమోదైన దృశ్యాలను ఆయా కంప్యూటర్లలో భద్రపరుస్తామని తెలిపారు. డిసెంబర్, 16నాటి సామూహిక అత్యాచార ఘటన నేపథ్యంలో డీటీసీ యాజమాన్యం రాత్రివేళల్లో సేవలందించే బస్సుల్లో ఇద్దరు హోంగార్డులను నియమించిన సంగతి విదితమే.